నడిరోడ్డు.. నెత్తురోడి | - | Sakshi
Sakshi News home page

నడిరోడ్డు.. నెత్తురోడి

May 14 2026 6:21 AM | Updated on May 14 2026 6:21 AM

మూడు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత

మల్లాపూర్‌లో ఇద్దరు, మియాపూర్‌, గచ్చిబౌలిలో ఒకరు దుర్మరణం

పనులు వెళ్తూ మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు, బంధువుల పెళ్లికని బయలుదేరి మరొకరు మృత్యువాత పడ్డారు. మల్లాపూర్‌ పారిశ్రామికవాడలో ఇద్దరు, మియాపూర్‌ ఆల్విన్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద, గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ పక్కన ఒకరు చొప్పున దుర్మరణం పాలయ్యారు.

జడుపుల గణేష్‌, దండగల్ల గంగాధర్‌ (ఫైల్‌)

మల్లాపూర్‌/మియాపూర్‌/గచ్చిబౌలి: మీర్‌పేట్‌ భక్షిగూడకు చెందిన దండగల్ల గంగాధర్‌(42), మౌలాలి ఆర్టీసీ కాలనీకి చెందిన జడుపుల గణేష్‌(49) మల్లాపూర్‌ పారిశ్రామికవాడలో బండరాళ్లు కొట్టుకుని జీవిస్తున్నారు. మంగళవారం రాత్రి బండరాళ్ల వద్దకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టి కొద్దిదూరం ఈడ్చుకు వెళ్లింది. ఇద్దరూ రోడ్డుపై పడటంతో తలలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి ఈసీఐఎల్‌లోని ఓ ప్రయివేట్‌ ఆసుప్రతికి తరలించగా అప్పటికే మృతిచెందారని వైద్యులు చెప్పారు. కారుడ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. తమకు న్యాయం చేయాలని నాచారం పోలీస్‌స్టేషన్‌ ఎదుట మృతుల కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. నాచారం ఇన్‌స్పెక్టర్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బైక్‌ను ఈడ్చుకెళ్లిన కారు

ఆగిన డీసీఎంను ఢీ కొట్టి..

అసోంకు చెందిన అమ్దాదుల్లా(23) రెండేళ్లుగా గచ్చిబౌలి సిద్ధిఖీనగర్‌లో నివాసముంటూ హౌస్‌ కీపింగ్‌ పనులు చేస్తున్నాడు. బుధవారం ఉదయం బైక్‌పై గచ్చిబౌలి నుంచి నానక్‌రాంగూడ రోటరీలో పనికి వెళ్తూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎడమ పక్కన డీసీఎం వ్యాన్‌ను ఢీ కొట్టి కింద పడిపోయాడు. కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. తలకు హెల్మెట్‌ ఉండటంతో ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే 108లో సమీపంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మూత్ర విసర్జన కోసమని నో పార్కింగ్‌ వద్ద డీసీఎం వ్యాన్‌ ఆపిన డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

రోడ్డు దాటుతుండగా..

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌ జిల్లా మన్నెళ్లికి చెందిన అథియా(35), మహ్మద్‌ యూనస్‌ దంపతులకు ముగ్గురు కుమారులు. యూనస్‌ దినసరి కూలీ. మియాపూర్‌ హాఫీజ్‌పేట్‌లో ఈ నెల 15న జరిగే బంధువుల పెళ్లి వేడుకకు బుధవారం స్వగ్రామం నుంచి అథియా, ఆమె తండ్రి హైదర్షా, తల్లి రషీద, చిన్న కుమారుడు అయాన్‌తో కలిసి ఆర్టీసీ బస్సులో నగరానికి వచ్చి మియాపూర్‌ ఆల్విన్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద దిగారు. హఫీజ్‌పేట్‌ వెళ్లేందుకు రహదారి దాటుతుండగా చందానగర్‌ నుంచి మియాపూర్‌ వైపు అతివేగంగా వెళ్తున్న శ్రీ లక్ష్మీ నర్సింహ్మ బోర్‌వెల్స్‌ లారీ ఢీ కొట్టడంతో అథియా అక్కడికక్కడే మృతి చెందింది. రషీదకు స్వల్ప గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement