నేటినుంచి సనత్‌నగర్‌ టిమ్స్‌లో ట్రయల్‌ రన్‌ | - | Sakshi
Sakshi News home page

నేటినుంచి సనత్‌నగర్‌ టిమ్స్‌లో ట్రయల్‌ రన్‌

May 1 2026 5:51 AM | Updated on May 1 2026 5:51 AM

క్రీడాకారులను ఒలింపిక్‌ స్థాయికి తీర్చిదిద్దుతాం

సాక్షి,సిటీబ్యూరో: సనత్‌నగర్‌ టిమ్స్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం నుంచి నెల రోజుల పాటు ట్రయల్‌ రన్‌ కొనసాగనుంది. ఇందులో భాగంగా రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అవుట్‌ పేషెంట్‌, డయాగ్నసిస్‌ సేవలు అందించనున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీతో పాటు మొత్తం 22 విభాగాల్లో ట్రయల్‌ రన్‌ జరగనుంది. ఇందుకోసం అవసరమైన డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బందిని అధికారులు నియమించారు.

2న విశ్వశాంతి సంకీర్తనా యజ్ఞం

సాక్షి, సిటీబ్యూరో: యుద్ధ వాతావరణం తదితర సంక్షోభాల నేపథ్యంలో ‘‘అన్నమాచార్య భావనా వాహిని’’ ఆధ్వర్యంలో ‘విశ్వ శాంతి సంకీర్తనా యజ్ఞం‘ నిర్వహిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్‌ ట్రస్టీ డా.నందకుమార్‌ తెలిపారు. ఈ నెల 2న 618వ అన్నమాచార్య జయంతిని పురస్కరించుకొని ఉదయం ట్యాంక్‌ బండ్‌పై అన్నమయ్య విగ్రహం దగ్గర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

5న కలెక్టరేట్‌ వద్ద నిరసన దీక్ష

అబిడ్స్‌: తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మే 5న లక్డీకాపూల్‌లోని హైదరాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు రిలే నిరహార దీక్ష చేపడుతామని టీఎన్జీఓస్‌ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌ఎం ముజీబ్‌ హుస్సేన్‌ పేర్కొన్నారు. గగన్‌విహార్‌లోని టీఎన్జీఓ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రెండవ పీఆర్‌సీ అమలు, పెండింగ్‌ బిల్లుల విడుదల, సీపీఎఫ్‌ రద్దుతో పాటు మరో 64 ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామన్నారు. టీఎన్జీఓస్‌ నాయకులు కుర్రాడి శ్రీనివాస్‌, విక్రమ్‌ కుమార్‌, కేఆర్‌.రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

పదవీ విరమణ చేసిన రోజే పీపీఓలు

సాక్షి, సిటీబ్యూరో: పదవీ విరమణ చేసిన రోజే సభ్యుల పెన్షన్‌ చెల్లింపు ఉత్తర్వులను జారీ చేయడం లక్ష్యంగా రూపుదిద్దుకున్న ‘ప్రయాస్‌’ కార్యక్రమంలో భాగంగా గురువారం పలువురు ఉద్యోగులకు పెన్షన్‌ చెల్లింపు ఉత్తర్వుల (పీపీఓలు)ను అందజేశారు. కూకట్‌పల్లిలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ’ఉద్యోగుల పెన్షన్‌ పథకం, 1995’ కింద బాలానగర్‌కు చెందిన మెస్సర్స్‌ మల్హోత్రా షేవింగ్స్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌, ఆర్‌టిసి సంస్థల ఉద్యోగులకు ఈ పిపిఓలను పంపిణీ చేశారు. గత నెలలో ప్రాసెస్‌ చేసిన 08 పెన్షన్‌ దరఖాస్తులకు సంబంధించిన ఉత్తర్వులను సహాయక పీఎఫ్‌. కమిషనర్‌ బాబుల్‌నాథ్‌ నాయక్‌ లబ్ధిదారులకు అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహదారు జితేందర్‌ రెడ్డి

గచ్చిబౌలి: ఒలింపిక్‌ స్థాయి క్రీడాకాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ పని చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహదారులు ఏపీ జితేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ సమ్మిట్‌ నిర్వహించారు. యువ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇచ్చి విశ్వవ్యాప్తంగా ఖ్యాతిగడిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ విద్యతో పాటు శిక్షణ అందిస్తూ స్థిరమైన క్రీడా వ్యవస్థను నెలకొల్పేందుకు స్పోర్ట్స్‌ యూనివర్సిటీ కృషి చేస్తుందన్నారు. స్పోర్ట్స్‌ అథారిటీ వైస్‌ చైర్మెన్‌,ఎండీ సోనీ బాల మాట్లాడుతూ తెలంగాణ గ్రామీణ స్థాయి నుంచి పోటీలు నిర్వహంచి ప్రతిభ వెలికి తీస్తున్నట్లు పేర్కొన్నారు. వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కిశోర్‌ గోపీనాథన్‌, చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘గుండె చికిత్స’పై చర్చా కార్యక్రమం

సాక్షి, సిటీబ్యూరో: గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలో నగరం గణనీయ పురోగతి సాధించిందని ప్రముఖ కార్డియాలజిస్ట్‌లు పేర్కొన్నారు. ‘తీవ్రమైన గుండె వ్యాధుల చికిత్సలో నగరం’అంశంపై గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఏఐజి హాస్పిటల్‌ కు చెందిన కార్డియాక్‌ క్యాత్‌ ల్యాబ్‌ డైరెక్టర్‌, ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ అనుజ్‌ కపాడియా పాల్గొని మాట్లాడారు. కవాట వ్యాధుల విషయంలో, అతి తక్కువ కోతతో చేసే గుండె చికిత్సా విధానాల దిశగా నిరంతర మార్పు కనిపిస్తోందని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement