3 టీఎంసీల చెరువుపై ప్రభావం?
సాక్షిప్రతినిధి, వరంగల్: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, చారిత్రక రామప్ప చెరువుకు సింగరేణి ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్ బొగ్గుగనితో పొంచిఉన్న ముప్పుపై పౌరులు, పౌరస్పందన వేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘మైనింగ్ ఆపండి, రామప్పను కాపాడండి’ నినాదంతో ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఓపెన్‌కాస్ట్ బొగ్గుగని వల్ల ముప్పు పొంచి ఉందని, ఆ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డిని కలిసి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ (కేహెచ్‌టీ) వినతిపత్రం సమర్పించింది. ఈ మేరకు ట్రస్టీ ప్రొఫెసర్ ఎం.పాండురంగారావు, వరంగల్ నగర మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావు, మండల పరశురాములు తదితరులు ఆదివారం ఒక ప్రకటనలో వివరాలు తెలిపారు.
అధికార యంత్రాంగం నో అన్నా..
పీవీఎన్‌ఆర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు ఇంకా ప్రతిపాదిత దశలోనే ఉంది. 2021వ సంవత్సరంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల కమిటీ ప్రాజెక్టుకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) మంజూరుకు సిఫారసు చేసింది. 2026 సెప్టెంబర్‌లో రామప్పపై ప్రభావాన్ని అంచనా వేసేందుకు శాసీ్త్రయ, పర్యావరణ అధ్యయనాలు పూర్తయ్యే వరకు ముందుకు వెళ్లరాదనే అభిప్రాయాన్ని ములుగు జిల్లా యంత్రాంగం వ్యక్తం చేసింది. ఇటీవల పాలంపేట ప్రత్యేక అభివృద్ధి సంస్థ సమావేశంలో కూడా ప్రాజెక్టు ప్రభావంపై సమగ్ర పరిశీలన, శాసీ్త్రయ అధ్యయనాల అవసరాన్ని చర్చించారు. ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ)పై తుది నిర్ణయం అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేసినట్లు నివేదికలు వెల్లడించినా సింగరేణి ముందుకు సాగడంపై కేహెచ్‌టీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అవుతోంది.
ములుగు జిల్లా వెంకటాపూర్ గ్రామం వద్ద సింగరేణి ప్రతిపాదించిన పీవీ నరసింహారావు ఓపెన్‌కాస్ట్ మైన్ రామప్ప చెరువు, దేవాలయానికి దిగువ వైపున సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. గనిని సుమారు 300 మీటర్ల లోతు వరకు తవ్వే ప్రతిపాదన ఉందని తెలిపారు. పీవీఎన్‌ఆర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు రామప్పకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొన్న తాజా అధ్యయనాలు కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 3 టీఎంసీల నీటిని నిల్వచేసి దాదాపు 30 వేల ఎకరాలకు సాగునీరు అందించే రామప్ప చెరువుకు ముప్పు పొంచి ఉందనని తెలిపారు. చెరువు కింద భాగంలో 300 మీటర్ల లోతైన గని తవ్వితే భూగర్భజలాల ప్రవాహంలో మార్పులు, లీకేజీ వేగం పెరిగే అవకాశం ఉందని, దీనిపై జీఎస్‌ఐ నివేదికలోని పరిశీలనలను ఉటంకించిందని కేహెచ్‌టీ బాధ్యులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. బ్లాస్టింగ్ వల్ల రామప్ప ఆలయం ఇప్పటికే ఫ్లోర్ బీముల్లో పగుళ్లు, డిఫరెన్షియల్ సెటిల్‌మెంట్ వంటి సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొంది.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కేహెచ్‌టీ వినతిపత్రం
‘రామప్ప’ పరిరక్షణకు ప్రజా ఉద్యమం
5 కిలోమీటర్ల దూరంలో 300 మీటర్ల లోతైన ఓపెన్‌కాస్ట్
చెరువుపై ‘హైడ్రాలిక్ గ్రేడియంట్’ ప్రభావంపై ఆందోళన


