విశ్లేషణ
గిరిజన అభివృద్ధి నిరంతర పురోగతితో సాగిన ప్రయాణం కాదు. ఇది పాలన విధానాలు, ఆలోచనా విధానాలు, రాజ్యాంగ హామీల మధ్య జరిగిన మార్పులతో రూపుదిద్దుకున్న క్లిష్టమైన ప్రయాణం. ఇందులో రక్షణ, సమగ్రత, స్వయం ప్రతిపత్తి, ప్రభుత్వ జోక్యం, సాంస్కృతిక గుర్తింపు, ఆర్థిక అభివృద్ధి మధ్య ఇప్పటికీ కొనసాగుతున్న సంఘ ర్షణే కనిపిస్తుంది. బయటకు అభివృద్ధి కనిపించినప్పటికీ, లోపల అనేక నిర్మాణాత్మక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్రిటిష్ పాలనలో గిరిజన ప్రాంతాలను ప్రత్యేక ప్రాంతాలుగా పరిగణించి పాలన అమలు చేశారు. 1874లో ‘షెడ్యూల్డ్ జిల్లాలు’, 1919లో ‘వెనుకబడిన ప్రాంతాలు’, 1935లో ‘మినహాయించ బడిన’, ‘కొంతమేరకు మినహాయించబడిన ‘ ప్రాంతాలు అనే వర్గీక రణలు చేశారు. ఇవి గిరిజనులను రక్షించే లక్ష్యంతో ఉన్నప్పటికీ, వాస్తవానికి పరోక్ష దోపిడీకి మార్గాన్ని సుగమం చేశాయి.
కేవలం అధ్యయనాంశమా?
1924లో వచ్చిన ఏజెన్సీ రూల్స్ ద్వారా రెవెన్యూ అధికారులకు విస్తృత అధికారాలను ఇచ్చారు. పరిపాలన, న్యాయ అధికారాలు ఒకే వ్యక్తి చేతిలో ఉండేవి. ఈ విధానం ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలలో కొంతవరకు కనిపిస్తున్నది. రక్షణ పేరుతో గిరిజన ప్రాంతాలు వేరుపడిపోయాయి. దాంతో వ్యాపారులు, మధ్య వర్తులు, కాంట్రాక్టర్లు గిరిజనులను దోచుకున్నారు. గిరిజనులు భూములను కోల్పోయారు, అప్పుల్లో కూరుకుపోయారు. రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు లేక అభివృద్ధికి దూరమయ్యారు.
20వ శతాబ్దం ప్రారంభంలో తక్కర్ బాపా వంటి సంస్కరణ వాదులు ఈ విధానాన్ని వ్యతిరేకించారు. 1941లో మినహాయించ బడిన ప్రాంతాల కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న ఆయన, గిరిజనులను కేవలం అధ్యయనానికి సంబంధించిన ప్రజలుగా కాకుండా, గౌర వంతో బాటు అభివృద్ధికి అర్హులైన పౌరులుగా చూడాలని చెప్పారు. ఆయన ఆలోచనలు ఆ తరువాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46లో ప్రతిబింబించాయి. దీని ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి.
స్వాతంత్య్రం తరువాత రాజ్యాంగం గిరిజన ప్రాంతాలను ఐదో షెడ్యూల్, ఆరవ షెడ్యూల్ కింద ప్రత్యేక పరిపాలన క్రిందికి తీసుకు వచ్చింది. గిరిజనులను ప్రధాన సమాజంలో కలపాలా? లేక వేరుగా ఉంచాలా? అనే పెద్ద ప్రశ్న ముందుకొచ్చింది. కలపడం వల్ల వారి సంస్కృతి దెబ్బతింటుంది; వేరుగా ఉంచడం ప్రజాస్వామ్య సమా నత్వానికి విరుద్ధం. జవహర్‌లాల్ నెహ్రూ ‘పంచశీల సూత్రాల’ ద్వారా సమతుల్య మార్గాన్ని సూచించారు. గిరిజనుల స్వభావానికి అనుగుణంగా అభివృద్ధి జరగాలి; వారి భూమి, అడవి హక్కులు, సంప్రదాయ సంస్థలకు రక్షణ అవసరం అని చెప్పారు. అభివృద్ధిని కేవలం డబ్బు లేదా ఆర్థిక వృద్ధితో కాకుండా, మానవ గౌరవంతో బాటు సామర్థ్యాల పెరుగుదలతో కొలవాలని చెప్పారు. 1969లో శీలు ఆవో కమిటీ ప్రాంతాల వారీగా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు అవసరమని సూచించింది. కానీ తరువాతి కాలంలో విధానాలు ఈ ఆదర్శాల నుండి దూరమయ్యాయి.
ఐదవ పంచవర్ష ప్రణాళిక తరువాత ట్రైబల్ సబ్ ప్లాన్, ఐటీడీఏల వంటివి మొదలయ్యాయి. ఇవి కొంత సంక్షేమాన్ని అందించినప్పటికీ, గిరిజన ప్రాంతాలను మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపద, అడవులు, నీటి వనరులు పెద్ద ప్రాజెక్టులు, గనులు, పరి శ్రమల కోసం ఉపయోగించారు. అభివృద్ధి పేరుతో అనేక మంది గిరిజనులు తమ భూములు, జీవనాధారాలను కోల్పోయారు. 1947 నుండి 2010 వరకు భారత్‌లో 6 నుండి 6.5 కోట్ల మంది గిరిజనులు అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల ప్రభావితమయ్యారని అధ్యయనాలు చెబుతున్నాయి.
జనాభాలో కేవలం 8.6% మాత్రమే గిరిజనులు ఉన్నప్పటికీ, స్థానచలనం చెందిన వారిలో దాదాపు 40% వారే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రక్షణ చట్టాలు ఉన్నప్పటికీ, అనేక షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 50% కంటే ఎక్కువ భూములు గిరిజ నేతరుల చేతుల్లో ఉన్నాయి. ఇది రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధం. ఐదో షెడ్యూల్, ఆర్టికల్ 46, పెసా చట్టం (1996) గిరిజన హక్కులు, గ్రామసభల స్వపరి పాలనకు బలమైన రక్షణ ఇస్తున్నాయి. కానీ గ్రామసభలు చాలా చోట్ల కేవలం పేరుకే ఉన్నాయి. భూములు కోల్పోవడం కొనసాగుతూనే ఉన్నది. అభివృద్ధి అంటే కేవలం జీడీపీ పెరగడం మాత్రమే కాదు. అది అసమానతలను తగ్గించాలి;సంస్కృతిని కాపాడాలి; ప్రజలను శక్తిమంతం చేయాలి.
భాగస్వాములను చేసినప్పుడే...
గిరిజన సమాజాలు ప్రకృతితో కలిసి జీవించే విధానాన్ని అనుసరిస్తాయి. భూమి, అడవులు వారికి కేవలం ఆర్థిక వనరులు మాత్రమే కాదు; అవి వారి సంస్కృతి, జీవన విధానాలకు గుర్తింపు. అందుకే భూములు కోల్పోవడం అంటే కేవలం ఆర్థిక నష్టమే కాదు, సాంస్కృతిక నష్టం కూడా. పెసా చట్టం గ్రామస్థాయి స్వపరి పాలనకు ముఖ్యమైన అడుగు. కానీ దాని అమలు అత్యంత బల హీనంగా ఉన్నది. అధికార యంత్రాంగమే ఇంకా కేంద్రీకృతంగా పనిచేస్తున్నది. నిజమైన స్వపరిపాలన కోసం ప్రభుత్వం గిరిజన సమాజాలపై నమ్మకం ఉంచాలి; అధికారాలను పంచుకోవాలి.
భారతదేశ గిరిజన అభివృద్ధి ప్రయాణంలో పురోగతి ఉన్న ప్పటికీ, లోపాలు కూడా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. సంక్షేమ పథ కాలు మాత్రమే సరిపోవు; గిరిజనులకు స్వయం నిర్ణయాధికారం ఉండాలి; భూమి, అడవులపై నిజమైన హక్కులు ఇవ్వాలి; గ్రామ సభలను బలపరచాలి; అభివృద్ధి ప్రక్రియలో బాధ్యతాయుత వ్యవస్థలు ఉండాలి. గిరిజన ప్రాంతాలను కేవలం సహజ వనరుల నిల్వలుగా కాకుండా, ప్రత్యేక సంస్కృతి, జీవన విధానం కలిగిన ప్రాంతాలుగా గౌరవించాలి. రాజ్యాంగ హామీలు నిజం కావాలంటే కేవలం చట్టాలు సరిపోవు. అభివృద్ధి విధానాలే రాజ్యాంగ విలువ లకు అనుగుణంగా మారాలి. అప్పుడే గిరిజన సమాజాలు నిజమైన భాగస్వాములుగా భారత ప్రజాస్వామ్యంలో స్థానం పొందుతాయి.
పి. వేణుగోపాల్ రెడ్డి
వ్యాసకర్త ‘ఏకలవ్య ఫౌండేషన్’ వ్యవస్థాపకులు


