breaking news
new mayor
-
వలసదారుడే ప్రథమ పౌరుడు
న్యూయార్క్: జొహ్రాన్ క్వామె మమ్దాని 1991 అక్టోబర్ 18న ఉగాండా రాజధాని కంపాలాలో జన్మించారు. గుజరాతీ ముస్లిం ప్రొఫెసర్ మహమూద్ మమ్దాని, బాలీవుడ్ దర్శకురాలు మీరా నాయర్ ఆయన తల్లిదండ్రులు. జొహ్రాన్ మమ్దానికి ఐదేళ్ల వయసున్నప్పుడు వారి కుటుంబం ఉగాండా నుంచి దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌కు వలస వెళ్లింది. ఆయన కేప్‌టౌన్‌లో సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. ఏడేళ్ల వయసున్నప్పుడు కుటుంబంతో కలిసి అమెరికాకు చేరుకున్నారు. మమ్దాని కుటుంబం న్యూయార్క్‌లో స్థిరపడింది. బాంక్స్ హైసూ్కల్ ఆఫ్ సైన్స్ నుంచి ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 2014లో బౌడిన్ కాలేజీ నుంచి ఆఫ్రికన్ స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ స్వీకరించారు. అనంతరం హౌజింగ్ కౌన్సిలర్‌గా పనిచేశారు. న్యూయార్క్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. డెమొ క్రటిక్ పార్టీ ప్రచారకర్తగా సేవలందించారు. 2020లో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2022, 2024లోనూ గెలిచారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో 2024 అక్టోబర్‌లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీలో మాజీ గవర్నర్ ఆండ్రూ కుమోపై పైచేయి సాధించారు. మమ్దాని 2025 ఫిబ్రవరిలో సిరియన్ ముస్లిం రమా సవాఫ్ దువాజీని వివాహం చేసుకున్నారు. ఆమె యానిమేటర్‌గా, ఇల్రస్టేటర్గా పని చేస్తున్నారు. -
ట్రంప్.. సౌండ్ పెంచుకోండి
న్యూయార్క్: న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన జొహ్రాన్ మమ్దాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలపై నిప్పులు చెరిగారు. వలసదారులపై సాగిస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకుంటానని తేల్చిచెప్పారు. రాజకీయ వారసత్వానికి కాలం చెల్లిందని స్పష్టంచేశారు. తన ఎన్నికను అణచివేత, నిరంశకుత్వంపై విజయంగా, ఒక ఆశారేఖగా అభివర్ణించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చరిత్రాత్మక ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ని మమ్దాని ప్రస్తావించారు. చీకటి నుంచి వెలుగులోకి, పాత యుగం నుంచి కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నామని ఉద్ఘాటించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం అర్ధరాత్రి బ్రూక్లిన్ పారామౌంట్‌లో మమ్దాని వేలాదిమంది మద్దతుదారులను ఉద్దేశించి ఆవేశపూరితంగా ప్రసంగించారు. భవిష్యత్తు మన చేతుల్లోని ఉందని అన్నారు. రాజకీయ వారసత్వాన్ని, రాజవంశాన్ని కూల్చేశామని చెప్పారు. మార్పు కోసం, కొత్త తరం రాజకీయాల కోసం న్యూయార్క్ సిటీ గొప్ప తీర్పు ఇచ్చిందని ప్రశంసించారు. నూయార్క్ను మన జీవనానికి అనుకూలంగా మార్చుకోవడానికి ఈ తీర్పు వచ్చిందన్నారు. ప్రజలకు నిజాయతీగా సేవ చేసే ప్రభుత్వం కోసం తీర్పు లభించిందన్నారు. అభిమానుల హర్షధ్వానాల మధ్య మమ్దాని ఇంకా ఏం మాట్లాడారంటే... అవినీతి సంస్కృతిని అంతం చేస్తాం ‘‘ఈరోజు మీ ముందుకు రావడం గర్వంగా ఉంది. జవహర్లాల్ నెహ్రూ మాటలు గుర్తుచేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఒక శకం ముగిసినప్పుడు.. పాత శకం నుంచి కొత్త శకం వైపు అడుగులు వేసినప్పుడు.. సుదీర్ఘకాలం అణచివేతకు గురైన ఒక జాతి ఆత్మ తన గళం వినిపించినప్పుడు.. చరిత్రలో ఇలాంటి క్షణాలు చాలా అరుదుగా వస్తాయి. ఈరోజు పాత శకం నుంచి నూతన శకంలోకి ప్రవేశించాం. అందుకే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎవరూ అపార్థం చేసుకోకుండా స్పష్టంగా, సంకల్పంతో మాట్లాడుకుందాం. వలసదారులతోనే న్యూయార్క్ మరింత శక్తివంతంగా మారుతుంది. ఇకపై వలసదారుడే నగరానికి సారథ్యం వహించబోతున్నాడు. ఒక గొప్ప మార్పునకు మనం కలిసికట్టుగా నాంది పలుకుదాం. అణచివేతను ఎదుర్కొందాం. అంతులేని అధికారం అండతో వలసదారులపై పగబట్టిన డొనాల్డ్ ట్రంప్‌కు బుద్ధి చెబుదాం. డొనాల్డ్ ట్రంప్.. మీరు నా మాటలు వింటున్నారని నాకు తెలుసు. మీకు చెప్పడానికి నాలుగు మాటలున్నాయి. అందుకే సౌండ్ పెంచుకోండి. ధనవంతులు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. ఎందరో ట్రంప్‌లు ప్రజలను అడ్డం పెట్టుకొని అక్రమంగా పైకి ఎదిగారు. ట్రంప్ లాంటి బిలియనీర్లు పన్నులు ఎగవేశారు. పన్ను చట్టాలను ఉల్లంఘించారు. ఇకపై అవినీతి సంస్కృతిని అంతం చేస్తాం. కార్మిక, ప్రజా సంఘాలకు అండగా ఉంటాం. కార్మికుల రక్షణలు మరింత విస్తరింపజేస్తాం. కష్టపడి పనిచేసేవారికి తగిన హక్కులు ఉండాల్సిందే. ఏ జాతి వారైనా ప్రియమైనవారే.. రాజకీయ అంధకారం నుంచి న్యూయార్క్‌ను వెలుగులోకి నడిపిస్తాం. మేము ప్రేమించేవారందరికీ మేము తోడుగా ఉంటాం. వారు వలసదారులైనా, ట్రాన్స్‌జెండర్లయినా, ఏ జాతి వారైనా మాకు ప్రియమైనవారే. ఓ నల్లజాతి మహిళను ప్రభుత్వం ఉద్యోగం నుంచి డొనాల్డ్డ్ట్రంప్ అన్యాయంగా తొలగించారు. ఆ ఒంటరి మహిళ చాలా కష్టాలు పడుతూ బతుకు పోరాటం చేస్తోంది. అందుకే ప్రజల కష్టాలు మా కష్టాలుగానే భావిస్తాం. న్యూయార్క్‌లో అన్ని జాతులకూ సమానమైన ఆదరణ లభిస్తుంది. ఎవరిపైనా ఎలాంటి వివక్ష ఉండదు. నగరంలో ఇస్లామోఫోబియాకు స్థానం లేదు. ముస్లింలు కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, విజయం సొంతం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు యువకుడిని. వృద్ధుడిగా మారినా కూడా ముస్లింగానే ఉంటాను. నేనొక డెమొక్రటిక్ సోషలిస్ట్‌ను. ముస్లింను అయినందుకు క్షమాపణ చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకు నిరాకరిస్తున్నా. నన్ను గెలిపించినందుకు న్యూయార్క్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ధూమ్ మచాలే ధూమ్ ఇలాంటి రోజు ఒకటి ఎప్పటికీ రాదని చాలామంది భావించారు. రాజకీయాలు చాలా క్రూరంగా మారాయని అనుకున్నారు. ఆశను కోల్పోయారు. అలాంటి భయాలకు న్యూయార్క్ నేడు సమాధానం చెప్పింది. ఆశారేఖ సజీవంగానే ఉంది. అసాధ్యం సుసాధ్యం అవుతుందని ప్రజలు విశ్వసించడం వల్లే మనం గెలిచాం. వచ్చే ఏడాది జనవరి 1న మేయర్‌గా బాధ్యతలు స్వీకరిస్తా. నా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నన్ను తీర్చిదిద్దింది వారే. నా భార్య రమా దువాజీకి కూడా కృతజ్ఞతలు’’ అని మమ్దాని పేర్కొన్నారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తల్లిదండ్రులు, భార్య అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ చిత్రం ‘ధూమ్’లోని ‘ధూమ్ మచాలే ధూమ్’ పాట మార్మోగిపోయింది. -
ఢిల్లీ మేయర్‌గా బీజేపీ నేత రాజా ఇక్బాల్ సింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారం దాదాపు రెండేళ్ల తర్వాత బీజేపీకి దక్కింది. ఆ పార్టీకి చెందిన రాజా ఇక్బాల్ సింగ్ శుక్రవారం ఢిల్లీ నూతన మేయర్‌గా ఎన్నికయ్యారు. 142 ఓట్లకు గాను ఇక్బాల్‌కు 133 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌కు చెందిన మన్దీప్ సింగ్‌పై ఇక్బాల్ ఘన విజయం సాధించారు. ఒక ఓటును చెల్లనిదిగా అధికారులు ప్రకటించగా, బీజేపీకి చెందిన ఎంపీ మనోజ్ తివారీ గైర్హాజరయ్యారు. కాంగ్రెస్‌కు మొత్తం 8 ఓట్లు పడ్డాయి. కాగా, ఈ ఎన్నికను ఆప్ బహిష్కరించింది. నెల రోజుల్లో స్టాండింగ్ కమిటీ వేసి ఢిల్లీ ప్రభుత్వం సహకారంతో ప్రజలకు సమస్యలే లేకుండా చేస్తామని ఇక్బాల్ సింగ్ ఎన్నిక అనంతరం ప్రకటించారు. ఇక్బాల్ సింగ్ నార్త్ ఎంసీడీ మేయర్‌గా చేశారు. 2020 దాకా పార్టీ సివిల్ లైన్స్ జోన్ చీఫ్‌గా వ్యవహరించారు. -
పాత వస్తువుల విక్రేత నుంచి మేయర్ పీఠానికి..
చండీగఢ్ : గతంలో పాత వస్తువులు విక్రయించి పొట్టుపోసుకున్న రాజేష్ కలియా చండీగఢ్ నూతన మేయర్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 27 ఓట్లకు గాను 16 ఓట్లు రాబట్టిన కలియా అత్యున్నత పదవిని అలంకరించారు. తిరుగుబాటు నేత సతీష్ కైంథ్కు కేవలం 11 ఓట్లు పోలయ్యాయి. వాల్మీకి వర్గానికి చెందిన తాను అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్ధాయికి చేరుకున్నానని బీజేపీ తనను అక్కునచేర్చుకుని అందలం ఎక్కించిందని చెప్పుకొచ్చారు. తన తండ్రి కుందన్ లాల్ స్వీపర్‌గా పనిచేసేవారని, తన సోదరుల్లో ఒకరు ఇప్పటికీ స్వీపర్‌గా పనిచేస్తున్నారని చెప్పారు. తాను బాల్యంలో స్కూల్‌కు వెళ్లివచ్చిన తర్వాత పాత బట్టలు సేకరించి తన సోదరులతో కలిసి విక్రయించేవాడినని చెప్పారు. తాను ఎదుర్కొన్న కష్టాల నేపథ్యంలో తాను మేయర్‌గా ఎదుగుతానని ఎన్నడూ ఊహించలేదని కలియా పేర్కొన్నారు. 1984లో బీజేపీ, ఆరెస్సెస్‌లో చేరి ఈస్ధాయికి ఎదిగానన్నారు. రామ మందిర ఉద్యమంలో పాల్గొన్నందుకు తాను 15 రోజులు జైలు జీవితం గడిపానని చెప్పారు. -
బీబీఎంపీ మేయర్‌గా శాంతకుమారి
డిప్యూటీ మేయర్‌గా రంగన్న సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీబీఎంపీ కొత్త మేయర్‌గా బీజేపీకి చెందిన శాంత కుమారి, ఉప మేయర్‌గా కే. రంగన్నలు శుక్రవారం ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. కే. శాంత కుమారి మూడలపాళ్య, రంగన్న కామాక్షిపాళ్య వార్డులకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీబీఎంపీ కెంపేగౌడ ఆడిటోరియంలో ఈ ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా, ఉదయం పదిన్నర గంటలకు శాంత కుమారి రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. పార్టీ సీనియర్ సభ్యులు ఎస్కే. నటరాజ్, బీ. సోమశేఖర్లు ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. ఎమ్మెల్యే అశ్వత్థ నారాయణ బలపరిచారు. రంగన్న అభ్యర్థిత్వాన్ని సీకే. రామమూర్తి, సుగుణా బాలకృష్ణ ప్రతిపాదించగా, హెచ్. సురేశ్, సరస్వతమ్మ బలపరిచారు. ఉదయం 11 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం ఉండగా, మరెవరూ సమర్పించక పోవడంతో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మునిసిపల్ శాఖ ప్రాంతీయ కమిషనర్ గౌరవ్ గుప్తా ప్రకటించారు. అనంతరం వారిద్దరినీ పార్టీ సభ్యులతో పాటు ఇతర పార్టీల వారు అభినందించారు. కాగా ఈ ఎన్నికల తర్వాత 12 స్థాయీ సంఘాలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉండగా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రామలింగా రెడ్డి అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడ్డాయి. చెత్త సమస్య పరిష్కారానికి తొలి ప్రాధాన్యత నగరంలో చెత్త సమస్యను పరిష్కరించడానికి తొలి ప్రాధాన్యతను ఇస్తానని శాంత కుమారి తెలిపారు. మేయర్‌గా ఎన్నికైన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతుల ద్వారా చెత్త తొలగింపునకు చర్యలు చేపడతామన్నారు. చెత్తను సంస్కరించడానికి ఇప్పటికే నాలుగు బయోమెథనైజేషన్ యూనిట్లను ఏర్పాటు చేశామని, త్వరలోనే మరి కొన్ని యూనిట్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. బెంగళూరుకు ఉద్యాన నగరి అని ఉన్న పేరును సార్థకం చేయడానికి ప్రతి వార్డులోనూ పార్కులను నిర్మిస్తామని తెలిపారు. బీబీఎంపీ పాఠశాలలు, ఆస్పత్రుల్లో సౌకర్యాలను మెరుగు పరుస్తామని హామీ ఇచ్చారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మరిన్ని అండర్‌పాస్‌లు, ఫ్లైవోవర్లు నిర్మిస్తామని ఆమె వెల్లడించారు. -
‘మేయర్’ ఎంపికపై ఉత్కంఠ
బరిలో నలుగురు ముందంజలో రవీంద్ర, పద్మరాజ్ అశోక్ నేతృత్వంలో చర్చలు అనంతకుమార్ నిర్ణయమే ఫైనల్? బెంగళూరు : బీబీఎంపీ కొత్త మేయర్ ఎంపికలో ఉత్కంఠ నెలకొంది. కాబోయే మేయర్ అవధి కేవలం ఏడు నెలలే ఉండటంతో సమర్థవంతమైన వ్యక్తిని నియమించి మళ్లీ పాలికె ఎన్నికల్లో గెలుపొందాలని కమలనాథులు వ్యూహా లు రచిస్తున్నారు. అందులో భాగంగా గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక్ నేతృత్వంలో పార్టీ నాయకులు, బీబీఎంపీ కార్పొరేటర్లు సమావేశమయ్యారు. ఆ పదవిని తమకు కట్టబెట్టాలంటూ పార్టీపై పలువురు ఒత్తిళ్లు తెస్తున్నారు. ఆ పదవి కోసం సుమారు 10 మందికి పైగా పోటీపడ్డారు. అయితే చివరకు సీనియర్ కార్పొరేటర్లు నంజుండప్ప, రవీంద్ర, శాంతకుమార్, హెచ్ఎస్ పద్మరాజ్ మిగిలారు. వారిలో రవీంద్ర, పద్మరాజ్ ముందంజలో ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం బాగా పని చేశారని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ వద్ద రవీంద్ర మార్కులు కొట్టేశారు. అంతేకాకుండా ఆయనకు అశోక్ ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇక సమాజ సేవ కుడు, సీనియర్ కార్పొరేటర్ పద్మరాజ్‌కు మాజీ మంత్రి సురేష్ కుమార్ అండ ఉంది. వీరిద్దరి కాని పక్షంలో నంజుండప్ప, శాంతకుమారిలో ఒకరికి ఆ అవకాశం ఇవ్వాలని కమలనాథుల ఆలోచన. డిప్యూటీ మేయర్ రేసులో ఇద్దరు ఉన్నారు. శుక్రవారం నూతన మేయర్‌కు ఎన్నిక జరగాల్సి ఉంది. సమావేశం అనంతరం అశోక్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ ఢిల్లీ వెళ్లారని, ఆయన వచ్చిన తర్వాత కోర్ కమిటీతో, పార్టీ కార్పొరేటర్లతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. -
‘కొత్త మేయర్’ పై కాంగ్రెస్ కసరత్తు
సాక్షి, సిటీబ్యూరో : కాంగ్రెస్-ఎంఐఎం ఒప్పందం మేరకు త్వరలో తమ అభ్యర్థిని మేయర్‌గా చేసేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఎంఐఎం మేయర్ మాజిద్ హుస్సేన్ రాజీనామా కోసం కాంగ్రెస్ నుంచి ఎంఐఎంకు లేఖ పంపించినట్లు తెలుస్తోంది. మాజిద్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్నందున తమపార్టీ అభ్యర్థి ఆ పదవి అధిష్టించేందుకు వీలుగా ఆ స్థానాన్ని ఖాళీ చేయాల్సిందిగా కోరుతూ పీసీసీ.. గ్రేటర్ కాంగ్రెస్ ద్వారా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి లేఖ పంపించినట్లు సమాచారం. గత వారమే ఈ లేఖను ఆయనకు అందజేయాల్సి ఉండగా.. పార్లమెంటు సమావేశాల కోసం అసదుద్దీన్ ఢిల్లీ వెళ్లడంతో ఇవ్వలేకపోయార ంటున్నారు. అసదుద్దీన్ నగరానికి వచ్చినందున పీసీసీ సూచన మేరకు.. గ్రేటర్ కాంగ్రెస్ నుంచి లేఖను అసదుద్దీన్‌కు పంపించినట్లు విశ్వసనీయ సమాచారం. నెలరోజుల క్రితమే కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని ఎంఐఎం దృష్టికి తేగా ఒప్పందం మేరకు నడచుకునేందుకు ఎంఐఎం నుంచి ఎలాంటి వ్యతిరేకత లేకపోవడమే కాక.. లాంఛనప్రాయంగా అందజేయాల్సిన లేఖను అందజేయాల్సిందిగా కోరింది. అయినప్పటికీ ఆ విషయాన్ని కాంగ్రెస్ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. ప్రత్యేక తెలంగాణ తదితర అంశాల నేపథ్యంలో వారు జీహెచ్ఎంసీపై పెద్దగా దృష్టి సారించలేదు. కాగా జీహెచ్ఎంసీలోని కాంగ్రెస్ కార్పొరేటర్లు, కొందరు రాష్ట్రనేతలు ఇటీవల ఈ అంశాన్ని పీసీసీ దృష్టికి తేవడంతో.. ఆ దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రానున్నది ఎన్నికల సంవత్సరం అయినందున గ్రేటర్లో పెద్దయెత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నగరంలో పార్టీ ఇమేజ్ను పెంచుకోవాలన్నది కాంగ్రెస్ యోచనగా ఉంది. ఇప్పటినుంచే పావులు కదిపితే కనీసం జనవరి నెలాఖరుకో, లేక ఫిబ్రవరి మొదటి వారానికో కొత్త మేయర్ వచ్చే అవకాశాలున్నాయి. రెండు పార్టీల ఒప్పందం మేరకు.. ఐదేళ్ల మేయర్ పదవీకాలానికి గాను తొలి రెండేళ్లు, చివరి ఏడాది కాంగ్రెస్ అభ్యర్థి.. మధ్యలో రెండేళ్లు ఎంఐఎం అభ్యర్థి మేయర్ పదవిలో కొనసాగాలి. ప్రస్తుత మేయర్ మాజిద్ హుస్సేన్ బాధ్యతలు స్వీకరించి త్వరలోనే రెండేళ్లు పూర్తికానుంది. వాస్తవానికి డిసెంబర్ నాటికే మేయర్ పదవికి రెండేళ్లు పూర్తి కానున్నప్పటికీ.. తొలి రెండేళ్లు మేయర్‌గా వ్యవహరించిన కార్తీకరెడ్డి రాజీనామా చేయడంలో జరిగిన జాప్యం.. కొత్త మేయర్ ఎన్నిక ప్రక్రియ తదితరమైన వాటితో 2012 జనవరి 3న మాజిద్ బాధ్యతలు స్వీకరించారు.


