అమెరికా లేకుంటే.. ఇజ్రాయెల్‌ పరిస్థితి ఇదేనా? | Can Israel Survive Without The US? JD Vance’s Remark Sparks Global Debate, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

అమెరికా లేకుంటే.. ఇజ్రాయెల్‌ పరిస్థితి ఇదేనా?

Jun 20 2026 9:04 AM | Updated on Jun 20 2026 10:20 AM

Can Israel defend itself without USA help Here the answer

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్-ఇజ్రాయెల్ విభేదాలు, హెజ్‌బొల్లా-హమాస్ ముప్పుల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఇరాన్‌తో అమెరికా అవగాహన ప్రయత్నాలను ఇజ్రాయెల్ విమర్శిస్తున్న వేళ.. ఇజ్రాయెల్‌కు మిగిలిన ఏకైక శక్తివంతమైన మిత్రదేశం అమెరికానే అని వాన్స్ వ్యాఖ్యానించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఈ వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రశ్న మరోసారి చర్చనీయాంశంగా మారింది. అమెరికా మద్దతు లేకుండా ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోగలదా?. రక్షణ నిపుణులు, వ్యూహాత్మక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, దీనికి సరళమైన సమాధానం లేదు. స్వల్పకాలిక యుద్ధాలు, పరిమిత దాడులను ఇజ్రాయెల్ స్వయంగా ఎదుర్కోగలిగినా, దీర్ఘకాలిక ప్రాంతీయ యుద్ధంలో అమెరికా సహకారం కీలకంగా మారుతుందని వారు చెబుతున్నారు.

అత్యంత శక్తివంతమైన సైన్యాల్లో ఒకటి
ఇజ్రాయెల్ భౌగోళికంగా చిన్న దేశమే అయినప్పటికీ, సైనిక పరంగా అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశంలో తప్పనిసరి సైనిక సేవా విధానం ఉండటంతో భారీ స్థాయిలో శిక్షణ పొందిన రిజర్వ్ బలగాలు అందుబాటులో ఉంటాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాల వద్ద అత్యాధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు, సైబర్ యుద్ధ సామర్థ్యాలు, అత్యున్నత నిఘా సాంకేతికత ఉన్నాయి. అలాగే మోసాద్‌, ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన భద్రతా సంస్థలుగా గుర్తింపు పొందాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రక్షణ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, సాధారణ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ తన సరిహద్దులను రక్షించుకోవడానికి అవసరమైన సామర్థ్యాన్ని పూర్తిగా కలిగి ఉంది.

అమెరికా ఎందుకు ముఖ్యమైంది?
ఇజ్రాయెల్ బలమైన దేశమే అయినప్పటికీ, అమెరికాతో దాని సంబంధం కేవలం మిత్రదేశ స్థాయిలో మాత్రమే లేదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థకు ప్రధాన ఆధారంగా మారింది. ప్రతీ సంవత్సరం అమెరికా ఇజ్రాయెల్‌కు బిలియన్ల డాలర్ల విలువైన సైనిక సహాయాన్ని అందిస్తోంది. ఇందులో ఆధునిక యుద్ధ విమానాలు, ఖచ్చిత లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ సాంకేతికత, గూఢచార సమాచార సహకారం ఉంటాయి. ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐరన్‌ డోమ్‌ వ్యవస్థ అభివృద్ధి, నిర్వహణలో అమెరికా ఆర్థిక సహకారం కీలక పాత్ర పోషించింది. గాజా, లెబనాన్ ప్రాంతాల నుంచి వచ్చే రాకెట్లను అడ్డుకోవడంలో ఈ వ్యవస్థ ప్రధాన రక్షణ కవచంగా నిలుస్తోంది.

ఇరాన్‌తో ప్రత్యక్ష యుద్ధం వస్తే..
ఇటీవలి కాలంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్‌కు మద్దతుగా హెజ్‌బొల్లా, హూతీలు, ఇతర ప్రాంతీయ మిత్ర బలగాలు ఉండటం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. రక్షణ నిపుణుల అంచనా ప్రకారం, ఒకేసారి ఇరాన్, హెజ్‌బొల్లా, హమాస్ వంటి పలు వర్గాల నుంచి దాడులు జరిగితే ఇజ్రాయెల్‌పై భారీ ఒత్తిడి పడుతుంది. క్షిపణి నిరోధక వ్యవస్థల నిల్వలు వేగంగా ఖాళీ కావడం, ఆయుధాల వినియోగం పెరగడం, ఆర్థిక వ్యయం విపరీతంగా పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో అమెరికా నుంచి ఆయుధాలు, విడిభాగాలు, ఇంటర్‌సెప్టర్ క్షిపణులు, గూఢచార సమాచారం నిరంతరం అందడం ఇజ్రాయెల్‌కు కీలక బలంగా మారుతుంది.

అయితే, అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు లభించే అతిపెద్ద మద్దతు కేవలం సైనిక సహాయం మాత్రమే కాదు. అంతర్జాతీయ వేదికలపై అమెరికా రాజకీయ అండ కూడా అత్యంత కీలకం. యునైటెడ్‌ నేషన్స్‌ భద్రతా మండలిలో ఇజ్రాయెల్‌పై విమర్శలు లేదా చర్యలకు సంబంధించిన అనేక తీర్మానాలను అమెరికా గతంలో వీటో చేసింది. అమెరికా మద్దతు తగ్గితే ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వాన్స్ అసలు సందేశం ఇదేనా?
జేడీ వాన్స్ వ్యాఖ్యలను కేవలం రక్షణ అంశంగా మాత్రమే కాకుండా రాజకీయ సంకేతంగా కూడా విశ్లేషిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, అవసరమైతే వాషింగ్టన్ తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుందని ట్రంప్ ప్రభుత్వ వర్గాలు పరోక్షంగా తెలియజేస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇరాన్ విషయంలో దౌత్యపరమైన పరిష్కారాలను అమెరికా ప్రాధాన్యంగా చూస్తున్న సమయంలో, ఇజ్రాయెల్ మరింత కఠిన వైఖరిని అవలంబిస్తే రెండు దేశాల మధ్య అభిప్రాయ భేదాలు మరింత పెరిగే అవకాశముందని వారు చెబుతున్నారు.

మొత్తానికి.. ఇజ్రాయెల్ స్వయంగా తనను తాను రక్షించుకునే శక్తి కలిగిన దేశమే. కానీ మధ్యప్రాచ్య స్థాయిలో దీర్ఘకాలిక, బహుముఖ యుద్ధం ఎదురైతే అమెరికా సహాయం దాని సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. అందుకే నిపుణులు చెబుతున్న మాట ఒక్కటే.. ఇజ్రాయెల్‌కు అమెరికా అవసరం మనుగడ కోసం కాదు.. ఆధిపత్యం కొనసాగించడానికి అని తెలుస్తోంది.

ఇజ్రాయెల్ వద్ద సైన్యం..

  • దాదాపు 1.7 లక్షల యాక్టివ్ సైనికులు

  • 4 లక్షలకుపైగా రిజర్వ్ దళాలు

  • వందల సంఖ్యలో ఆధునిక యుద్ధవిమానాలు

  • అధునాతన డ్రోన్లు

  • సైబర్ యుద్ధ సామర్థ్యాలు

  • ప్రపంచంలోనే అత్యుత్తమ గూఢచారి వ్యవస్థల్లో ఒకటైన మోసాద్‌

  • అణ్వాయుధ సామర్థ్యం (అధికారికంగా అంగీకరించకపోయినా)


అమెరికా నుంచి వచ్చే సహాయంలో..

  • అత్యాధునిక ఆయుధాలు

  • F-35 యుద్ధవిమానాలు

  • క్షిపణి నిరోధక వ్యవస్థల కోసం నిధులు

  • రాడార్, నిఘా సాంకేతికత

  • విడిభాగాలు, మందుగుండు సామగ్రి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement