న్యూయార్క్: జొహ్రాన్ క్వామె మమ్దాని 1991 అక్టోబర్ 18న ఉగాండా రాజధాని కంపాలాలో జన్మించారు. గుజరాతీ ముస్లిం ప్రొఫెసర్ మహమూద్ మమ్దాని, బాలీవుడ్ దర్శకురాలు మీరా నాయర్ ఆయన తల్లిదండ్రులు. జొహ్రాన్ మమ్దానికి ఐదేళ్ల వయసున్నప్పుడు వారి కుటుంబం ఉగాండా నుంచి దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌కు వలస వెళ్లింది. ఆయన కేప్‌టౌన్‌లో సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించారు. ఏడేళ్ల వయసున్నప్పుడు కుటుంబంతో కలిసి అమెరికాకు చేరుకున్నారు. మమ్దాని కుటుంబం న్యూయార్క్‌లో స్థిరపడింది. బాంక్స్ హైసూ్కల్ ఆఫ్ సైన్స్ నుంచి ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.
2014లో బౌడిన్ కాలేజీ నుంచి ఆఫ్రికన్ స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ స్వీకరించారు. అనంతరం హౌజింగ్ కౌన్సిలర్‌గా పనిచేశారు. న్యూయార్క్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. డెమొ క్రటిక్ పార్టీ ప్రచారకర్తగా సేవలందించారు. 2020లో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2022, 2024లోనూ గెలిచారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో 2024 అక్టోబర్‌లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీలో మాజీ గవర్నర్ ఆండ్రూ కుమోపై పైచేయి సాధించారు. మమ్దాని 2025 ఫిబ్రవరిలో సిరియన్ ముస్లిం రమా సవాఫ్ దువాజీని వివాహం చేసుకున్నారు. ఆమె యానిమేటర్‌గా, ఇల్రస్టేటర్‌గా పని చేస్తున్నారు.


