కొత్త రైళ్లకు నిధుల బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

కొత్త రైళ్లకు నిధుల బ్రేక్‌

Apr 24 2026 8:08 AM | Updated on Apr 24 2026 8:08 AM

ఎంఎంటీఎస్‌ రెండో దశ విస్తరణ

పదేళ్లు గడిచినా ప్రతిపాదనలకే పరిమితం

రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు రూ.491 కోట్లు

సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్‌ను నిధుల కొరత వెంటాడుతోంది. రెండోదశ విస్తరణలో భాగంగా కొత్త రైళ్లను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన పదేళ్లు గడిచినా కార్యరూపం దాల్చలేదు. నగరంలో ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టును దక్షిణమధ్యరైల్వే, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టాయి. స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్పీవీ)ని ఏర్పాటు చేశారు. 2003లో రూ.630 కోట్లతో 42 కి.మీ.వరకు చేపట్టిన మొదటి దశ ప్రాజెక్టు విజయవంతమైంది. అదే పద్ధతిలో 2012లో రెండో దశకు శ్రీకారం చుట్టారు. మొత్తం 6 మార్గాల్లో 86 కి.మీ వరకు రెండోదశ విస్తరణకు చర్యలు చేపట్టారు. రూ.860 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును చేపట్టినా ప్రాజె క్టు నిర్మాణంలో జాప్యం కారణంగా రూ.1,305 కోట్లకు పెరిగింది. ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభు త్వం 2/3 వంతు, రైల్వేశాఖ 1/4వంతు చొప్పున నిధులను అందజేయాలి. ఈ లెక్కన రాష్ట్ర వాటా రూ.870 కోట్లు అందజేయాలి. ఇప్పటి వరకు పలు దఫాలుగా కేవలం రూ.379 కోట్లు ముట్టజెపిపంది. మరో రూ.491 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు లభించకపోయినా దక్షిణమధ్య రైల్వే సొంత నిధులను వినియోగించి కొత్త లైన్‌ల నిర్మాణం, విద్యుదీకరణ, డబ్లింగ్‌ పనులను పూర్తి చేసింది.

సర్వీసులు పెంచాలి..

ప్రస్తుతం 80 ఎంఎంటీఎస్‌ సర్వీసులు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. కోవిడ్‌కు ముందుకు 121 సర్వీసుల్లో సుమారు 1.6 లక్షల మంది పయనించారు. ఇప్పుడు ఆ సంఖ్య 45 వేలకు పడిపోయింది. కొత్తగా విస్తరించిన మార్గాల్లో సర్వీసుల సంఖ్యను పెంచేందుకు రైళ్ల కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా ఎంఎంటీఎస్‌ రైళ్లలో అన్ని వర్గాల ప్రయాణికులకు ఉచిత సదుపాయం అందజేయాలంటే ఏటా రూ.10 కోట్ల చొప్పున టిక్కెట్‌ చార్జీలు పెంచాలి. అన్ని రూట్లలో సర్వీసులను పెంచాలి. ఇందుకోసం కనీసం 10 కొత్త రైళ్లను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం రెండోదశ ఒప్పందం ప్రకారం రూ.491 కోట్ల పెండింగ్‌ బకాయీలను చెల్లిస్తే ఆ నిధులతో కొత్త రైళ్లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement