అక్కకు బై చెప్పేందుకు వెళ్లి.. ఒక్కసారిగా.. | - | Sakshi
Sakshi News home page

అక్కకు బై చెప్పేందుకు వెళ్లి.. ఒక్కసారిగా..

Nov 3 2023 4:42 AM | Updated on Nov 3 2023 7:48 AM

- - Sakshi

హర్షకుమార్‌ (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: స్కూల్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ పసివాడి ప్రాణాన్ని బలితీసుకుంది. అక్కను బస్సు ఎక్కించేందుకు బస్సు దగ్గరికి వెళ్లిన బాలుడు బస్సు ముందు టైరు కింద పడి మృతి చెందిన సంఘటన గురువారం హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం, జనంపల్లికి చెందిన తన్నీరు శ్రీకాంత్‌ పోస్ట్‌మెన్‌గా పనిచేస్తూ పెద్దఅంబర్‌పేట్‌ మున్సిపాలిటీలోని కుంట్లూరు గణేష్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతనికి కుమార్తె నిషిక, కుమారుడు పవన్‌ హర్షకుమార్‌(3) సంతానం. గురువారం ఉదయం పెద్దఅంబర్‌పేట్‌లోని కాండర్‌షైన్‌ పాఠశాలలో చదువుతున్న తన కుమార్తెను స్కూల్‌ బస్సు ఎక్కిస్తుండగా అతడి కుమారుడు హర్ష కూడా బస్సు వద్దకు వచ్చాడు.

అక్కడే ఉన్న బస్సు అటెండర్‌ మల్లారెడ్డి బాలుడిని గమనించకపోవడంతో బస్సు డ్రైవర్‌ ఈశ్వర్‌ సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ బస్సును ముందుకు తీశాడు. దీంతో బస్సు ముందు చక్రాలు చిన్నారి తలపై వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ల ముందే కొడుకు ప్రాణాలు పోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా విలపించారు. దీనిని గుర్తించిన కాలనీ వాసులు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement