ఇరాన్–అమెరికా మధ్య అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగిన మరుసటిరోజే పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. దక్షిణ లెబనాన్‌లోని నబాతియే ప్రాంతంపై ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 16 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.
లెబనాన్ జాతీయ వార్తా సంస్థ (NNA) తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి తరువాత ఈ దాడులు జరిగాయి. నబాతియే నగరంతో పాటు క్ఫర్ జౌజ్, క్ఫర్ రేమాన్, జెబ్డైన్ పట్టణాలపై బాంబుల వర్షం కురిసింది. ఇటు క్ఫర్ టిబ్నిట్, రేహాన్ హైట్స్ ప్రాంతాలపై వరుసగా వైమానిక దాడులు జరిగాయని తెలుస్తోంది.
నబాతియే, హరూఫ్ ప్రాంతాల్లో కనీసం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అల్-షర్కియా, డువైర్ మధ్య ఉన్న ఓ ఇంటిపై జరిగిన దాడిలో నలుగురు మరణించారు. క్ఫర్ సిర్ పట్టణంలో జరిగిన మరో దాడిలో ముగ్గురు మృతి చెందినట్లు ఎన్‌ఎన్‌ఏ వెల్లడించింది. అదే సమయంలో డువైర్ మునిసిపాలిటీ భవనం సమీపంలో మోటార్‌సైకిల్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్ దాడిలో ఒకరు మరణించగా, మరొకరు గాయపడ్డారు. ఈ దాడులతో దక్షిణ లెబనాన్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
డీల్ కొలిక్కి రావడంలో ఆలస్యానికి లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యం కూడా ఓ కారణమే!. కాల్పుల విరమణ అమల్లో ఉండగానే.. హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 5 వేల మంది మరణించగా.. సాధారణ పౌరులే ఉన్నారనని చెబుతూ ఇజ్రాయెల్‌పై లెబనాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇటు లెబనాన్‌పై దాడులు ఆపకపోతే ఒప్పందానికి ముందుకు రామని.. అవసరమైతే భీకర యుద్ధం చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తూ వచ్చింది. దీంతో ఈ విషయంలో మిత్రదేశాలైన అమెరికా-ఇజ్రాయెల్ మధ్య మాటల యుద్ధం సైతం నడిచింది. ఒకానొక టైంలో దాడులు ఆపాలంటూ నెతన్యాహును ఉద్దేశించి ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు సైతం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే.. అవేవీ పట్టించుకోకుండా నెతన్యాహు ఇంతకాలం లెబనాన్‌పై పరిమిత దాడులు జరిపిస్తూ వచ్చారు. ఇజ్రాయెల్‌లో రాజకీయ ఒత్తిళ్లే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

హర్ముజ్ వేదికగా ఇంతకాలం కొనసాగిన ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలకు డీల్ తర్వాత చెక్ పడింది. అయితే.. ఈ డీల్‌పై ఇజ్రాయెల్‌లో నెతన్యాహు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజా దాడులు జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ దాడులపై ఇటు ఇరాన్, అటు అమెరికాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.


