కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్దరణలో భాగంగా చేపడుతున్న కూల్చివేతలు తుదిదశకు చేరాయి. వారం క్రితం శ్రీశివరామ్ అండ్ కంపెనీ టెండర్ దక్కించుకుని కూల్చివేత పనులు మొదలు పెట్టింది. ముందుగా దక్షిణం వైపు నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. శివుడి విగ్రహం వద్ద పిల్లర్ల దశలో ఉన్న అక్షరస్వీకారం మండపానికి వేసిన పిల్లర్లను తొలగించారు. తర్వాత ప్రాకారాలు నైరుతి మూలన ఉన్న విజయగణపతి, శ్రీ మహా సరస్వతి అమ్మవారి ఆలయం, అద్దాల మండపం, అభిషేక మండపం, శ్రీశుభానందాదేవి అమ్మవారి ఆలయం, శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయాలను తొలగించారు. మంగళవారం ప్రధాన ఆలయానికి ఆనుకుని ఉన్న అనివెట్టి మండపం, ప్రధాన ఆలయ మండప పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాత్రి వరకు ప్రధాన ఆలయం తొలగిస్తారు. దక్షిణ, పడమర, ఉత్తర గోపురాలకు ఆనుకుని ఉన్న ప్రాకారాలు తొలగించారు. ఆ మూడు గోపురాలు తొలగిస్తే కూల్చివేత పనులు ముగిసినట్లే అని ఆలయ వర్గాలు తెలిపాయి. తర్వాత ఆలయ పునర్నిర్మాణ పనులు మొదలు కానున్నాయి.


