పది నెలలుగా పోస్టులు ఖాళీ..
కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, ఎస్సీ, బీసీ అభివృద్ధి శాఖలో ఇన్‌చార్జ్‌ల పాలన కొనసాగుతోంది. శాఖలో పూర్తిస్థాయిలో అధికారులు లేక అభివృద్ధి కుంటుపడుతోందన్న విమర్శలున్నాయి. తీసుకోవాల్సి న నిర్ణయాల్లో జాప్యం జరుగుతోందని, సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా శాఖల్లో అధికారులు కొందరు ఉద్యోగ విరమణ పొందగా, మరికొందరు బదిలీ అయ్యారు. దీంతో కింది స్థాయి అధికారులకు ఎఫ్‌ఏసీగా, పక్క జిల్లా అధికారులకు ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఎఫ్‌ఏసీ, ఇన్‌చార్జ్ బాధ్యతలందుకున్న ఉద్యోగులు అదనపు భారంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
ఐదు నెలలుగా ఎస్సీ కార్పొరేషన్‌లో..
ఐదు నెలల క్రితం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఉద్యోగ విరమణ పొందగా.. పక్క జిల్లా ఈడీకి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. నాటి నుంచి పూర్తి స్థాయి అధికారిగా పక్క జిల్లాతో పాటు హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్‌గా డ్యూయల్ జాబ్ రోల్ చేస్తున్నారు.
ఆరు నెలలుగా బీసీ వెల్ఫేర్‌లో..
జిల్లాలోని బీసీ వెల్ఫేర్ అధికారి ఆరు నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందగా ఇన్‌చార్జ్ బాధ్యతలను అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారికి అప్పగించారు. ఇటీవల పూర్తిస్థాయి అధికారి వచ్చినట్టే వచ్చి వారం రోజుల్లోనే ఉద్యోగ విరమణ పొందారు. దీంతో మళ్లీ ఇన్‌చార్జ్ పాలనే బీసీ వెల్ఫేర్ శాఖలో కొనసాగుతోంది.
కుంటుపడుతున్న అభివృద్ధి
ఖాళీల భర్తీల్లో గందరగోళం
సీ్త్ర, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలో ఈ ఏడాది జనవరిలో జిల్లా అధికారి ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి సీడీపీఓ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పూర్తి స్థాయి అధికారి లేక అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 55 టీచర్, 160 ఆయాల పోస్టుల భర్తీకి కేవలం 55 మంది టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. జారీ అయిన నోటిఫికేషన్‌లో రిజర్వేషన్లకు విరుద్ధంగా పోస్టులను కేటాయించారంటూ కలెక్టర్‌కు దమ్మన్నపేట సర్పంచ్ వినతిపత్రం అందించడం చర్చనీయాంశంగా మారింది.


