ట్రంప్‌ సంచలన ప్రకటన | Donald Trump Share map paints Iran in American colours | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ సంచలన ప్రకటన

May 24 2026 8:15 AM | Updated on May 24 2026 8:15 AM

Donald Trump Share map paints Iran in American colours

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఈసారి ఏకంగా ఇరాన్‌ను అమెరికా జెండా రంగులతో కప్పేశారు ట్రంప్‌. ఇరాన్‌ దేశ చిత్ర పటాన్ని అమెరికా జెండా రంగులతో ఎడిట్‌ చేసిన చిత్రాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అంతటితో ఆగకుండా దానికి "మధ్యప్రాచ్యపు యునైటెడ్ స్టేట్స్?" అనే క్యాప్షన్ జతచేశారు. దీంతో, ట్రంప్‌ చర్య.. పెను దుమారానికి దారి తీసింది.

అయితే.. వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్‌పై సాధ్యమయ్యే సైనిక చర్యపై అమెరికా ప్రభుత్వంలో చర్చలు మళ్లీ మొదలైన తరుణంలో ఈ పోస్ట్ చేయడం గమనార్హం. ఇక, కొన్ని రోజుల క్రితం ఇరాన్ పడవలపై క్షిపణి దాడులు, అంతరిక్ష యుద్ధం, ఇరాన్‌పై ఎగురుతున్న అమెరికా జెండాను చిత్రీకరిస్తూ ఏఐ (AI) రూపొందించిన చిత్రాలను కూడా ట్రంప్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, యాక్సియోస్ నివేదికలో ఉటంకించిన అమెరికా అధికారుల ప్రకారం.. చివరి నిమిషంలో చేసే దౌత్య ప్రయత్నాలు పురోగతిని సాధించడంలో విఫలమైతే, ఇరాన్‌పై కొత్తగా సైనిక దాడులు ప్రారంభించడాన్ని ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. పశ్చిమాసియా యుద్ధం విషయంలో ఇరాన్‌తో ఒప్పందం కుదిరేందుకు 50-50 అవకాశాలున్నాయని ట్రంప్‌ ప్రకటించారు. యుద్ధాన్ని తిరిగి ప్రారంభించాలా లేదా అనేదానిపై ఆదివారం ఆయనొక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇరాన్‌ వ్యవహారంలో రెండు అంశాల్లో ఏదో ఒకటి జరుగుతుందని అనుకుంటున్నానని వెల్లడించారు. ఒకటి.. వారు(ఇరాన్‌) ఇంతకు ముందెన్నడూ ఎదుర్కోనంత గట్టిగా తాను దెబ్బకొడతానని వ్యాఖ్యానించారు. రెండోది.. ఒక మంచి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు చేస్తాయని పేర్కొన్నారు. యుద్ధం కావాలో లేక ఒప్పందం కావాలో ఇరాన్‌ త్వరగా తేల్చుకోవాలని సూచించారు. కాగా, ఇరాన్‌‌లో కొత్తగా దాడులకు ట్రంప్‌ యంత్రాంగం సిద్ధమవుతోందని కొన్ని వార్తాసంస్థలు అంచనా వేస్తున్నాయి.  

ఇరాన్‌ నేతలతో మునీర్‌ భేటీ  
పశ్చిమాసియాలో ఘర్షణను తెరదించాలని పాకిస్తాన్‌ తన వంతు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌ ఇరాన్‌లో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చితోపాటు ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బాఘేర్‌ ఘలిబాఫ్‌ను కలుసుకున్నారు. తాజా పరిణామాలపై వారితో చర్చించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను నివారించడం.. శాంతి, స్థిరత్వం, భద్రతను ప్రోత్సహించడంపై సంప్రదింపులు జరిపారు. ఇరాన్, పాకిస్తాన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలు, వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకొనే మార్గాలపై పెజెష్కియాన్, అసిమ్‌ మునిర్‌ చర్చించుకున్నట్లు ఇరాన్‌ అధికారిక తస్నిమ్‌ వార్తా సంస్థ తెలియజేసింది.

Advertisement
 
Advertisement
Advertisement