గ్యాస్‌ కొట్టేస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కొట్టేస్తున్నారు!

May 8 2026 11:14 AM | Updated on May 8 2026 11:14 AM

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వాణిజ్య సిలిండర్ల అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. గృహావసరాల సిలిండర్లు ఈ దందాకు ‘ఆజ్యం’ పోస్తున్నాయి. డెలివరీ బాయ్స్‌ చేతివాటంతో సామాన్యుడి గ్యాస్‌.. వాణిజ్యావసరాలకు మళ్లుతోంది. ఇటీవల పాతబస్తీ గోషామహల్‌, గాంధీనగర్‌ ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్‌ దాడులే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. డొమెస్టిక్‌ సిలిండర్ల నుంచి కమర్షియల్‌ సిలిండర్లలోకి గ్యాస్‌ను మార్చే అక్రమ ప్రక్రియ ఇష్టానుసారంగా సాగుతోంది. అక్రమార్కులు డెలివరీ బాయ్స్‌ సహకారంతో డొమెస్టిక్‌ సిలిండర్‌ నుంచి 2 నుంచి 3 కిలోల గ్యాస్‌ను సేకరిస్తున్నారు. ఇలా పోగైన గ్యాస్‌ను అధునాతన రీఫిల్లింగ్‌ పరికరాల ద్వారా 19 కిలోల వాణిజ్య సిలిండర్లలోకి నింపుతున్నారు.

అక్రమార్కులకు కాసుల పంట

డొమెస్టిక్‌, కమర్షియల్‌ సిలిండర్‌ ధరల మధ్య వ్యత్యాసం అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. ప్రస్తుతం డొమెస్టిక్‌ (14.2 కేజీలు) ధర రూ. 965 (కిలో ధర రూ. 67.95), కమర్షియల్‌ (19 కేజీలు) ధర రూ. 3,315 (కిలో ధర రూ.174.47) ఉంది. వీటి ధరల మధ్య వ్యత్యాసం (కిలోకు) రూ. 106.52 వరకు కనిపిస్తోంది. ఒక కమర్షియల్‌ సిలిండర్‌ను ఇలా అక్రమ రీఫిల్లింగ్‌ ద్వారా విక్రయిస్తే, కేవలం గ్యాస్‌ ధర వ్యత్యాసం ద్వారానే రూ. 1,113 వరకు లాభం వస్తోంది. దీనికి అదనంగా వ్యాపారుల నుంచి మరో రూ. 300 వసూలు చేస్తున్నారు. ఒక్కో సిలిండర్‌పై రూ. 1400 వరకు లాభం గడిస్తున్నట్లు తెలుస్తోంది.

వ్యాపారుల ఆసక్తి.. గంటల్లోనే డెలివరీ

మార్కెట్‌లో అధికారికంగా కమర్షియల్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తే వచ్చే సమయం కంటే, బ్లాక్‌ మార్కెట్‌లో గంట వ్యవధిలోనే డెలివరీ అందుతుండటంతో వ్యాపారులు సైతం ఆసక్తి కనబర్చుతున్నారు. హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, కేటరింగ్‌ యూనిట్లు ’క్విక్‌ సర్వీస్‌’గా సిలిండర్‌ అందుతుండటంతో సర్వీస్‌ చార్జీలుగా అదనంగా రూ. 300 చెల్లించేందుకు వెనుకాడటం లేదు.

సామాన్యుడిపై ప్రభావం

గ్యాస్‌ అక్రమ దందా వల్ల అంతిమంగా నష్టపోతోంది సామాన్య వినియోగదారుడే. ఇంటికి వచ్చే డొమెస్టిక్‌ సిలిండర్‌లో బరువు తక్కువగా ఉండటంతో నెల రోజులు రావాల్సిన గ్యాస్‌ 20 రోజులకే నిండుకుంటోంది. పౌరసరఫరాల శాఖ తనిఖీలు నామమాత్రంగా ఉండటం, తూనికల కొలతల విభాగం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకపోవడంతో అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు.

డొమెస్టిక్‌ టు కమర్షియల్‌

గృహావసరాల సిలిండర్‌లో గ్యాస్‌ తస్కరణ

ఆపై వాణిజ్య సిలిండర్లలోకి రీ ఫిల్లింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement