‘కారుణ్య వీసా’ ఫాస్ట్‌–ట్రాక్‌ ఒప్పందం కావాలి! | Tragedy Behind Indian Students US Dreams By Srinivas Madhav | Sakshi
Sakshi News home page

విదేశీ కలల వెనుక విషాదం

Jun 18 2026 8:07 PM | Updated on Jun 18 2026 8:27 PM

Tragedy Behind Indian Students US Dreams By Srinivas Madhav

అభిప్రాయం

దశాబ్దాలుగా ‘అమెరికన్‌ డ్రీమ్‌’ భారత యువతను ఆకర్షిస్తోంది. లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తున్నారు. అక్కడ మంచి ఉద్యోగాలు సాధించి, సాంకేతిక ఆవిష్కరణలతో రెండు దేశాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అయితే, ఈ విజయగాథల వెనుక, కొన్ని విషాదాలూ ఉన్నాయి.

మాస్టర్స్‌ డిగ్రీ చేయడానికి వెళ్ళిన తెలుగమ్మాయి ‘స్పందన’ మే 31న ఇల్లినాయిలోని మెట్రో స్టేషన్‌ పైనుండి కిందపడి, తీవ్ర గాయాలవ్వడంతో ఆమె తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. పాస్‌పోర్టు, వీసా, డబ్బు లేకపోవడంతో వేలాది మైళ్ల దూరంలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. భారతీయ విద్యార్థులు తరచుగా – రోడ్డు ప్రమాదాలు, అపార్టుమెంట్లలో అగ్ని ప్రమాదాలకు గురవ్వడం, ఈతకు వెళ్లి మునిగిపోవడం, తీవ్ర అనారోగ్యాలు, హింస, దాడుల బారిన పడటం జరుగుతోంది.

ఉన్నత విద్య కోసం పిల్లలను అమెరికా పంపడం అనేది సగటు భారతీయ కుటుంబానికి జీవితకాల పొదుపు, ఆస్తుల అమ్మకం, భారీ విద్యా రుణాల కలబోత. ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయినా, గాయాల పాలైనా– సాకారం కాని భవిష్యత్తు కోసం కుటుంబాలు భారీ అప్పులు తీరుస్తూనే ఉండాల్సి వస్తుంది. అత్యవసర వీసాలు పొందడం, చివరి నిమిషంలో విమాన టిక్కెట్లు కొనడం, విదేశీ ఆసుపత్రుల భారీ బిల్లులు చెల్లించడం అనేది ప్రభుత్వ సహాయం లేకుండా మధ్యతరగతి కుటుంబాలకు అసాధ్యం.

బీమాతో ధీమా ఇవ్వాలి!
ఈ విద్యార్థులు భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తు న్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం సమగ్ర బీమా విధానాన్ని రూపొందించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది. ఇలాంటి బీమాకు నిధులు సమకూర్చడం భారం కాదు. భారతీయ ప్రవా సులు ప్రతి ఏటా సుమారు 13 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని భారతదేశానికి పంపుతున్నారు. ఈ బీమా పూల్‌ను సృష్టించడం భారత విదేశీ మారక నిల్వలను పెంచుతున్న ఈ వర్గంపై ప్రభుత్వం పెట్టే చిన్న పెట్టుబడి మాత్రమే.

ఈ బీమా పాలసీలో అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులు వెంటనే విదేశాలకు వెళ్లేందుకు కుటుంబ ప్రయాణ ఆర్థిక సదుపాయాలను చేర్చాలి. మరణించిన విద్యార్థి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అయ్యే ఖర్చులకు పూర్తి కవరేజ్‌ అందించాలి. దీనికి తోడు, విద్యా రుణ రక్షణ కవచం కూడా ఉండాలి.

ఇలాంటి విషాదాలను నివారించడానికి, వెంటనే స్పందించడానికి బహుముఖ వ్యవస్థాగత విధానం అవసరం. స్పందన కుటుంబం వంటివి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య వీసా. కుటుంబ సభ్యులకు 24–48 గంటల్లో అత్యవసర వీసా మంజూరు చేసేలా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమెరికా లాంటి దేశాలతో ద్వైపాక్షిక ‘కారుణ్య వీసా’ ఫాస్ట్‌–ట్రాక్‌ ఒప్పందం చేసుకోవాలి. అలాగే, అత్యవసర సమయాల్లో స్థానిక కాన్సులేట్, పోలీసులతో పాటు స్థానిక ప్రవాస భారతీయ సంఘాలతో సమన్వయం చేసి తక్షణ సహాయం అందించే వ్యవస్థ ఉండాలి. 

విదేశీ యూనివర్సిటీలు భారతీయ విద్యార్థుల ద్వారా భారీ లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ, విద్యార్థుల భద్రతపై ఎలాంటి శ్రద్ధ వహించడం లేదు. ఆ యూనివర్సిటీలకు ప్రభుత్వం ‘సేఫ్టీ రేటింగ్‌’ ఇవ్వాలి. సరైన భద్రత ఉందని నిరూపించుకుంటేనే భారతదేశంలో అడ్మిషన్ల ప్రచారానికి అనుమతి ఇవ్వాలి.

చ‌ద‌వండి: ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఏది?

మన విద్యార్థులు నేరుగా సంక్లిష్టమైన, నేరాలు ఎక్కువగా ఉండే విదేశీ నగరాలకు వెళ్తుంటారు కాబట్టి, ప్రయాణానికి ముందే వారికి తప్పనిసరి ‘అర్బన్‌ సర్వైవల్‌’ శిక్షణ ఇవ్వాలి. రాత్రి పూట పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎలా వాడాలి, తీవ్రమైన వాతావరణాన్ని ఎలా తట్టుకోవాలి, అత్యవసర సమయాల్లో ఎవరిని సంప్రదించాలి అనే విషయాలపై అవగాహన కల్పించాలి. ఆధునిక భారతదేశ సంకల్పానికి ఈ యువత ప్రతీక. కష్టాల్లో ఉన్నప్పుడు వారిని గాలికి వదిలేయ కూడదు.

- శ్రీనివాస్‌ మాధవ్‌ 
‘51అ అభీ ఫౌండేషన్‌’ వ్యవస్థాపకులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement