అభిప్రాయం
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఆడంబరంగా విడుదల చేసిన, రంగురంగుల ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఒక ప్రతిష్ఠాత్మక ప్రణాళికగా ప్రచారం పొందుతోంది. కానీ యువత, గ్రామీణ అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం, హైదరాబాద్‌ను ప్రపంచంలోని అగ్రగామి ఆవిష్కరణ నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దడం, ఫ్యూచర్ సిటీ, కృత్రిమ మేధస్సు కేంద్రాలు, గ్లోబల్ పెట్టుబడులు, బుల్లెట్ రైళ్లు, మెగా కారిడార్లు నిర్మించడం వంటి భారీ లక్ష్యాలను ఈ పత్రం ప్రతిపాదిస్తోంది.
మొదటి చూపులో ఇది సాహసోపేత, భవిష్యత్ దృష్టితో కూడిన పత్రంలా కనిపిస్తుంది. లోతుగా పరిశీలిస్తే గ్రామీణ ప్రజలు, రైతులు, నిరుద్యోగ యువత, ప్రభుత్వ విద్యపై ఆధారపడే కుటుంబాలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలకు సమగ్ర సమాధానం ఇవ్వలేకపోయిందనే భావన కలుగుతుంది. ఏ అభివృద్ధి నమూనాకైనా అంతిమ కొలమానం జీడీపీ వృద్ధి కాదు. ప్రజల జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాలు, విద్యా నాణ్యత, ప్రాంతీయ సమానత్వం, సామాజిక చలనశీలత వంటివే ముఖ్యమైనవి.
ఉపాధి కల్పనలో స్పష్టత ఏది?
ఈ పత్రంలో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తారు? మహిళల భాగస్వామ్యం ఎంత? వంటి ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం లేదు. చైనా అభివృద్ధి కేవలం బీజింగ్, షాంఘై, షెన్ జెన్ నగరాల మీద లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ‘పట్టణ, గ్రామస్థాయి సంస్థలు’ (టీవీఈ) పేరుతో లక్షల సంఖ్యలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను స్థాపించింది. గ్రామాల్లోనే ఉత్పత్తి, ప్రాసెసింగ్, సేవా రంగాలను అభివృద్ధి చేసి కోట్లాది ఉద్యోగాలను సృష్టించింది. తెలంగాణలో కూడా ఇదే తరహాలో ప్రతి మండలాన్ని ఒక ఉత్పత్తి కేంద్రంగా, ప్రతి జిల్లాను ఒక ప్రత్యేక పారిశ్రామిక గుర్తింపుతో అభివృద్ధి చేయాలి. నిజామాబాద్‌లో వ్యవసాయ ప్రాసెసింగ్, జగిత్యాల–కరీంనగర్ ప్రాంతాల్లో ఆహార ఉత్పత్తుల పరిశ్రమలు, ఆదిలాబాద్‌లో అటవీ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు వంటి జిల్లా–ప్రత్యేక అభివృద్ధి నమూనాలు రూపొందించాలి. కానీ ప్రస్తుత పత్రంలో ఇలాంటి స్పష్టమైన జిల్లా స్థాయి ఆర్థిక వ్యూహం కనిపించదు.
ఈ పత్రం ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు, ఏఐ సిటీలు, జ్ఞాన ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతోంది. కానీ వేలాది ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమిటి? గ్రామీణ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి ఎలా జరుగుతుంది? ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళా శాలలు, ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు ఎలా బలోపేతం అవుతాయి? అనే ప్రశ్నలకు సమాధానం లేదు.
ఫిన్లాండ్ నమూనా ఈ విషయంలో ఎంతో ప్రాసంగికం. ఫిన్లాండ్ విద్యా విప్లవం రాజధానిలో ప్రారంభం కాలేదు. గ్రామీణ పాఠశాలల నుంచే ప్రారంభమైంది. గ్రామంలో చదివే విద్యార్థికి, నగరంలో చదివే విద్యార్థికి ఒకే నాణ్యత గల విద్య అందించాలనే లక్ష్యంతో వారు ముందుకు వెళ్లారు. తెలంగాణ కూడా దీనిని అనుసరించాలి.
జర్మనీ అనుభవం మరో ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. అక్కడ విద్య – ఉపాధి వేర్వేరు వ్యవస్థలు కావు. విద్యార్థి చదువు తున్నప్పుడే పరిశ్రమలో పనిచేసే ద్వంద్వ విద్యా విధానం అమలులో ఉంది. అందువల్ల విద్య పూర్తయ్యే నాటికి ఉద్యోగానికి కావలసిన నైపుణ్యాలు అతనికి సిద్ధమై ఉంటాయి. తెలంగాణలో ప్రతి ఐటీఐ, ప్రతి పాలిటెక్నిక్, ప్రతి డిగ్రీ కళాశాలను స్థానిక పరిశ్రమలతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది.
తెలంగాణలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత ఉద్యోగ మార్కెట్‌లోకి వస్తున్నారు. వారికి కేవలం స్కిల్ హబ్‌లు సరిపోవు. ఉద్యోగ హామీ, అప్రెంటిస్‌షిప్ హామీ, స్థానిక పరిశ్రమల అభివృద్ధి, డిజిటల్ ఉపాధి అవకాశాలు, గ్రామీణ స్టార్టప్ వ్యవస్థలు అవసరం. ప్రతి నియోజకవర్గంలో బీపీఓ కేంద్రాలు, డిజిటల్ సేవా కేంద్రాలు, గ్రామీణ ఈ–కామర్స్ హబ్‌లు, మహిళా ఉత్పత్తిదారుల సహకార సంఘాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
చదవండి: దేశంలో గిరిజన అభివృద్ధికి సవాళ్లు
తెలంగాణ రైజింగ్ 2047 పత్రం అభివృద్ధిని ప్రధానంగా నగరాల విస్తరణ కోణంలో చూస్తోంది. కానీ 21వ శతాబ్దపు విజయ వంతమైన అభివృద్ధి నమూనా నగరాలు, గ్రామాల మధ్య సమతు ల్యతను సాధించడంలో ఉంది. ఇది గ్రామీణ నిరుద్యోగులను నగరా లకు వెళ్లేలా వలసలను ప్రోత్సాహిస్తుంది. హైదరాబాద్ అభివృద్ధి అవసరం. ప్రపంచ పెట్టుబడులు కూడా అవసరం. కానీ అదే సమ యంలో ములుగు గిరిజన విద్యార్థికీ, నాగర్‌కర్నూల్ రైతు కుటుంబానికీ, నారాయణపేట మహిళకూ ఈ విజన్ ఏం ఇస్తుందో కూడా స్పష్టంగా చెప్పాలి.
- సీహెచ్.వి. ప్రభాకర్ రావు
సీనియర్ జర్నలిస్ట్


