సిలిం‘డర్‌’..పేలితే డేంజర్‌! | - | Sakshi
Sakshi News home page

సిలిం‘డర్‌’..పేలితే డేంజర్‌!

Jul 1 2026 5:02 AM | Updated on Jul 1 2026 5:02 AM

హుడాకాంప్లెక్స్‌: రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ పరిధి బాపు నగర్‌లోని ఓ ఇంట్లో మంగళవారం వంట గ్యాస్‌ సిలిండర్‌ లీకై భారీ పేలుడు సంభవించింది. ఆ ధాటికి గది గోడలు ధ్వంసమయ్యాయి. కిటికీ ఊడిపోయి రోడ్డుపై పడింది. వంట సామగ్రి, ఆహార పదార్థాలు చెల్లాచెదురయ్యాయి. ఫ్రిడ్జ్‌ కింద పడిపోయింది. హాలులోని షోకేసు అద్దాలు పగిలి ఇంటి నిండా పడ్డాయి. కాగా.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పేలుడుకు గ్యాస్‌ లీకేజీ కారణమని ఫోరెన్సిక్‌ నిపుణులు ధ్రువీకరించారు. పోలీసుల కథనం ప్రకారం.. బ్యాంకు విశ్రాంత ఉద్యోగి దేవరశెట్టి దేవేందర్‌ కుటుంబం బాపునగర్‌ చౌడి సమీపంలోని రోడ్డు నంబర్‌ – 4లో ఉంటోంది. సిలిండర్‌ రెగ్యులేటర్‌కు, స్టవ్‌కు మధ్య ఉండే పైపు నుంచి గ్యాస్‌ లీకై ంది. వంట గదిలోని పూజా మందిరంలో వెలిగించిన దీపం కారణంగా పేలుడు జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నా.. ప్రభావం హాలు దాటి రాకపోవడంతో వారికి ఎలాంటి హాని జరగలేదు. పేలుడు జరిగినప్పుడు వంటగదిలోనే మరో మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయి. అవి పేలి ఉంటే నష్టం తీవ్రత ఎక్కువగా ఉండేదని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ఇంటిని సరూర్‌నగర్‌ ఏసీపీ కృష్ణయ్య సందర్శించారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో తరచూ వంట గ్యాస్‌ సిలిండర్‌ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మంగళవారం సరూర్‌నగర్‌ పరిధిలో సిలిండర్‌ లీక్‌ కావడంతో ఓ ఇల్లు ధ్వంసమైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. వంట గ్యాస్‌ వినియోగంపై వినియోగదారులకు పూర్తి అవగాహన లేకపోవడంతో పాటు కొన్ని అంశాల్లో నిర్లక్ష్యంతోనే ఇలా జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

లీకేజీకి అవకాశం ఇలా..

గ్యాస్‌ సిలిండర్‌లో బ్యూటేన్‌, ప్రొఫైన్‌ వాయువులు కలిసి ఉంటాయి. దాదాపు 14.5 కేజీల బరువున్న ఈ వాయువులను అత్యధిక ఒత్తిడితో గ్యాస్‌ సిలిండర్‌లో ద్రవ రూపంలో నిక్షిప్తం చేస్తారు. దీని వినియోగంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, అవగాహన కొరవడినా సంభవించే ప్రమాదం బాంబు పేలుడుతో సమానం. సాధారణంగా స్టవ్‌ ఆఫ్‌ చేసినా.. గ్యాస్‌ లీకేజీ సున్నిత ప్రాంతాల నుంచి జరిగే అవకాశం ఉంది.

సిలిండర్‌, స్టవ్‌లను కలుపుతూ రబ్బర్‌ ట్యూబ్‌ ఉంటుంది. ఇది అటు సిలిండర్‌కు, ఇటు స్టవ్‌కు అతికే ప్రాంతాల్లో ఏదో ఒక చోట నుంచి లీక్‌ అయ్యే ప్రమాదం ఉంది.

సాధారణంగా స్టవ్‌కు అనుసంధానించే చోటే వేడితో ఈ ట్యూబ్‌ సాగే గుణాన్ని కోల్పోతుంది. ఫలితంగా పెళుసుదనంతో పగుళ్లు ఏర్పడతాయి. కేవలం గుండు సూది మొనంత రంధ్రం ఏర్పడితే చాలు. దీనిలోంచి గంటకు ముప్పావు నుంచి కేజీన్నర గ్యాస్‌ లీకవుతుంది.

స్టవ్‌కు ఉండే నాబ్స్‌, రెండు నాబ్స్‌నూ కలిపే పైపు, కొత్త సిలిండర్‌ బిగించే సమయంలో రెగ్యులేటర్‌, సిలిండర్‌ నాబ్‌ల నుంచీ లీకయ్యే అవకాశం ఉంది.

వంటింటికి కిటికీలు, వెంటిలేటర్లు ఉంటే లీకై న గ్యాస్‌ వాటినుంచి బయటికి వెళ్లిపోతుందనే భావన చాలా మందికి ఉంటుంది. వంట గ్యాస్‌లో ఉండే వాయువులు గాలి కన్నా చాలా బరువైనవి. అందుకే లీకై న తర్వాత నేలపైకి చేరతాయి. నాలుగడుగుల కంటే తక్కువ ఎత్తులోనే వ్యాపిస్తాయి. దీంతో కిటికీలు తెరిచి ఉన్నా.. వెంటిలేటర్లు ఉన్నా.. వాటి ద్వారా బయటికి పోయే అవకాశం ఉండదు.

ఇంట్లో వ్యాపించి ఉన్న గ్యాస్‌కు ప్రేరణ లభించగానే ఒక్కసారిగా అంటుకుంటుంది. ఇలా అంటుకున్న సందర్భంలో విస్తరించి ఉన్న గ్యాస్‌ 12 వేల రెట్లు వ్యాకోచిస్తుంది. ఫలితంగానే గ్యాస్‌ ప్రమాదం చోటు చేసుకున్న చోట భారీ ఆస్తి నష్టం ఏర్పడుతుంది. ఈ ప్రేరణ పూజ గదిలో దీపం, ఫ్రిడ్జ్‌, స్విచ్ఛ్‌ల్లో ఏదైనా కావచ్చు.

అనేక ప్రమాదాల్లో గ్యాస్‌ సిలిండర్‌ ఏమాత్రం చెక్కు చెదరదు. దీన్ని చూసి అనేక మంది గ్యాస్‌ వల్ల జరిగిన పేలుడు కాదని భావిస్తారు.

నగరంలో తరచూ ‘గ్యాస్‌’ ప్రమాదాలు

వాడకంపై సరైన అవగాహన లేకనే..

వినియోగదారుల నిర్లక్ష్యమూ కారణమే

సరూర్‌నగర్‌ ఉదంతంతో తీవ్ర కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement