సవాళ్లు ఉన్నా సందర్భోచితమే! | Sakshi Guest Column On Iran, America war Issue and Indian policymakers | Sakshi
Sakshi News home page

సవాళ్లు ఉన్నా సందర్భోచితమే!

Jun 27 2026 1:09 AM | Updated on Jun 27 2026 1:09 AM

Sakshi Guest Column On Iran, America war Issue and Indian policymakers

విశ్లేషణ

ఇండియా – మిడిల్‌ ఈస్ట్‌ – యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (ఐ.ఎం.ఇ.సి.– ఐమెక్‌) పథకం ఇరాన్‌–అమెరికా యుద్ధం నేపథ్యంలో చర్చనీయాంశమైంది. భారత విధాన రూపకర్తలకు ఐమెక్‌ను ముందుకు తీసుకు వెళ్లటం పెద్ద సవాలుగా మారింది. ఇరాన్‌ యుద్ధం ఒక వైపు ఐమెక్‌ పథకం బలహీనతలను బహిర్గతం చేస్తూనే దాని అవసరాన్నీ నొక్కి చెప్పింది. 2023 ఢిల్లీ జీ–20 సదస్సులో భారత్‌ ప్రతిపాదించిన ఐమెక్‌ ప్రతిపాదనకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, సౌదీ, యూఎస్‌ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూరోపియన్‌ యూనియన్లు అంగీకరించాయి. భారత్‌ను మధ్యప్రాచ్యం – ఇజ్రాయెల్‌ గుండా యూరప్‌తో అనుసంధానానికి ఉద్దేశించిన ఈ 4,800 కి.మీ. రవాణా కారిడార్‌ ఆసియా, పర్షియన్‌ గల్ఫ్, ఐరోపాల ఆర్థిక వ్యవస్థలను సమీకృతం చేస్తుంది. ఆసియా ఖండపు వినిమయ మార్కెట్లను, గల్ఫ్‌ చమురు– గ్యాస్‌ ఉత్పత్తి క్షేత్రాలను ఐరోపా పారిశ్రామిక ప్రాంతాలలో సముద్ర, భూతల మార్గాల ద్వారా అనుసంధానించే విశిష్టమైన పథకం ఐమెక్‌. ఈ మూడు ప్రాంతాల అనుసంధానంలో ప్రస్తుతం మూడు చిక్కుముడి ప్రాంతాలు (చోక్‌ పాయింట్లు) ఉన్నాయి. అవి హార్మూజ్, బాబెల్‌ మాండెబ్, సూయజ్‌ జలసంధులు. ఈ మూడు జలసంధులను పక్కన పెట్టే సురక్షితమైన రవాణా మార్గమే ఐమెక్‌.

విస్తృత వాణిజ్యానికి కీలకం
ఐమెక్‌ రవాణా కారిడార్‌లో తూర్పుభాగం భారత పశ్చిమ తీరాన్ని పర్షియన్‌ సింధుశాఖలో కలిపే సముద్ర మార్గం. భారత్‌లోని ముంబై–ముంద్ర–కాండ్లా రేవు పట్టణాలను యూఏఈకి చెందిన జెబెల్‌ అలీ, ఫుజేరా, సౌదీకి చెందిన డమ్మామ్, జెడ్డాలతో కలుపు తుంది. ఐమెక్‌ ఉత్తర కారిడార్‌ పర్షియా సింధుశాఖను ఐరోపాతో రైలు మార్గాల ద్వారా కలుపుతుంది. యూఏఈ, సౌదీ, జోర్డాన్‌లను రైలు మార్గాల ద్వారా ఇజ్రాయెల్‌లోని హైఫా రేవు పట్టణానికి కలుపుతారు. హైఫా నుండి ఎర్ర సముద్రం గుండా గ్రీస్‌లోని పిరేస్, ఫ్రాన్స్‌లోని మార్సెల్లి, ఇటలీలోని మెస్సీనాలకు కలుపుతూ ఐరోపాకు సరకుల రవాణా జరుగుతుంది. ఐమెక్‌లో భాగంగా హరిత ఇంధనాలైన హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ ఉత్పత్తి, విద్యుత్‌ గ్రిడ్‌ల అనుసంధానం కూడా జరుగుతుంది. సముద్ర, భూతల మార్గాల ద్వారా అత్యాధునిక ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్ల నిర్మాణం, విస్తృత డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిర్మాణాల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఐమెక్‌ పూర్తి స్థాయిలో అమలు జరిగితే భారత్‌– ఐరోపాల మధ్య రవాణా కాలం 40 శాతం, రవాణా వ్యయం 30 శాతం తగ్గిపోతాయి. రవాణా అనిశ్చితి కూడా తొలగిపోతుంది. భారత్‌–ఐరోపా యూనియన్ల మధ్య 2026 జనవరిలో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వలన 40–65 శాతం వాణిజ్యం పెరుగు తుందని అంచనా. భారత్‌–యూఏఈ, సౌదీ, ఖతర్, ఒమన్‌ల మధ్య వాణిజ్యానికీ కూడా ఐమెక్‌ కీలకం.

వ్యూహాత్మకంగానూ ముఖ్యమే!
ఆసియా–పర్షియన్‌ సింధుశాఖ ప్రాంతంలో చైనాను నిలువరించటానికి ఐమెక్‌ ఉపయోగపడుతుంది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ (బీఆర్‌ఐ) ద్వారా ఆసియా–గల్ఫ్‌ ప్రాంతంలో చైనా బలపడుతున్నది. ఒక రకంగా ఐమెక్‌ను బీఆర్‌ఐకు పోటీగా చెప్పు కోవచ్చు. వ్యూహాత్మక అంశాల దృష్ట్యా యూఎస్‌ఏ ఐమెక్‌కు మద్దతు పలికింది. ఇజ్రాయెల్‌ను ఇతర గల్ఫ్‌ దేశాలతో సంఘటితం చేయా లనేది అమెరికా లక్ష్యం. అబ్రహాం ఒప్పందం ద్వారా యూఏఈ, ఖతర్, ఒమన్‌లను ఇజ్రాయెల్‌కు కొంతవరకు దగ్గరకు తేగలిగింది. ప్రస్తుతం భూతల మార్గం ద్వారా భారత్‌ నుండి ఐరోపా వెళ్లాలంటే పాకిస్తాన్‌–అఫ్గానిస్తాన్‌ల గుండా ప్రయాణించాలి. ఒక రకంగా భారత్‌–ఐరోపా భూతల రవాణాపై పాకిస్తాన్‌కు వీటో ఉన్నది. ఐమెక్‌ ద్వారా పాక్‌ వీటోను తొలగించినట్లవుతుంది. చైనా–పాక్‌–ఎకనమిక్‌ కారిడార్‌ (సిపెక్‌)లో భాగంగా పాకిస్తాన్‌లో పెద్ద మొత్తంలో రోడ్డు, రైలు మార్గాలను, రేవు పట్టణాలను చైనా అభివృద్ధి చేస్తున్నది. పాకిస్తాన్‌ గుండా అరేబియా సముద్రంలోనికి చైనా ప్రవేశిస్తున్నది. చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవటానికి ఐమెక్‌ తోడ్పడుతుంది. సూయజ్, బాబెల్‌ మాండెబ్‌లను పక్కకు పెట్టడం వలన భారత్‌–ఐరోపా వాణిజ్యంలో అస్థిరత, అనిశ్చితి తొలగి పోతాయి. పాకిస్తాన్‌కు వంత పాడుతున్న టర్కీకి కూడా ఐమెక్‌ ద్వారా చెక్‌ పెట్టినట్లవుతుంది. ఐమెక్‌ ద్వారా ఐరోపాకు శక్తి భద్రత ఏర్పడటంతో పాటు భారత్‌తో వాణిజ్యం విస్తృతమవుతుంది. గల్ఫ్‌ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను వైవిధ్యీకరించటానికి ఐమెక్‌ ఉపయో గపడుతుంది. ఐమెక్‌కు కేంద్రకంగా ఉన్న ఇజ్రాయెల్‌కు ప్రాంతీయ స్థిరత్వం, భద్రత ఏర్పడతాయి.

ప్రతికూలతలు బహిర్గతం
సంక్షుభిత ప్రాంతాలైన సూయజ్, బాబెల్‌ మాండెబ్‌లకు దూరంగా ప్రతిపాదించబడిన ‘ఐమెక్‌ ప్రశాంత కారిడార్‌’యుద్ధంలో చిక్కుకున్నది. ఫుజెరా, జెబెల్‌ అలీ రేవు పట్టణాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు చేసింది. ఖతర్‌ గ్యాస్‌ క్షేత్రాలు కూడా దాడులకు గురయ్యాయి. ఐమెక్‌ పథకాన్ని విజయవంతంగా అమలు చేయటం మూడు కీలక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అవి 1. సౌదీ–ఇజ్రాయెల్‌ సంబంధాల సాధారణీకరణ. 2. జెబెల్‌ అలీ, ఫుజెరా (ఎమిరేట్స్‌) రేవు పట్టణాల భద్రత. 3. పెట్టుబడులు. ఇరాన్‌ యుద్ధం ఈ మూడు అంశాల ప్రతికూలతలను బహిర్గతం చేసింది. అబ్రహాం ఒప్పందాలపై సంతకం చేయటానికి మొదటినుండీ సౌదీ రాజు విముఖత చూపుతున్నాడు. హార్మూజ్‌ జలసంధి దిగ్బంధనం వలన నౌకల బీమా ఛార్జీలు అమాంతం పెరిగాయి. ఈ ప్రాంతంలో పెట్టుబడులకు భారీ మదుపరులు ముందుకు రావటం కష్టం. అయితే, హార్మూజ్‌ దిగ్బంధనం, అంతకు ముందు బాబెల్‌ మాండెబ్‌ను హౌతీలు మూసివేస్తామని బెదిరించడం ఒక రకంగా ఈ ఇరుకైన సముద్ర మార్గాలకు ప్రత్యామ్నా యంగా రవాణా వ్యవస్థల అభివృద్ధి ఆవశ్యకతను గుర్తు చేసింది. 2023లో ఐమెక్‌ ఒప్పందం సమయంలో కంటే 2026లో దాని ఆవశ్యకత మరింత పెరిగిందనే చెప్పాలి. హార్మూజ్‌ ద్వారా రవాణాకు భవిష్యత్తులో కూడా అమెరికాతో సహా ఎవరూ భరోసా ఇవ్వలేరు. గల్ఫ్‌ ప్రాంత భూతల మార్గాల ద్వారా ఆసియాను ఐరోపాతో అనుసంధానించటమే శ్రేష్ఠమైన ప్రత్యామ్నాయం. 

శాంతియుత జియో పొలిటికల్‌ వాతావరణంలో ప్రతిపాదించ బడిన ఐమెక్‌ పథకాన్ని అశాంతి, ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణపు అనిశ్చిత వాస్తవాల నేపథ్యంలో సవరించాల్సిన అవసరం గోచరి స్తున్నది. ముఖ్యంగా హార్మూజ్‌ జలసంధికి సమీపంలోని ఎమిరే ట్స్‌కు చెందిన ఫుజేరాకు బదులుగా ఒమన్‌కు చెందిన సలాలా, దుఖమ్, సోహర్‌ రేవు పట్టణాలను భారత్‌ పశ్చిమ తీరంతో అనుసంధానించాలి. ఈ పథకాన్ని రవాణా, ఎనర్జీ, డిజిటల్‌ కారిడార్లుగా విభజించి వేటికవే అమలు పరచటం వాంఛనీయం. ఇబ్బందులు, అడ్డంకులతో కూడిన రవాణా కారిడార్‌ నిర్మాణాన్ని రెండవ దశలో చేపట్టవచ్చు. మొదటి దశలో ఎనర్జీ, డిజిటల్‌ కారిడార్లను అమలు పరిచి సైద్ధాంతికంగా పథకం అమలు సాధ్యాన్ని నిరూపించవచ్చు. ఇంతవరకు వివిధ దేశాలు ప్రత్యేక ఒప్పందాల ద్వారా పథకాన్ని అమలు పరుస్తున్నాయి. కానీ ఒక కేంద్రీయ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేసి సభ్య దేశాల మధ్య సమన్వయం సాధించాలి. ఇజ్రా యెల్‌తో ముడిపడిన క్లిష్టమైన అంశాలను పక్కకుపెట్టి భారత్‌–గల్ఫ్‌ అనుసంధానంపై దృష్టి పెట్టాలి. భారత్‌ వ్యూహాత్మక, ఆర్థిక, శక్తి భద్రతలకు ఐమెక్‌ పథకం అమలు అత్యంత ఆవశ్యకం.

గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌);
సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement