న్యూఢిల్లీ: విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత దేశానికి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లలో ఇద్దరిని అరెస్టు చేయడంలో భారత భద్రతా సంస్థలు విజయాన్ని సాధించాయి. హర్యానా పోలీసులతోపాటు భద్రతా సంస్థ అధికారులు జార్జియాలో వెంకటేష్ గార్గ్‌ను అరెస్టు చేయగా, భాను రాణాను అమెరికాలో అరెస్టు చేశారు.
ప్రస్తుతం భారతదేశానికి చెందిన 25 మందికి పైగా గ్యాంగ్‌స్టర్లు దేశం వెలుపల ఉన్నారు. వీరు క్రిమినల్ సిండికేట్‌లను నడుపుతున్నారని ‘ఎన్‌డీటీవీ’ తన కథనంలో పేర్కొంది. గార్గ్, రాణాలను అరెస్టు చేయడానికి సాగించిన ఆపరేషన్‌లో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయని సమాచారం. గార్గ్.. హర్యానాలోని నారాయణ్‌గఢ్ నివాసి. ప్రస్తుతం జార్జియాలో ఉంటున్న గార్గ్‌పై భారతదేశంలో 10 కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతను హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, తదితర రాష్ట్రాలకు చెందిన యువతను ప్రలోభపెట్టిన తన బృందంలో నియమించుకుంటాడు. గురుగ్రామ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) నేత హత్య తరువాత అతను జార్జియాకు పారిపోయాడు.
గార్గ్ ప్రస్తుతం విదేశాలలో ఉంటున్న గ్యాంగ్‌స్టర్ కపిల్ సంగ్వాన్‌తో కలిసి దోపిడీ సిండికేట్‌ను నడుపుతున్నాడు. కాగా భాను రాణా .. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం కలిగి ఉంటూ, చాలా కాలంగా అమెరికాలో నివసిస్తున్నాడు. కర్నాల్ నివాసి అయిన రాణా చాలా కాలంగా నేర ప్రపంచంలో చురుగ్గా ఉన్నాడు. అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. రాణా నేర నెట్‌వర్క్ హర్యానా, పంజాబ్, ఢిల్లీ వరకు విస్తరించి ఉంది.
పంజాబ్‌లో జరిగిన గ్రెనేడ్ దాడి దర్యాప్తులో అతని పేరు బయటకు వచ్చింది.
ఇది కూడా చదవండి: 11న భూటాన్‌కు ప్రధాని మోదీ


