వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జిల్లాలో నిర్వహిస్తున్న స్ఫూర్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రత్యేక అధికారులకు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా మార్గనిర్దేశనం చేయాలని ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ పాఠశాలల ప్రత్యేక అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలల అభివృద్ధి కోసం ప్రత్యేక అధికారులను నియమించినట్లు వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వైవీ గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి ఉన్నారు.
కలెక్టరేట్ నిర్మాణ పనుల పరిశీలన
వరంగల్ ఆజంజాహి మిల్లు మైదానంలో నిర్మాణంలో ఉన్న నూతన కలెక్టర్ కార్యాలయాన్ని కలెక్టర్ డాక్టర్ సత్యశారద మంగళవారం సందర్శించారు. నిర్మాణ పనుల పురోగతి, వివిధ విభాగాల పనుల స్థితిగతులను పరిశీలించారు. ఇంకా మిగిలి ఉన్న పనులను గడువులోపు పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్‌ను కలెక్టర్ ఆదేశించారు.


