ఇరాన్‌తో అమెరికా యుద్ధం మెుదలు పెట్టి దాదాపు ఎనిమిది నెలల పుర్తికావస్తోంది. అయినప్పటికీ యుద్దం ముగింపు విషయంలో ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. అయితే ఈ యుద్ధం కారణంగా అమెరికా పెద్దఎత్తున నష్టపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. వాషింగ్టన్‌కు చెందిన ఆధునాతన ఫైటర్ జెట్లతో పాటు ఇతర డ్రోన్లు తదితర యుద్ధసామాగ్రి కోల్పోయినట్లు నివేదిక తెలిపింది. వీటి విలువ మూడు బిలియన్లకుపైగా అమెరికా డాలర్లని నివేదిక పేర్కొంది.
ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యానికి భారీ స్థాయిలో విమాన నష్టం జరిగినట్లు తాజాగా కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ (CRS) నివేదిక వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికాకు చెందిన కనీసం 81 సైనిక విమానాలు, డ్రోన్లు ధ్వంసం కావడం లేదా దెబ్బతినడం జరిగిందని నివేదిక పేర్కొంది. ఈ నష్టాల విలువ దాదాపు 3.3 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేసింది. అమెరికా అత్యాధునిక యుద్ధ విమానాలైన F-35A, F-15E, అలాగే భారీ సంఖ్యలో MQ-9 Reaper డ్రోన్లు సైతం ఇందులో ఉన్నాయి.
అయితే, కొన్ని సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఇప్పటికీ రహస్యంగా ఉండటం, యుద్ధం కొనసాగుతుండటం, కొన్ని ఘటనలకు బాధ్యతను ఖచ్చితంగా నిర్ధారించడం కష్టంగా ఉండటంతో ఈ సంఖ్యలు భవిష్యత్తులో మారే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది. అలాగే దెబ్బతిన్న కొన్ని విమానాలను మరమ్మతులు చేసి తిరిగి సేవల్లోకి తీసుకురావచ్చని పేర్కొంది.
నివేదిక ప్రకారం అమెరికా 12 F-15E యుద్ధ విమానాలు, ఒక F-35A ఫైటర్, రెండు A-10 గ్రౌండ్-అటాక్ విమానాలు, ఏడు KC-135 ఇంధన సరఫరా విమానాలను కోల్పోయింది. ఒక్కో F-15 విమానం విలువ 30 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. ఇక F-35A అత్యాధునిక ఐదో తరం యుద్ధ విమానాల్లో ఒకటి కాగా, దాని విలువ 92 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని నివేదిక పేర్కొంది.
F-15E విమానాల నష్టాల్లో కొన్ని ఘటనలు ప్రత్యేకంగా నమోదయ్యాయి. మార్చి 2న కువైట్ గగనతలంలో జరిగిన ఫ్రెండ్లీ ఫైర్ ఘటనలో మూడు F-15E విమానాలు కూలిపోయాయి. ఆ తర్వాత ఏప్రిల్‌లో మరో F-15E విమానం ఇరాన్‌పై జరిగిన చర్యలో కూలిపోయింది. మరోవైపు, సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జోర్డాన్‌లోని మువాఫాక్ అల్-సాల్టీ ఎయిర్ బేస్‌పై జరిగిన ఇరాన్ వైమానిక దాడుల్లో కనీసం మరో ఎనిమిది F-15E విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అని నివేదిక తెలిపింది.
యుద్ధంలో అమెరికాకు కలిగిన నష్టాల్లో భారీ వాటా డ్రోన్లదే. మొత్తం 45 MQ-9 Reaper మల్టీ-రోల్ అన్‌క్రూడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కోల్పోయినట్లు నివేదిక పేర్కొంది. ఒక్కో MQ-9 Reaper విలువను సుమారు 30 నుంచి 50 మిలియన్ డాలర్ల మధ్యగా అంచనా వేస్తున్నారు. వీటితో పాటు ఒక MQ-4C Triton హై-ఆల్టిట్యూడ్ లాంగ్-ఎండ్యూరెన్స్ డ్రోన్, మూడు MQ-1 మల్టీ-రోల్ అన్‌క్రూడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు అమెరికా కోల్పోయింది.
ఈ నష్టాల కారణంగా అమెరికా సైనిక సామర్థ్యాలపై ఆర్థిక భారం కూడా గణనీయంగా పెరిగింది. విమానాలు, డ్రోన్ల నష్టంతో పాటు ఇరాన్ యుద్ధంలో అమెరికా ఉపయోగించిన ఆయుధాల వ్యయం కూడా భారీగా పెరిగింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అంచనా ప్రకారం, యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాల ఖర్చు కేవలం నెలకు పైగా వ్యవధిలో 21.7 బిలియన్ డాలర్ల నుంచి 28.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే ఆయుధాల వ్యయం మాత్రమే 6 బిలియన్ డాలర్లకు పైగా పెరిగినట్లు లెక్కలు సూచిస్తున్నాయి.
అయితే, ఇవి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ఆధారంగా రూపొందించిన అంచనాలు మాత్రమేనని CRS నివేదిక స్పష్టం చేసింది. యుద్ధ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో విమానాలు, డ్రోన్ల నష్టం సంఖ్య, వాటి ఆర్థిక విలువ భవిష్యత్తులో మరింత మారే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: రాహుల్ గాంధీ అరెస్ట్


