జీహెచ్‌ఎంసీ విభజన తర్వాత సమన్వయానికి ఏర్పాటు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)ని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత ఉమ్మడి డిజిటల్ సేవలు, ఐటీ మౌలిక వసతుల నిర్వహణలో సమన్వయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) పరిధిలో కొనసాగుతున్న సాధారణ ఐటీ సేవల నిర్వహణకు సంయుక్త కమిటీని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ జారీ చేసిన జీఓ నెంబర్ 541 మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ కమిటీకి చైర్మన్. జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు సభ్యులుగా, ఆయా సంస్థల ఐటీ విభాగ అదనపు కమిషనర్లు కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు.
అంతరాయం లేకుండా కార్యకలాపాలు
మూడు కార్పొరేషన్లకు ఉమ్మడిగా పనిచేస్తున్న అన్ని ఐటీ ప్రాజెక్టులు, డిజిటల్ ప్లాట్‌ఫారాలు, సాఫ్ట్‌వేర్ ఒప్పందాలు, క్లౌడ్, హోస్టింగ్ సేవలు, యాన్యువల్ మెయింటనెన్స్ కాంట్రాక్టులు తదితరమైనవాటిని అంతరాయం లేకుండా కొనసాగించనున్నారు. సాధారణంగా వీటి నిర్వహణ వ్యయాన్ని మూడు కార్పొరేషన్లు సమానంగా భరించాల్సి ఉండగా, అవసరాన్ని బట్టి వినియోగం ఆధారంగా వ్యయ పంపిణీపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కమిటీకి ఇచ్చారు. అమలులో ఉన్న ప్రాజెక్టుల్లో మార్పులు, సాంకేతిక నవీకరణలు, ఆర్థిక సవరణలు, డేటా మైగ్రేషన్ వంటివన్నీ సంయుక్త కమిటీ ఆమోదంతోనే అమలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
కమిటీ పరిశీలించాకే..
భవిష్యత్తులో చేపట్టే కొత్త ఐటీ ప్రాజెక్టులు, ప్రాంతీయ స్థాయి ఈ–గవర్నెన్స్ వ్యవస్థలు, ఉమ్మడి డిజిటల్ మౌలిక వసతులకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ముందుగా ఈ కమిటీ పరిశీలనకు వెళ్లాల్సి ఉంటుంది. సాంకేతిక సాధ్యత, ఆర్థిక సామర్థ్యం, సైబర్ భద్రత, డేటా గవర్నెన్స్, విస్తరణ సామర్థ్యం వంటి అంశాలపై సమగ్రంగా పరిశీలించిన తరువాతే ఆమోదించనున్నారు. ప్రతి కార్పొరేషన్ తమ స్థానిక పరిపాలనా అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లనుగానీ, మాడ్యూళ్లనుగానీ స్వతంత్రంగా అమలు చేసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించింది. అయితే అవి ఉమ్మడి సేవలపై ప్రభావం చూపకూడదని, ప్రాంతీయ డిజిటల్ ఏకరీతిని దెబ్బతీయకూడదని షరతులు విధించింది. ముఖ్యంగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్, హెచ్‌ఆర్‌ఎంఎస్, జీపీఎస్ ఆధారిత పర్యవేక్షణ, ఇంటర్నెట్ లీజ్డ్ లైన్లు, మొబైల్ సిమ్ సేవలు, ఎస్‌ఎంఎస్ గేట్‌వేలు, డిజిటల్ ఽధ్రువీకరణ సేవలు వంటి వివిధ ఐటీ సేవల పర్యవేక్షణ బాధ్యతనూ ఈ కమిటీకి అప్పగించారు.
నెలకోసారి సమీక్ష..
కమిటీ ప్రతినెలా కనీసం ఒకసారి సమావేశమై ప్రాజెక్టుల పురోగతి, సైబర్ భద్రత, ఆర్థిక వ్యయాలు, డిజిటల్ సేవల నిర్వహణ, రాబోయే ఈ–గవర్నెన్స్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనుంది. అవసరాన్ని బట్టి అత్యవసర అంశాలపై అవసరమైతే ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ విభజన అనంతరం డిజిటల్ సేవల్లో అంతరాయం లేకుండా కొనసాగించడం, పౌరసేవలను సమర్థవంతంగా నిర్వహించడం, వ్యయ నియంత్రణ, మూడు కార్పొరేషన్ల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం కోసం ఈ కమిటీ అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడింది.
చైర్మన్‌గా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం


