ఐస్‌క్రీమ్‌ తేకపోతే బదిలీ చేస్తా! | - | Sakshi
Sakshi News home page

ఐస్‌క్రీమ్‌ తేకపోతే బదిలీ చేస్తా!

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

ఎస్‌ఐకి జోన్‌ ఉన్నతాధికారి హుకుం

సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో ఖరీదైన జోన్‌లో ఓ ఉన్నతాధికారి వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. కింది స్థాయి సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు బూతులు మాట్లాడతారని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. శనివారం తెల్లవారు జామున 4 గంటల వరకూ కమిషనర్‌ అన్ని జోన్ల ఉన్నతాధికారులతో కలిసి చర్చించి ఒకేసారి 65 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీకి రంగం సిద్ధం చేశారు. ఆ సమావేశంలో పాల్గొన్న ఓ జోన్‌ ఉన్నతాధికారి తెల్లవారుజామున 3 గంటలకు ఓ ప్రొహిబిషనరీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ)కు ఫోన్‌ చేసి ఐస్‌క్రీమ్‌ తీసుకురావాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ‘మనమే షాప్‌లను బంద్‌ చేయిస్తున్నాం కదా సార్‌. ఈ సమయంలో ఐస్‌క్రీమ్‌ ఎక్కడ దొరుకుతుంది?’ అని సదరు ఎస్‌ఐ సమాధానం ఇవ్వగా.. చెప్పింది చేయకుంటే మల్టీ జోన్‌కు బదిలీ చేస్తానని బెదిరించినట్లు తెలిసింది. దీంతో చేసేదేం లేక గల్లీ గల్లీ తిరిగి ఆ ఎస్‌ఐ అధికారులందరికీ ఐస్‌ క్రీమ్‌ తీసుకెళ్లక తప్పలేదు. ఇదే జోన్‌ అధికారి మరో సందర్భంలో ఓ భూ తగాదా కేసులో తాను ఆదేశించినట్లు చేయనందుకు మరో ఎస్‌ఐపై ఆగ్రహానికి గురై ఫోన్‌లోనే బూతు పురాణం వినిపించాడు. తిట్ల దండకాన్ని సదరు ఎస్‌ఐ ఫోన్‌లో రికార్డ్‌ చేసి సహచరులకు, పలువురు ఉన్నతాధికారులకు వినిపించి, తన గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది.

గంటలో రిలీవ్‌ కావాలంటూ..

కాగా.. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఒకేసారి 32 మంది ఎస్‌ఐలను చార్మినార్‌ జోన్‌కు అటాచ్‌ చేస్తూ సైబరాబాద్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం.రమేష్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఎస్‌ఐలు గంటలోపు రిలీవ్‌ కావాలని సెట్‌లో కమిషనర్‌ ఆదేశాలు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం నిర్ణీత గంట వ్యవధి విధిస్తూ సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్స్‌ (ఎస్‌హెచ్‌ఓ)లకు ఆదేశాలు రావడంతో గందరగోళం నెలకొంది. బాస్‌ ఆదేశాలతో చేసేదేం లేక ఎస్‌ఐలను రిలీవ్‌ చేసే పనిలో ఎస్‌హెచ్‌ఓలు నిమగ్నమయ్యారు. వివిధ కేసుల్లో కోర్టుకు వెళ్లిన ఎస్‌ఐలకు మెమోలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. బదిలీ అయిన వారిలో కొందరు ఎస్‌ఐలు డీజీపీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

అర్ధరాత్రి గల్లీ గల్లీ తిరిగి పట్టుకొచ్చిన ఎస్‌ఐ

కేసు దర్యాప్తులో మరో ఎస్‌ఐపై దుర్భాషలు

సైబరాబాద్‌లో చర్చనీయాంశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement