చైనా ఈవీలపై కెనడా టారిఫ్‌లు 100 శాతం తగ్గింపు
కెనడా ఉత్పత్తులపై ఇప్పటికే టారిఫ్‌లు తగ్గించిన చైనా
బీజింగ్: కెనడా క్రమంగా అమెరికాకు దూరమవుతూ చైనాకు దగ్గరవుతోంది. చైనా నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రానిక్ వాహనాలపై టారిఫ్‌లను 100 శాతం తగ్గించనున్నట్టు కెనడా ప్రధాని మార్క్ కార్నీ శుక్రవారం ప్రకటించారు. కెనడా వ్యవసాయ ఉత్పత్తులపై చైనా ఇప్పటికే టారిఫ్‌లను 84 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. ఇరుదేశాల నేతలు రెండు రోజుల క్రితం బీజింగ్‌లో సమావేశమయ్యారు. వాణిజ్య బంధం బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. ఐదేళ్లలో చైనా నుంచి 70 వేలకు పైగా ఈవీలను దిగుమతి చేసుకుంటామని కార్నీ వెల్లడించారు. గత రెండు రోజులు చరిత్రాత్మక, ఫలవంతమైన దినాలు అంటూ వ్యాఖ్యానించారు.
కెనడాతో సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్తామని చైనా అధినేత జీ జిన్‌పింగ్ స్పష్టంచేశారు. గత ఏడాది అక్టోబర్‌లో మార్క్ కార్నీతో సమావేశమయ్యాయని, చైనా–కెనడా సంబంధాల్లో అప్పుడే నూతన అధ్యాయం ప్రారంభమైందని స్పష్టంచేశారు. గత ఎనిమిదేళ్లలో చైనాలో పర్యటించిన తొలి కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ రికార్డుకెక్కారు. వాస్తవానికి కెనడా, చైనాల మధ్య టారిఫ్‌ల యుద్ధం నడిచింది. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత కెనడా ప్రభుత్వం చైనా వైపు మొగ్గుచూపుతోంది.


