అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యుల ఆందోళన
మియాపూర్: అపార్ట్‌మెంట్ నీటి సంపులో పడి ఓ బాలిక మృతి చెందింది. అయితే కుటుంబసభ్యులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మియాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం టేకులపల్లి మండలం మద్దిరాళ్ల తండాకు చెందిన గుగులోత్ చరణ్, రేణుక దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. వలస వచ్చి మియాపూర్‌లోని గోకుల్ ఫ్లాట్స్‌లో చరణ్ కొంతకాలంగా వాచ్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. ఎనిమిది రోజుల క్రితం శ్రీ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మేన్‌గా చేరాడు. అతడి రెండో కూతురు సారా(13) స్థానికంగా 8వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో బోర్ మోటార్ ఆన్ చేయాలని సారాకు చెప్పి చరణ్ బయటకు వెళ్లాడు. 8 గంటలకు తిరిగి వచ్చి చూడగా ఇంట్లో సారా కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. అనుమానంతో సంపు మూత తీసి చూడగా సారా అందులో పడి ఉంది. వెంటనే బాలికను నిజాంపేట్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సంపును పరిశీలించారు. సంపు నిండిందా అని చూసేందుకు సారా వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
కుటుంబ సభ్యుల ఆందోళన ...
సారా మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబసభ్యులు, బంధువులు శ్రీ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ ముందు మంగళవారం ఆందోళనకు దిగారు. ప్రమాదవశాత్తు బాలిక సంపులో పడిపోతే గాయాలయ్యే అవకాశం ఉందని, కానీ బాలిక శరీరంపై అలాంటివేవీ లేవని పేర్కొన్నారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరాలు ఉన్నా ఫుటేజీని తమకు చూపడంలేదని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. కేసు దర్యాప్తులో ఉంది.


