ముఠా కట్టి.. హవాలా బాట పట్టి.. | - | Sakshi
Sakshi News home page

ముఠా కట్టి.. హవాలా బాట పట్టి..

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

ముఠా కట్టి.. హవాలా బాట పట్టి..

నాలుగు క్వింటాళ్ల గంజాయి పట్టివేత ● ఏడుగురి అరెస్ట్‌

గచ్చిబౌలి: కూకట్‌పల్లి ఎస్‌ఓటీ, పటాన్‌చెరు పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ చేసి 4 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్‌ శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు. సోలాపూర్‌లో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న మనీషా పడ్వాల్‌ మరింత గంజాయి కోసం అదే ప్రాంతానికి చెందిన మధ్యవర్తి ప్రతాప్‌ హరిదాస్‌ పవార్‌(24)ను సంప్రదించింది. ఒడిశాకు చెందిన ట్రిబుని వద్ద గంజాయి ఉందని తెలుసుకున్న ప్రతాప్‌ డీసీఎం యజమాని ఆనంద్‌యప్ప హోవల్‌(34), డ్రైవర్లు చందన్‌షిప్వే అబుంబర్‌(46), రంజిత్‌ రాజేందర్‌ గడాగే(27)లు ఒడిశాలోని మల్కన్‌గిరికి ఈ నెల 8న బయలుదేరారు. డీసీఎం వ్యాన్‌కు ఎస్కార్ట్‌గా కారులో బాలాజీ గణేష్‌(35), రోహిత్‌ హోవల్‌(27), చంద్‌శివ్‌ సాహిల్‌(17) వెళ్లారు. ఖమ్మం జిల్లా వైరాకు వెళ్లగానే మల్కన్‌గిరికి కాకుండా, రాజమండ్రికి రావాలని గంజాయి పెడ్లర్‌ నుంచి కబురు వచ్చింది. ఈ మేరకు రాజమండ్రిలోని మారుమూల ప్రాంతానికి వెళ్లి రెండు కిలోల బరువు ఉన్న 200 గంజాయి ప్యాకెట్లను డీసీఎంలో లోడ్‌ చేసుకుని తెలంగాణ మీదుగా బయలుదేరారు. పోలీసులు సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఓఆర్‌ఆర్‌ ముత్తంగి ఎగ్జిట్‌ వద్ద డీసీఎంను అడ్డుకున్నారు. ఆరుగురు నిందితులతోపాటు ప్రతాప్‌ హరిదాస్‌ పవార్‌ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మనీషా పడ్వాల్‌, ట్రిబుని పరారీలో ఉన్నారు. 400 కిలోల గంజాయి, డీసీఎం వ్యాన్‌, కారు, 6 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.2 కోట్లు ఉంటుంది.

హవాలా ద్వారా డబ్బు చేరవేత

ప్రధాన నిందితురాలు మనీషా పడ్వాల్‌ హవాలా ద్వారా అంతర్రాష్ట్ర ముఠాకు మూడు లక్షల నగదు, గూగుల్‌ పే ద్వారా చేరవేసింది. మనీషా పడ్వాల్‌, ట్రిబుని పట్టుబడితే మరింత సమాచారం తెలిసే వీలుందని, వారిని త్వరలో పట్టుకుంటామని డీసీపీ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఓస్‌ఓటీ డీసీపీ శోభన్‌ బాబు, ఏడీసీపీ విశ్వప్రసాద్‌, ఆర్సీపురం ఏసీపీ శ్రీనివాస్‌ , పటాన్‌చెరు ఇన్‌స్పెక్టర్‌ వినాయక్‌ రెడ్డి, డీఐ రాజు, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ శివ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement