కెనడా నుంచి లండన్ మీదుగా 1985 జూన్ 23న భారత్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఐర్లాండ్ తీరానికి సమీపంలో గగనతలంలో పేలిపోయింది. ఆ విమానంలో ఉన్న 329 మంది అంతా మరణించారు. ఆ ఘటనను భారత్ ఎన్నటకీ మర్చిపోలేదు. 1985లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 పేలుడు వెనుక ఖలిస్తానీ ఉగ్రవాదులే ఉన్నారని భారత్ మొదటి నుంచీ చెబుతోంది.
కానీ, కెనడా ప్రభుత్వం లేదా దాని గూఢచారి సంస్థలు ఇంతకాలం బహిరంగంగా "ఖలిస్తానీలే బాంబు పెట్టారు" అని స్పష్టంగా చెప్పలేదు. ఇప్పుడు తొలిసారిగా కెనడా ప్రధాన గూఢచారి సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్ఐఎస్) తొలిసారిగా అధికారికంగా ఆ విషయాన్ని చెప్పింది.
"కెనడాలో ఉన్న ఖలిస్తానీ తీవ్రవాదులు విమానంలో బాంబు పెట్టారు. ఆ పేలుడుతో 329 మంది మరణించారు" అని పేర్కొంది. ఇన్నేళ్లుగా భారత్ చేస్తున్న ఆరోపణను కెనడా ఇప్పుడు అధికారికంగా అంగీకరించినట్లయింది. ఖలిస్తానీ తీవ్రవాదులు కెనడా నేలపై పనిచేస్తున్నారన్న భారత వాదనకు బలం చేకూరింది. కెనడా గతంలో ఖలిస్తానీ అంశంపై తీసుకున్న వైఖరిలో మార్పు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సీఎస్ఐఎస్ ఏమని చెప్పింది?
ఈ విషాదాన్ని స్మరించుకుంటూ బుధవారం ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టులో.. సీఎస్ఐఎస్ నేరుగా వేర్పాటువాద ఉద్యమాన్నే ఈ దాడికి బాధ్యులుగా పేర్కొంది. “కెనడాలో ఉన్న ఖలిస్తానీ తీవ్రవాదులు 1985 జూన్ 23న అమర్చిన బాంబు విమానాన్ని ధ్వంసం చేసింది. అందులో ఉన్న వారంతా మరణించారు. వారిలో ఎక్కువ మంది కెనడియన్లు. ఇది ఇప్పటికీ కెనడా చరిత్రలో అత్యంత ప్రాణాంతక ఉగ్రదాడి” అని సీఎస్ఐఎస్ తెలిపింది.
టొరొంటో నుంచి ముంబైకి వెళ్తున్న బోయింగ్ 747 విమానం ‘ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 ఎంపెరర్ కనిష్క’పై జరిగిన ఈ బాంబు దాడి కెనడా చరిత్రలోనే అత్యంత ఘోర ఉగ్రదాడిగా నిలిచింది. 2001 సెప్టెంబర్ 11 దాడుల వరకు ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక విమాన ఉగ్రదాడిగా నిలిచింది.
నిషేధిత ఖలిస్తానీ సంస్థ బబ్బర్ ఖాల్సా సభ్యులు సామాన్ల విభాగంలో అమర్చిన బాంబు పేలడంతో అట్లాంటిక్ మహాసముద్రం పైనే విమానం ముక్కలైంది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. 2005లో ఈ విషాద ఘటన వార్షిక దినమైన జూన్ 23ను ఉగ్రవాద బాధితుల జాతీయ స్మరణ దినంగా కెనడా ప్రకటించింది.
ఖలిస్తానీ ఉద్యమాన్నే ఈ దాడికి బాధ్యులుగా సీఎస్ఐఎస్ స్పష్టంగా పేర్కొనడం, కొద్ది నెలల క్రితం విడుదల చేసిన వార్షిక నివేదిక తర్వాత చోటుచేసుకోవడం గమనార్హం. ఆ నివేదికలో ఖలిస్తానీ తీవ్రవాదులను జాతీయ భద్రతకు ముప్పుగా పేర్కొన్న విషయం తెలిసిందే.
కెనడాలో ఉన్న ఖలిస్తానీ తీవ్రవాద గ్రూపులు కెనడా భూభాగాన్ని వినియోగించి హింసాత్మక తీవ్రవాద కార్యాచరణను ప్రోత్సహిస్తున్నాయి, అలాగే హింసాత్మక కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తూ సమన్వయం చేస్తున్నాయని సీఎస్ఐఎస్ హెచ్చరించింది.
భారత్‌కు కీలకం
కెనడాలో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాదులే ఆ విమానానికి పేలుడు పదార్థాన్ని అమర్చారని సీఎస్ఐఎస్ స్పష్టంగా చేసిన ప్రకటన భారత్‌కు ఎంతో కీలకం. ఇరు దేశాల మధ్య ఖలిస్తానీ అంశంపై కొనసాగుతున్న దౌత్య వివాదంలో ఇది భారత్‌కు కీలక విజయంగా భావిస్తున్నారు.
భారత్ ఎన్నో ఏళ్లుగా ఖలిస్తానీ కార్యకలాపాలపై ఆందోళనలు వ్యక్తం చేసినా, కెనడా వాటిని పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. భారత్‌లో ఆ ఉద్యమం క్షీణించిన తర్వాత కూడా కెనడా వాటికి ఆశ్రయం కల్పించిందని భారత్ చెబుతూ వచ్చింది.
మాజీ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పాలన సహా వరుస కెనడియన్ ప్రభుత్వాలు ఈ అంశంపై భారత్‌తో వివాదానికి దిగాయి. ట్రూడో ప్రభుత్వం అయితే కెనడియన్ పౌరులపై హింసాత్మక సరిహద్దు దాటి భారత్ అణచివేత కార్యక్రమాన్ని నిర్వహించిందని కూడా ఆరోపించింది. అయితే చాలా కాలంగా తమ భూభాగంలో పనిచేస్తున్న ఖలిస్తానీ నెట్‌వర్క్‌ల వల్ల ఏర్పడిన ముప్పును కెనడియన్ సంస్థలు ఇప్పుడు గుర్తించడం ప్రారంభించడంతో, భారత్ చెబుతున్న వాదనకు బలం చేకూరినట్లు కనిపిస్తోంది.


