స్వల్పంగా పెరిగిన భూగర్భ జలాలు | - | Sakshi
Sakshi News home page

స్వల్పంగా పెరిగిన భూగర్భ జలాలు

Oct 5 2026 1:27 AM | Updated on Oct 5 2026 1:27 AM

స్వల్పంగా పెరిగిన భూగర్భ జలాలు

524.2 మిల్లీమీటర్ల వర్షపాతం

హన్మకొండ: వర్షాభావ పరిస్థితుల్లోనూ భూగర్భ జలాలు స్వల్పంగా పెరగడం రైతులకు ఊరటనిస్తోంది. హనుమకొండ జిల్లాలో 36 శాతం లోటు వర్షంపాతం నమోదైనా భూగర్భ జలాలు స్వల్పంగా పెరిగాయి. భూమి ఉపరితలం నుంచి చూస్తే సెప్టెంబర్‌ మాసాంతంలో 5.98 మీటర్ల వద్ద భూగర్భ జలమట్టం ఉంది. భూగర్భ జలమట్టం వివరాలను భూగర్భ జలశాఖ ప్రతినెలా చివరి వారంలో సేకరిస్తుంది. నైరుతి రుతుపవనాలకు ముందు మే మాసాంతంలో జిల్లా సగటు భూగర్భ జలమట్టం 6.17 మీటర్లు. జూన్‌ నాటికి 7.25 మీటర్లు, జూలై నాటికి 7.71 మీటర్లకు భూగర్భ జలమట్టం పడిపోయింది. ఆగస్టు, సెప్టెంబర్‌లలో క్రమంగా భూగర్భ జలమట్టం పెరిగింది. ఆగస్టులో 6.83 మీటర్లకు, సెప్టెంబర్‌ మాసాంతానికి అది 5.98 మీటర్లకు చేరుకుంది. గతేడాది సెప్టెంబర్‌ మాసాంతంలో 3.40 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 2.58 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఈ ఏడాది జూలై మాసాంతంతో పోలిస్తే సెప్టెంబర్‌ మాసాంతానికి 1.73 మీటర్లు, ఆగస్టుతో పోలిస్తే 0.85 మీటర్లు భూగర్భ జలాలు వృద్ధి చెందాయి.

2,13,435 ఎకరాల్లో పంటల సాగు

హనుమకొండ జిల్లాలో అన్ని పంటలు కలిపి గతేడాది వానాకాలంలో 2,27,957 ఎకరాల్లో సాగు చేయగా, ఈ వానాకాలంలో 2,13,435 ఎకరాల్లో సాగైంది. 14,522 ఎకరాలు తక్కువ సాగు చేశారు. ఇందులో వరి గతేడాది 1,45,601 ఎకరాల్లో సాగు చేయగా.. ఈ వానాకాలంలో 1,20,446 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న గతేడాది 7,080 ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 8,444 ఎకరాలు, పప్పు దినుసులు గతేడాది 395 ఎకరాలు కాగా, ఈ ఏడాది 4,486 ఎకరాలు, నూనె గింజలు గతేడాది 32 ఎకరాలు, ప్రస్తుతం 309 ఎకరాలు, పత్తి గతేడాది 74,849 ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 75,747 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది కంటే వరి 25,155 ఎకరాల్లో తక్కువ సాగైంది. దీంతో భూగర్భ జల వినియోగం కొంత మేర తగ్గింది. దీనికితోడు గతనెల 24, 25 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి స్వల్పంగా నీరు చేరింది. దీంతో భూగర్భ జలాల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది.

జిల్లాలో ఈనెల 3వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 824.5 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటి వరకు 524.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 36 శాతం లోటు వర్షపాతం నెలకొంది. జిల్లాలోని 14 మండలాల్లో ఒక మండలంలో 50 శాతం లోటు ఉండగా 5 మండలాల్లో 41 నుంచి 49 శాతం లోటు ఉంది. మిగతా మండలాల్లో 17 నుంచి 37 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. నడికూడ మండలం చర్లపల్లిలో అత్యధికంగా 13.32 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. భీమదేవరపల్లి మండలం వంగరలో 11.60 మీటర్ల లోతులో, హసన్‌పర్తి నాగారంలో 10.82 మీటర్ల లోతులో ఉండగా, ధర్మసాగర్‌లో అత్యంత పైన 1.50 మీటర్ల లోతులో ఉన్నాయి.

సెప్టెంబర్‌లో హనుమకొండ జిల్లా

సగటు నీటిమట్టం 5.98 మీటర్లు

జిల్లాలో లోటు వర్షపాతం నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement