ముంబయ్‌లోనే మకాం | - | Sakshi
Sakshi News home page

ముంబయ్‌లోనే మకాం

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లోని రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి వినయ్‌రంజన్‌ భార్య తనూజను నేపాలీ గ్యాంగ్‌ దారుణంగా హత్య చేసి పరారైన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు, మూడు సీసీఎస్‌ బృందాలు, ఒక లోకల్‌ పోలీస్‌ బృందం పూణె, ముంబాయి, ఢిల్లీ, లక్నోలతో పాటు నేపాలి సరిహద్దుల్లో ముమ్మర గాలింపు చేపట్టాయి. అయితే నిందితులు ముంబయ్‌లో తలదాచుకున్నట్లు సమాచారం.

● నిందితులు కల్పనతో పాటు నేపాల్‌కు చెందిన సుజన్‌షాహి అలియాస్‌ సురేష్‌షాహి, గణేష్‌షాహి, భరత్‌లుగా గుర్తించారు. సురేష్‌షాహికి ఈ పథకంలో భాగంగా దేవేందర్‌ అనే నేపాలీ డబ్బులు సర్దుబాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరంతా ముంబాయిలో తలదాచుకున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు అక్కడే గాలిస్తున్నాయి.

● ముఖ్యంగా ముంబయ్‌ రైల్వేస్టేషన్‌లో గాలింపు తీవ్రంచేశాయి. అయితే నిందితుల్లో ఒకరైన భరత్‌ సరిహద్దులు దాటి నేపాల్‌లోకి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు.ప్రధాన నిందితురాలు కల్పనతో పాటు సురేష్‌షాహి, గణేష్‌షాహిలను పట్టుకోవడం ద్వారా ఈ మిస్టరీని చేధించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

● నిందితుల ఖర్చుల కోసం దేవేందర్‌ అనే నేపాలీ సురేష్‌షాహికి పంపించగా, ఆయనే గత నాలుగు వారాల నుంచి ఇక్కడ తిష్టవేసి పథకం రచించి రెక్కీ నిర్వహించి ఈ దోపిడీకి పాల్పడినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

● ప్రధాన నిందితురాలు కల్పనను స్థానికంగా ఓ ఇంట్లో పనిచేస్తున్న మహిళ నియమించినట్లు తేలింది. ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పూణెలో కల్పన తల్లిదండ్రులను, చెల్లెళ్లను హైదరాబాద్‌కు తరలించారు. వారిని ఒకవైపు విచారిస్తూనే ఇంకోవైపు వారి సహాయంతోనే నిందితులను పట్టుకోవాలని యోచిస్తున్నారు. ఇప్పటికే నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

● ప్రధాన నిందితుల్లో భరత్‌ సరిహద్దు దాటివెళ్లగా కల్పన ముంబాయిలో తలదాచుకున్నట్లు తెలియడంతో ఆమె కోసం వేట ముమ్మరం చేశారు. గణేష్‌షాహి, సురేష్‌షాహిలు ముంబాయిలోనే ఓ చోట తలదాచుకోగా వారిని గుర్తించినట్లుగా సమాచారం అందింది. మొత్తానికి ఒకట్రెండు రోజుల్లో నేపాలీ గ్యాంగ్‌ను పట్టుకునే దిశగా పోలీసులు ముందడుగు వేశారు.

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్యకేసు

నేపాలీగా గ్యాంగ్‌ కోసం గాలింపు ముమ్మరం

సాయిభాస్కర్‌పై చర్యలు..

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి వినయ్‌రంజన్‌ భద్రత నిమిత్తం వ్యక్తిగత సెక్యూరిటీ అధికారి సాయిభాస్కర్‌ అనే పోలీసును ప్రభుత్వం నియమించింది. ఆయన ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే విధుల్లో ఉంటారు. హత్య, దోపిడీ జరిగిన రోజు రాత్రి ఆయన అందుబాటులో ఉండి ఉంటే ఈ ఘోరం జరగకపోయి ఉండేదని పోలీసులు భావిస్తున్నారు. 24 గంటలు వ్యక్తిగత భద్రత కోసం ఉండాల్సిన పోలీసులు రిలీవర్‌ లేకపోవడంతో సాయిభాస్కర్‌ ఒక్కడే ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటూ ఆ తర్వాత వెళ్లిపోతున్నాడు. రాత్రి కూడా ఉండి ఉంటే హత్య, దోపిడీ జరిగి ఉండేది కాదని పోలీసులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement