రోడ్లు, ఫ్లై ఓవర్లపై రేసింగ్ పోటీలు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ రోడ్లు, ఫ్లై ఓవర్లు, సెల్లార్లు.. ఇలా ఏవైనా సరే రేసింగ్ ట్రాక్‌లుగా మారిపోతున్నాయి. లగ్జరీ బైక్‌లు, కార్లతో రయ్ రయ్‌మంటూ దూసుకుపోతున్నారు. టాప్‌గేర్‌లో గాల్లో చక్కర్లు కొడుతున్నారు. నిర్వాహకులు, రేసర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా అడ్డుకట్ట పడటంలేదు. గ్రేటర్‌లో వారాంతాలు, సెలవు రోజుల్లో అర్ధరాత్రి బైక్‌లు, కార్ల రేసింగ్, స్టంట్‌లతో ప్రజలను భయకంపితులను చేస్తున్నారు.
సందర్శకులు వీక్షించేలా..
రాయదుర్గం, నాలెడ్జ్ సిటీ, టీ హబ్ ప్రాంతాలతో పాటు శంషాబాద్, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే, ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఈ తరహా ప్రమాదకర రేసింగ్‌లు జరుగుతున్నాయి. రేసర్లను, సందర్శకులను ఆకట్టుకునేందుకు రేసింగ్ నిర్వాహకులు సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. బుక్ మై షో వంటి వెబ్‌సైట్‌లో టికెట్లను విక్రయిస్తున్నారు. ఇటీవల రాయదుర్గంలో రేసింగ్ నిర్వహించిన ఐదుగురు నిర్వాహకులతో పాటు స్టంట్ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 35 లింక్‌లను గుర్తించి కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
డ్రోన్లతో నిఘా..
రేసింగ్ ట్రాక్‌లను గుర్తించేందుకు రాత్రిపూట డ్రోన్లతో పోలీసలు నిఘా పెడుతున్నారు. రేసింగ్‌లో పాల్గొన్న వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను గుర్తించి, ట్రాక్ చేయడానికి సీసీటీవీ కెమెరాలను వినియోగిస్తున్నారు. అధిక శబ్దం చేసే సైలెన్సర్లు, వాహనాల మోడిఫైడ్ చేసే మోకానిక్‌లు, షాప్‌లపై కూడా పోలీసులు నిఘా పెడుతున్నారు.
సెల్లార్‌లోనూ..
మౌలాలీలోని ఏఎంఆర్ ప్లానెట్ మాల్‌లోని బేస్‌మెంట్–3 సెల్లార్‌లో వింటేజ్ కార్ల ప్రదర్శన పేరుతో స్థానిక పోలీసుల అనుమతి తీసుకున్న నిర్వాహకులు.. పోలీసుల కళ్లుగప్పి కార్ల ప్రదర్శనను ‘డౌన్‌టౌన్ మ్యాడ్‌నెస్ డ్రిఫ్ట్ నైట్’ పేరుతో రేసింగ్ పోటీగా మార్చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చూసి సుమోటా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిర్వాహకులు వంగాల ఈశ్వర్, ఏఎంఆర్ మార్కెటింగ్ మేనేజర్ కె.సందీప్, మాల్ మేనేజర్ ఎ.రవీందర్ రెడ్డిలపై బీఎన్‌ఎస్ సెక్షన్–125, ఐపీసీ సెక్షన్–184, మోటారు వాహన చట్టం సెక్షన్–52 కింద కేసులు నమోదు చేశారు. రేసింగ్ నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రచారం
ఆన్‌లైన్‌లో టికెట్లు సైతం విక్రయం
నిబంధనలు పట్టించుకోని వైనం
మల్కాజిగిరి ఏఎంఆర్ మాల్ సెల్లార్లలో రేసింగ్‌పై సుమోటో కేసు
తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తాం..
చాలా మంది రేసర్లు వారి తల్లిదండ్రుల వాహనాలతో రేసింగ్‌లో పాల్గొంటున్నారు. దీంతో పేరెంట్స్‌పై కూడా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ మైనర్లు రేసింగ్‌లో పాల్గొంటే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తాం. – కె. రాహుల్ రెడ్డి, డీసీపీ, ట్రాఫిక్–1, మల్కాజిగిరి


