ప్రశ్నించడమూ విద్యలో భాగమే! | Sakshi Guest Column On India Education Policy | Sakshi
Sakshi News home page

ప్రశ్నించడమూ విద్యలో భాగమే!

Jul 3 2026 12:19 AM | Updated on Jul 3 2026 12:19 AM

Sakshi Guest Column On India Education Policy

అభిప్రాయం

నూతన జాతీయ విద్యా విధానం– 2020 దేశవ్యాప్తంగా అమలులోకి వస్తున్న  సందర్భంలో భారతీయ విద్యా వ్యవస్థపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. విద్య  కేవలం ఉపాధి సాధనమా? లేక సమాజాన్ని రూపుదిద్దే పరివర్తనాత్మక శక్తా? ఒక దేశం తన భావితరాలను ఎలా తీర్చిదిద్దా లనుకుంటుందో ఆ దేశ విద్యా విధానాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. అందుకే విద్యా విధానాలు ప్రభుత్వాల పరిపాలనా నిర్ణయాలు మాత్రమే కావు; అవి ఒక సమాజం తన భవిష్యత్తును గురించి చేసుకునే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ఎంపికలు కూడా. సమాజ శాస్త్రవేత్త ఎమిల్‌ డర్కైమ్‌ దృష్టిలో విద్య అనేది సమాజం తన విలువలను కొత్త తరాలకు సంక్రమింపజేసే ప్రక్రియ. కార్ల్‌ మార్క్స్‌ దృష్టిలో విద్య పాలక వర్గాల భావజాలాన్ని బలపరిచే సాధనంగా కూడా మారవచ్చు.

జ్ఞాన బదిలీ రూపాలు
వేట, ఆహార సేకరణ జీవన విధానం నుండి వ్యవసాయ ఆధారిత స్థిర జీవన విధానానికి మారిన తర్వాత జ్ఞాన బదిలీకి వ్యవస్థీకృత రూపాలు అవసరమయ్యాయి. వైదిక సంస్కృతి ప్రభావంతో గురుకుల వ్యవస్థ అభివృద్ధి చెందింది. భారతీయ విద్యా చరిత్రలో ఇది ముఖ్యమైన దశ. ఈ వ్యవస్థ ద్వారా తత్వ విచారణలు, భాషా సంపద అభివృద్ధి చెందినప్పటికీ, దాని సామాజిక పరిమితులను విస్మరించలేం. జ్ఞానాన్ని సామాజిక ఆధిపత్యాన్ని నిలబెట్టే సాధనంగా ఉపయోగించిన చారిత్రక ఉదాహరణగా దీనిని చూడవచ్చు. క్రీ.పూ. ఆరో శతాబ్దంలో బౌద్ధ, జైన మతాలు ఆవిర్భవించడం భారతీయ విద్యా చరిత్రలో ఒక ప్రజాస్వామ్య మలుపు. గౌతమ బుద్ధుడు పుట్టుక ఆధారంగా వ్యక్తి విలువను నిర్ణయించే భావనను తిరస్కరించాడు. బౌద్ధ సంఘాలు విద్యా కేంద్రాలుగా పనిచేశాయి. నలంద, తక్షశిల, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాలు అంతర్జా తీయ ఖ్యాతిని సంపాదించాయి.

సాధారణంగా క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు విస్తరించిన మధ్యయుగ కాలాన్ని కొందరు చీకటి యుగంగా చిత్రీకరించడానికి ప్రయత్నించినప్పటికీ, చారిత్రక వాస్త వాలు అంత సరళంగా ఉండవు. ఢిల్లీ సుల్తానులు, మొఘల్‌ చక్రవర్తులు ఉత్తర భారతదేశంలో అధికారాన్ని స్థాపించగా, దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం, ఇతర ప్రాంతీయ రాజ్యాలు తమ ప్రభావాన్ని కొనసాగించాయి. విద్య ప్రధానంగా మత సంస్థల ఆధ్వర్యంలో కొనసాగినప్పటికీ, జ్ఞానవ్యాప్తికి కొత్త మార్గాలు కూడా తెరుచుకున్నాయి. మధ్యయుగ భారతదేశంలో విద్య ప్రజలకు చేరువ కావడంలో భక్తి ఉద్యమం కీలక పాత్ర పోషించింది. ప్రజాభాషలలో సాహిత్య సృష్టి వల్ల జ్ఞానం సంస్కృతం, పర్షియన్‌ భాషల పరిమితులను దాటి సామాన్య ప్రజలకు చేరువైంది.

విద్య ప్రభుత్వ బాధ్యత
బ్రిటిష్‌ పాలనకు ముందు దేశంలో స్థానిక విద్యా సంస్థలు విస్తృతంగా పనిచేశాయని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో వీధిబడులు, పాఠశాలలు, గురుకులాలు, మక్తబ్‌లు ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యను అందించేవి. ధర్మపాల్‌ తన ప్రసిద్ధ గ్రంథం ‘ద బ్యూటిఫుల్‌ ట్రీ’లో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో వేలాది స్థానిక పాఠశాలలు పనిచేస్తున్నట్లు బ్రిటిష్‌ అధికారుల నివేదికలను ఆధారంగా చూపించాడు.  అయితే ఈ విద్యా వ్యవస్థలు అన్ని వర్గాలకు సమానంగా అందుబాటులో ఉన్నాయని చెప్పలేం. స్త్రీల విద్య అత్యంత పరిమిత స్థాయిలోనే ఉండేది.

1600లో స్థాపించబడిన ఈస్టిండియా కంపెనీ ప్రారంభంలో పూర్తిగా వ్యాపార ప్రయోజనాలకే పరిమితమైంది. ప్లాసీ, బక్సర్‌ యుద్ధాల అనంతరం రాజకీయ అధికారాన్ని విస్తరించుకున్న కంపె నీకి పరిపాలన కోసం స్థానిక సిబ్బంది అవసరమైంది. 1813 చార్టర్‌ చట్టం ద్వారా మొదటిసారిగా భారతీయుల విద్యాభివృద్ధికి నిధులు కేటాయించబడ్డాయి. భారతీయుల విద్య పట్ల ప్రభుత్వ బాధ్యతను గుర్తించిన తొలి అధికారిక చర్యగా దీనిని చూడవచ్చు. అయితే థామస్‌ బాబింగ్టన్‌ మెకాలే 1835లో సమర్పించిన తన నివేదికలో... రక్తంలో భారతీయులైనా, అభిరుచుల్లో ఆంగ్లేయులుగా ఉండే ఒక మధ్యవర్తి వర్గాన్ని తయారు చేయాలనే వ్యాఖ్య బ్రిటిష్‌ విద్యా విధాన స్వరూపాన్ని ప్రతిబింబించింది.

1854లో వెలువడిన వుడ్స్‌ డిస్పాచ్‌ను భారతీయ విద్యకు ‘మాగ్నా కార్టా’గా అభివర్ణిస్తారు. విద్యా పరిపాలనకు వ్యవస్థీకృత రూపాన్ని ఇవ్వడంలో ఈ నివేదిక కీలక పాత్ర పోషించింది. ప్రతి ప్రావిన్స్‌లో విద్యాశాఖల ఏర్పాటు, ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి. ప్రాథమిక స్థాయిలో స్థానిక భాషలను, ఉన్నత విద్యలో ఆంగ్ల భాషను ఉపయో గించాలని సూచించడం ద్వారా భారతీయ విద్యా నిర్మాణానికి ద్వంద్వ స్వరూపాన్ని కల్పించింది. ఈ సిఫారసుల ఆధారంగా 1857లో కలకత్తా, బొంబాయి, మద్రాస్‌ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఈ దశలో రాజా రామమోహన్‌ రాయ్‌ సామాజిక సంస్కరణలకు విద్యే మార్గమని విశ్వసించాడు. జ్యోతిరావు ఫూలే దంపతులు అణగారిన వర్గాల కోసం పాఠశాలల్ని స్థాపించడం ద్వారా విద్యను సామాజిక న్యాయ ఉద్యమంగా మలిచారు. 

విద్య ప్రాథమిక హక్కు
జాతీయోద్యమం నేపథ్యంలో బ్రిటిష్‌ విద్యా విధానానికి ప్రత్యా మ్నాయంగా జాతీయ విద్యా ఉద్యమం రూపుదిద్దుకుంది. 1906లో బెంగాల్‌ నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ స్థాపించబడింది. ఈ కాలంలో గోపాలకృష్ణ గోఖలే ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్య కోసం చేసిన కృషి గుర్తించదగినది. 1911లో ఇంపీరియల్‌ లెజి స్లేటివ్‌ కౌన్సిల్‌లో ఆయన ప్రవేశపెట్టిన బిల్లు తిరస్కరించబడినప్ప టికీ, విద్య ప్రతి బాలబాలిక హక్కు కావాలనే భావనను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకువచ్చింది.

ఇరవయ్యవ శతాబ్దంలో రవీంద్రనాథ్‌ టాగూర్, మహాత్మాగాంధీ, బి.ఆర్‌. అంబేడ్కర్‌ వంటి మహనీయుల విద్యా తత్వాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పరీక్షల ఒత్తిడితో, యాంత్రిక కంఠస్థంతో, సృజనాత్మకతను అణచివేసే విధానంతో నిజమైన విద్య సాధ్యం కాదని టాగూర్‌ భావించాడు. చేతి పని, మేధో వికాసం మధ్య సమన్వయం సాధించాలని గాంధీజీ భావించాడు. 1937లో ఆయన ప్రతిపాదించిన ‘నయీ తాలీం’ లేదా ‘బేసిక్‌ ఎడ్యుకేషన్‌’ ఈ భావజాలానికి ప్రతిరూపం. అంబేడ్కర్‌ విద్యకు మరింత విప్లవాత్మక అర్థాన్నిచ్చాడు. ‘అభ్యసించండి, సంఘటితమవండి, పోరాడండి’ అనే ఆయన పిలుపు కేవలం నినాదం కాదు; సామాజిక న్యాయ ఉద్యమానికి మార్గదర్శక సూత్రం. 

నేడు విద్యపై జరుగుతున్న చర్చలన్నింటికీ ఈ చరిత్ర ఒక అద్దంలా నిలుస్తుంది. విద్యను కేవలం మార్కులు, ర్యాంకులు, ఉద్యో గాలకే పరిమితం చేసే ధోరణి సమాజాన్ని సంకుచిత దిశగా నడిపి స్తుంది. ఒక దేశానికి శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వైద్యులు ఎంత అవస రమో, ప్రశ్నించే పౌరులు, రాజ్యాంగ విలువలను గౌరవించే వ్యక్తులూ అంతే అవసరం. అలాంటి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత విద్యా వ్యవస్థపై ఉంటుంది.

ప్రొ‘‘ కొండ నాగేశ్వర్‌
వ్యాసకర్త డైరెక్టర్, సివిల్‌ సర్వీసెస్‌ అకాడమీ,
ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement