హన్మకొండ అర్బన్: గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలోని భీమదేవరపల్లి, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని హనుమకొండ ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, నీటిపారుదల శాఖ అధికారులతో భూసేకరణ పురోగతిపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని, తహసీల్దార్లు, సర్వేయర్లు, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వేలే రు మండలంలోని రెండు గ్రామాల సబ్‌డివిజన్ రికార్డులను వారంరోజుల్లో పూర్తిచేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇప్పటికే సర్వే పూర్తయిన భూముల అవార్డు ఎంకై ్వరీలను 10 రోజుల్లో ముగించాలని స్పష్టం చేశారు. ఆర్డీఓ వెంకటేశ్, సాగునీటిపారుదల శాఖ డీఈ చైతన్య, అధికారులు పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వైద్య సదుపాయాల విస్తరణకు అవసరమైన ప్రతిపాదనలతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహను మంగళవారం సచివాలయంలో కలిశారు. కాజీపేటలో 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి మంజూరు చేయడంతోపాటు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి (జీఎంహెచ్) భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, ఆధునిక వైద్య పరికరాల కొనుగోలుకు అదనపు నిధులు కేటాయించాలని కోరారు. అదేవిధంగా టీబీ ఆస్పత్రికి కొత్త భవనం, అంబులెన్స్, ఆధునిక ఎక్స్‌రే యంత్రాన్ని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలను మంత్రి దామోదర్ రాజనరసింహ సానుకూలంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే నాయిని తెలిపారు.
హసన్‌పర్తి: విద్యారంగంలో జిల్లాను ‘పర్‌ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్(పీజీఐ)’లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపడానికి కృషిచేయాలని హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ అన్నారు. హసన్‌పర్తి మండలం భీమారంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రెండో విడత ప్రధానోపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. గిరిరాజ్‌గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాఠశాలలు నాణ్యమైన విద్యకు కేంద్రాలుగా మారాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రధానోపాధ్యాయులు సత్సంబంధాలు కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గుణాత్మక విద్య సమన్వయ అఽధికారి డాక్టర్ బి. మన్మోహన్, ఎంఈఓ శ్రీనివాస్, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఇన్‌చార్జ్ సుమాదేవి పాల్గొన్నారు.


