హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని రాష్ట్ర హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ కుటుంబ సమేతంగా ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఈయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు.
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ టి.వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులను అందజేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
సద్వినియోగం చేసుకోవాలి..
న్యూశాయంపేట: సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ కార్యాలయం, రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్డీఓ కార్యాలయాలు, మండలాల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే గ్రీవెన్స్‌కు అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలన్నారు.
హన్మకొండ: తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 హనుమకొండ జిల్లా ప్రాంతీయ సమావేశం సోమవారం జరుగుతుందని ఆ యూనియన్ ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని పల్లా రవీందర్‌రెడ్డి భవన్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీఎస్‌ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సమావేశానికి యూనియన్ సభ్యులు సకాలంలో హాజరు కావాలని మహేందర్‌రెడ్డి కోరారు.
మేడారంలో మొక్కుల సందడి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేలసంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, సమర్పించారు. సంతానం కలగాలని మహిళలు రావి చెట్టు వద్ద ముడుపులు కట్టారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు.
హేమాచల క్షేత్రంలో పూజలు
మంగపేట: రెండోయాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు హేమాచల క్షేత్రం ఆదివారం భగవన్నామస్మరణతో మార్మోగింది. ఆలయంలోని స్వయంభూ స్వామివారిని దర్శించుకుని తిలతైలాభిషేకం పూజలో పాల్గొనేందుకు వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు.


