మోత మోగొద్దు! | - | Sakshi
Sakshi News home page

మోత మోగొద్దు!

Dec 25 2023 6:38 AM | Updated on Dec 25 2023 8:23 AM

- - Sakshi

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల్లో అతిగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డీజే బాక్సులు, బాణసంచాకు అనుమతి లేదని..ఎవరైనా డీజేలు ఉపయోగించినా..బాణసంచా కాల్చినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఈమేరకు రాచకొండ కమిషనర్‌ సుధీర్‌బాబు ఆదివారం పబ్‌లు, బార్లు, రెస్టారెంట్స్‌, ఫామ్‌ హౌస్‌లు, వైన్‌ షాపులు, ఈవెంట్‌ ఆర్గనైజేషన్‌ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ బాధ్యతాయుతంగా సహకరించాలని కోరారు.

ట్రాఫిక్‌, ఎస్‌ఓటీ, షీ టీమ్స్‌, పెట్రోలింగ్‌ వంటి పోలీసు బృందాలు వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు, నేరాలు జరగకుండా విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. ఔట్‌ డోర్‌ కార్యక్రమాలు జరిగే చోట డీజే బాక్సులకు అనుమతి లేదని, ఎటువంటి బాణసంచా కాల్చడానికి వీల్లేదని, పరిమితికి మించి ఈవెంట్‌ లోకి ప్రేక్షకులను అనుమతించకూడదని పేర్కొన్నారు. వేడుకల్లో డ్రగ్స్‌ వినియోగాన్ని అరికట్టడానికి తమ బృందాలు తనిఖీలు చేస్తారని, నిషేధిత డ్రగ్స్‌ సరఫరా చేసే ముఠాల మీద ఉక్కుపాదం మోపుతున్నామని ఈ సందర్భంగా కమిషనర్‌ పేర్కొన్నారు. పబ్‌లు, బార్లు, వైన్‌ షాపులు నిర్దేశిత సమయం లోపు మూసి వేయాలని, మైనర్‌ యువతకు మద్యం అమ్మే దుకాణాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

రోడ్ల మీద ట్రాఫిక్‌ ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్‌ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రంకెన్‌ డ్రైవింగ్‌ పరీక్షలు కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే వాహన యజమానుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్థరాత్రి యువకులు నిర్లక్ష్యంగా అధిక వేగంతో వాహనాలు నడపకుండా మరియు ఎటువంటి బైక్‌ రేసులు చేయకుండా ఉండేందుకు నిర్దేశిత సమయం పాటు తాత్కాలికంగా ఫ్లై ఓవర్‌ లను మూసివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ జానకి, యాదాద్రి డీసీపీ రాజేష్‌ చంద్ర, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్‌, ఎస్‌ఓటి డీసీపీ గిరిధర్‌, డీసీపీ అడ్మిన్‌ ఇందిర, ఎల్బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ, ఎస్‌ఓటీ డీసీపీ మురళీధర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement