● తెలుగు అకాడమీ చైర్మన్ వెంకటనారాయణ,
సంచాలకుడు రమేశ్
హన్మకొండ కల్చరల్: విద్యార్థులకు అవసరమైన నాణ్యమైన పుస్తకాలు అందించి విద్యాప్రగతికి విశేష కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ, సంచాలకుడు, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్ అన్నారు. మంగళవారం వరంగల్ హంటర్‌రోడ్‌లోని జానపద గిరిజన విజ్ఞానపీఠంలో పీఠాధిపతి గడ్డం వెంకన్న అధ్యక్షతన కూరపాటి వెంకటనారాయణ, భట్టు రమేశ్‌కు సన్మా నం, ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, కేయూ విశ్రాంతాచార్యుడు బన్న అయిలయ్య, వ్యక్తిత్వ వికాస నిపుణుడు రాజ్‌మహ్మద్, బ్రాహ్మణసేవా సమితి నాయకుడు జీవీఎస్ శ్రీనివాసాచారి పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. భట్టు రమేశ్ మాట్లాడుతూ జానపద గిరిజన విజ్ఞానపీఠంలో జరిగిన పరిశోధనలు అమూల్యమైనవన్నారు. ఉపేంద్రశర్మ మాట్లాడుతూ తెలుగు అకాడమీ విద్యారంగానికి విశేషసేవలందిస్తోంన్నారు. బన్న అయిలయ్య మాట్లాడుతూ తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణకు కృషి చేయాలన్నారు. రాజ్‌మహ్మద్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే పాఠ్యాంశాలు అందించాలని కోరారు. తెలుగు విశ్వవిద్యాలయం డీన్ భూక్య బాబురావు, వి.నాగేశ్వరరావు, వరంగల్ మిత్రమండలి అధ్యక్షుడు జైసింగ్ రాథోడ్, రవీందర్, భాస్కర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు దామోదర్, సురేశ్, రవికుమార్, గోపాల్‌రెడ్డి, సతీశ్ పాల్గొన్నారు.


