నల్లాలపై విజిలెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

నల్లాలపై విజిలెన్స్‌

Apr 24 2026 8:08 AM | Updated on Apr 24 2026 8:08 AM

గ్రేటర్‌లో అక్రమ మోటార్లకు అడ్డుకట్ట

సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం విస్తరిస్తోంది.. జనాభా పెరుగుతోంది.. కానీ నగర దాహం తీర్చే జల వనరులు మాత్రం పదేళ్ల నాటి లెక్కలకే పరిమితమయ్యాయి. సుదూర జలాశయాల నుంచి తరలిస్తున్న నీటి కోటాలో మార్పు లేకపోవడంతో అందుబాటులో ఉన్న జలాలను అందరికీ సమంగా పంచడం జలమండలికి కత్తిమీద సాములా మారింది. దీంతో ప్రతి వేసవిలో నీటి వృథా నియంత్రణ, అక్రమ వినియోగంపై ఉక్కుపాదం మోపుతోంది. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా నీటి కేటాయింపులు లేకపోవడంతో ఉన్న వనరులనే పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో సరఫరాలో అసమానతలను తొలగించేందుకు మండలి వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది.

అక్రమ మోటార్లపై ‘సర్జికల్‌ స్ట్రైక్‌’

నల్లా కనెక్షన్లకు నేరుగా విద్యుత్‌ మోటర్లు బిగించి నీటిని లాగేసే వారిపై జలమండలి కన్నెర్ర చేసింది. పొరుగున ఉన్న ఇతర వినియోగదారులకు లో ప్రెషర్‌తో నీరు అందకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. నీటి సరఫరా సమయాల్లో విజిలెన్స్‌ బృందాలను రంగంలోకి దింపింది. అక్రమ మోటార్లను స్వాధీనం చేసుకునే ప్రక్రియను కొనసాగిస్తోంది. సీజ్‌ చేసిన ప్రతి మోటారుపై వినియోగదారుడికి రూ.2,000 నుంచి రూ.5,000 వరకు అధికారులు జరిమానా విధిస్తున్నారు. నీటి చౌర్యం కింద క్రిమినల్‌ కేసులూ నమోదు చేస్తున్నారు

నీటివృథాపై జలమండలి కన్నెర్ర

తెల్లవారుజామునే అధికారుల దాడులు

నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు

రంగంలోకి ‘వాటర్‌ వలంటీర్లు’

నీటిని వృథా చేస్తున్న సమాచారం అందించేందుకు జలమండలి ‘వాటర్‌ వలంటీర్ల’ను రంగంలోకి దింపుతోంది. పానీ యాప్‌ ద్వారా కచ్చితమైన సమాచారం అందించిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందజేయాలని నిర్ణయించింది. వినియోగదారులు తాగునీటితో వాహనాలు కడగడం, గార్డెనింగ్‌కు వినియోగిస్తే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానాలు విధిస్తోంది. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండాలంటే ప్రతి వినియోగదారుడు స్వచ్ఛందంగా నీటిని పొదుపు చేసేలా అవగాహన కల్పిస్తోంది.

నగరంలోని గాంధీనగర్‌ కాలనీలో గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు తాగునీటి సరఫరా అవుతున్న నేపథ్యంలో జలమండలి విజిలెన్స్‌ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. నివాస సముదాయాల్లో నల్లాలకు అక్రమంగా విద్యుత్‌ మోటార్లు బిగించి నీటిని తోడటాన్ని గుర్తించారు. సుమారు 17 మోటార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్షం రోజులుగా ఇదే తరహాలో జలమండలి ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement