బంధువే దొంగ | - | Sakshi
Sakshi News home page

బంధువే దొంగ

May 13 2026 5:02 AM | Updated on May 13 2026 5:02 AM

బంధువే దొంగ 24 గంటల్లో చోరీ కేసును ఛే దించిన పోలీసులు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో నష్టపోవడంతో పక్కదారి

అనుమానంతో నిలదీయగా...

24 గంటల్లో చోరీ కేసును ఛే దించిన పోలీసులు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో నష్టపోవడంతో పక్కదారి

అబిడ్స్‌: గోషామహాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని షాహినాయత్‌గంజ్‌ ముల్తానిపురాలో చోరీ కేసులో బంధువే దొంగ అని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనను 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి దొంగను అరెస్టు చేశారు. దాదాపు రూ.50 లక్షల విలువైన బంగారాన్ని, ఇతర సామగ్రిని, నగదును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం గోషామహాల్‌ పోలీస్‌స్టేషన్‌లో గోల్కొండ జోన్‌ డీసీపీ చంద్రమోహన్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముల్తానిపురాలోని 3వ అంతస్తులో నివాసం ఉంటున్న మహేష్‌ తన కుటుంబసభ్యులతో కలిసి ఐదురోజులుగా ఇంటికి తాళాలు వేసి బంధువుల పెండ్లి సన్నాహాలకు వెళ్తున్న విషయాన్ని మేనల్లుడు దొంతుల రాజేష్‌ కనిపెట్టాడు. రాజేశ్‌ కొంతకాలంగా కిరాణాషాప్‌ నిర్వహిస్తూ, ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటై నష్టాలకు గురయ్యాడు. ముల్తానిపురాలోనే మహేష్‌ ఇంటి సమీపంలో నివసిస్తున్న రాజేష్‌ ఆదివారం రాత్రి మహేష్‌ ఇంట్లోకి చొరబడ్డాడు. స్క్రూ డ్రైవర్‌తో తాళాలు తీసి లోపలికి వెళ్లిన మహేష్‌ బీరువాలోని దాదాపు 30 తులాల వివిధ రకాల బంగారు ఆభరణాలు, కిలోన్నరకుపైగా వెండి సామగ్రి, రూ.5 లక్షల నగదు, ఇతర సామగ్రిని దొంగిలించి దర్జాగా ఇంటికి వెళ్లాడు. దొంగిలించిన సొత్తును ఒక సంచిలో పెట్టి లోపలి గదిలో దాచిపెట్టాడు. ఎవరికి అనుమానం రాకుండా రోజుమాదిరిగా ఆటో నడపడానికి వెళ్లాడు.

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మహేష్‌కు తెలిసినవారు, బంధువులే దొంగతనం చేసి ఉండవచ్చని అనుమానించి సమీపంలోని రాజేష్‌ ఇంటికి వెళ్లారు. అప్పుడే ఇంటికి వచ్చిన అతడిని పోలీసులు ప్రశ్నించగా తడబడ్డాడు. పోలీసులు గట్టిగా నిలదీయడంతో దొంగతనం చేసినట్లు రాజేష్‌ ఒప్పుకున్నాడు. ఇంట్లో దాచిపెట్టిన బంగారు ఆభరణాలు, వెండి, నగదును పోలీసులకు అప్పగించాడు. రాజేష్‌ను పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. గోషామహాల్‌ ఏసీపీ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్‌ శ్రవణ్‌కుమార్‌, ఎస్‌ఐ అజిత్‌ దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనాన్ని ఛేదించిన పోలీసులకు, ఇన్‌స్పెక్టర్‌ శ్రవణ్‌కుమార్‌లకు డీసీపీ రివార్డ్స్‌ అందజేసి ప్రశంసించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement