బడికి ఆమడ దూరం! | - | Sakshi
Sakshi News home page

బడికి ఆమడ దూరం!

Jul 1 2026 5:02 AM | Updated on Jul 1 2026 5:02 AM

బడికి ఆమడ దూరం!

హైటెక్‌ వెలుగుల వెనుక పుస్తకం పట్టని చేతులు లక్షల్లోనే..

సాక్షి, హైదరాబాద్‌

వేసవి సెలవులు ముగిస్తే చాలు.. నగరమంతా బడిబాట సందడి. కొత్త బ్యాగులు, పుస్తకాల వాసన గల్లీల్లో గుబాళిస్తుంది. కానీ భాగ్యనగరంలోని 1,476 బస్తీల్లో సగానికిపైగా గడపలకు అక్షర పండుగ ఇంకా చేరలేదు. ఫ్లైఓవర్ల నీడన, హైటెక్‌ కాంతుల వెనుక పుస్తకం ఎరుగని చేతులు లక్షల్లోనే ఉన్నాయని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ), జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ విద్యా ప్లస్‌ (యూడైస్‌ ప్లస్‌) సర్వేలు చెబుతున్నాయి. ఎన్‌ఎస్‌ఓ పీఎల్‌ఎఫ్‌ఎస్‌ 2025–26 ప్రకారం నగరంలో అక్షరాస్యత 83.25 శాతం ఉండగా, ముంబై (89.7 శాతం), ఢిల్లీ (89.4), బెంగళూరు (88.2), చైన్నె 86.16 శాతం) మనకంటే ముందున్నాయి.

నమోదు వంద... నాణ్యతలో నేలచూపు

యూడైస్‌ ప్లస్‌ 2026 ప్రకారం 6–14 ఏళ్ల పిల్లల నమోదు 97.3 శాతం. కానీ నీతి ఆయోగ్‌ పాఠశాల విద్యా నాణ్యతా సూచీ (ఎస్‌ఈక్యూఐ) 2026 చెబుతున్న ప్రకారం.. 14 ఏళ్లు రాగానే, 8వ తరగతి దాటగానే 13.3 శాతం మంది బడి మా నేస్తున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ ప్రకారం నగర విద్యార్థుల అభ్యసన స్థాయి జాతీయ సగటు కంటే 6 శాతం తక్కువ. 8వ తరగతి పిల్లల్లో 38 శాతం మందికి ప్రాథమిక గణితం, భాష రాదు. ప్రథమ్‌ ‘అసర్‌ 2025’లో 5వ తరగతి పిల్లల్లో 42 శాతం మందికి 2వ తరగతి తెలుగు చదవడం రాదు.

రెడ్‌జోన్‌లో 57 బస్తీలు..

నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ డేటా ప్రకారం పాతబస్తీలో ముస్లింల అక్షరాస్యత 81.82 శాతం, హిందువుల 84.06 శాతం కంటే తక్కువ. హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ మే 2026 సర్వేలో 57 బస్తీలు ‘రెడ్‌ జోన్‌’. ఇక్కడ 6–14 ఏళ్ల పిల్లల్లో 18 శాతం మంది బడి ముఖమే చూడలేదు. తలాబ్‌కట్టా, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్టలో 9–12 తరగతుల డ్రాపౌట్‌ 8 శాతం. బాలికల్లో 9వ తరగతి తర్వాత 11 శాతం మంది బాల్య వివాహాలకు బలవుతున్నారు.

మౌలిక వసతులు కల్పించాం..

‘మౌలిక వసతులు 100 శాతం కల్పించాం. 94 శాతం స్కూళ్లకు డిజిటల్‌ బోర్డులు, మరుగుదొడ్లు వచ్చాయి. వలస కుటుంబాలు, బాలకార్మిక వ్యవస్థ వల్ల పిల్లలు రావడం లేదు. అల్పాహారం పెట్టిన చోట హాజరు 11 శాతం పెరిగిందిన అధికారులు అంటున్నారు.

ఆకలి తీరితేనే అక్షరం..

హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ 12 బస్తీల్లో సాయంత్రం పాఠశాలలతో 680 మందిని బడికి రప్పించింది. సేవ్‌ ద చిల్డ్రన్‌ ‘ఆమె కల’తో 2,100 మంది బాలికలను 10వ తరగతి దాటించింది. కానీ ఏటా 5 వేల మంది మానేస్తుంటే ఈ కృషి సరిపోవడం లేదు. పౌష్టికాహారం, తల్లిదండ్రులకు ఉపాధి, బాలికలకు భద్రత, రవాణా ఇస్తేనే ‘అక్షరాల హైదరాబాద్‌’ కాస్త ‘అక్షరయుత హైదరాబాద్‌’ అవుతుంది.

బస్తీ బతుకులకు బడి ఇప్పటికీ భారమే..

హైదరాబాద్‌ ఇంకా మూడో మెట్టుపైనే

8వ తరగతి దాటితే పాఠశాలకు గుడ్‌బై!

ప్రతి 100లో 13 మంది ఇలాగే..

ఎన్‌సీఈఆర్‌టీ, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ, యూడైస్‌ ప్లస్‌ సర్వేలో వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement