నడిరోడ్డుపై కత్తితో గొంతుకోసి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై కత్తితో గొంతుకోసి దారుణ హత్య

Apr 24 2026 8:08 AM | Updated on Apr 24 2026 8:08 AM

చిలకలగూడ: చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. ప్రత్యక్షసాక్షులు, పోలీసులు తెలిపిన మేరకు.. ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌కు చెందిన బైక్‌ మెకానిక్‌ సయ్యద్‌ ఇలియాస్‌ (33), జమిస్తాన్‌పూర్‌కు చెందిన ఏసీ మెకానిక్‌ మహ్మద్‌ అలీమ్‌ (42), అదే ప్రాంతానికి చెందిన జహంగీర్‌ ముగ్గురు స్నేహితులు. మహ్మద్‌అలీమ్‌, జహంగీర్‌లు ఇతరులతో కలిసి నిత్యం పేకాట ఆడేవారు. జహంగీర్‌ వద్ద అప్పుగా తీసుకున్న డబ్బు మహ్మద్‌ అలీమ్‌ తిరిగి ఇవ్వలేదు. అడిగితే రేపు, మాపు అని తిప్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు స్నేహితులు కలిసి గురువారం సాయంత్రం పద్మారావునగర్‌లోని కేవీకే వైన్స్‌ వద్ద మద్యం తాగారు. సిట్టింగ్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరోమారు వాగ్వాదం జరిగింది. జహంగీర్‌, ఇలియాస్‌లు పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో మహ్మద్‌ అలీమ్‌పై దాడి చేసి గొంతు కోసి పరారయ్యారు. నడిరోడ్డుపై హత్య జరగడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రక్తపు మడుగులో పడున్న అలీమ్‌ను పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీఆస్పత్రికి తరలించారు. అప్పటికే మహ్మద్‌అలీమ్‌ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీలో భధ్రపరిచారు. చిలకలగూడ ఏసీపీ శశాంక్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణలు ఘటన స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement