విశ్లేషణ
వేగంగా మారుతున్న అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు, ట్రంప్ దూకుడు, పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లలో ప్రతికూల వాతావరణం; చైనా, యూఎస్‌లతో బలపడుతున్న పాక్ మైత్రీబంధం... భారత దౌత్యనీతికి పెద్ద సవాలుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో జాతీయ, ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను రక్షించుకుంటూ అంతర్జాతీయ శక్తిగా ఎదగటం భారత్‌కు అగ్నిపరీక్షే. గత దశాబ్ద కాలాన్ని పరిశీలిస్తే, భారత దౌత్యనీతిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అమెరికా, రష్యా ప్రాపకం కోసం అర్రులు చాచే దశ నుండి బయటకు వచ్చింది. జాతి ప్రయోజనాల దృష్ట్యా ‘వ్యూహాత్మక స్వతంత్రత’ వైపు అడుగులు వేసింది. అలీన విధానం, పంచశీల సూత్రాలు, మానవ హక్కులు వంటి విలువల బంధనాలను తెంచుకొని లావాదేవీలకు సంబంధించిన దౌత్యనీతిని అమలుపరుస్తున్నది. ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో భాగంగా భారత్... ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో ఆర్థిక, వాణిజ్య, సైనిక సంబంధాలను బలోపేతం చేసుకోవటంపై దృష్టిని కేంద్రీకరించింది. యు.ఎస్., ఐరోపా దేశాల ద్వంద్వ వైఖరిని బాహాటంగా ఎత్తి చూపింది.
కుండబద్దలు కొడుతూ...
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుండి భారత్ చౌకగా చమురును కొనుగోలు చేయటాన్ని ఐరోపా దేశాలు విమర్శించి నప్పుడు, భారత్ విదేశాంగ మంత్రి ‘‘ఐరోపా దేశాలు తమ సమ స్యల్ని ప్రపంచ సమస్యలు అనుకుంటాయి. కానీ అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల సమస్యలను ఐరోపా ఏనాడైనా పట్టించుకుందా?’’ అని నిలదీయటం భారత్ వైఖరిని సూచిస్తున్నది. రష్యా నుండి చమురు దిగుమతుల విష యంలో యూఎస్ ఆంక్షల గురించి భారత విదేశాంగ మంత్రి, ‘‘మనమెవరమూ ఈ పెద్దవాళ్ల ఆటను అర్థం చేసుకోలేనంత పిల్లలం కాము’’ అని యూఎస్ నిజస్వరూపాన్ని విమర్శించటం భారత దౌత్య ధృడత్వానికి సంకేతం. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనలో ఉన్నప్పుడూ ఆయన సమ క్షంలోనే ‘‘అమెరికాకు అమెరికన్ ప్రయోజనాల మాదిరిగా భారత్‌కు భారత ప్రయోజనాలు ముఖ్య’’మని కుండబద్ధలు కొట్టారు.
భద్రతాపరంగా అత్యంత ప్రమాదకరమైన పాకిస్తాన్, చైనా లతో సంబంధాల విషయంలో సైతం భారత్ కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలకు మిన్నకుండే బుజ్జగింపు విధానం నుండి పూర్తిగా వైదొలగి ‘కన్నుకు కన్ను, కాలుకు కాలు’ సిద్ధాంతాన్ని అమలు పరుస్తున్నది. గల్వాన్ ఘర్షణల అనంతరం భారత్ పెద్ద మొత్తంలో లద్దాఖ్‌లో సైన్యాన్ని మోహరించి చైనాతో ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నట్లు సవాలు విసిరింది. సరిహద్దుల్లో కాలుదువ్వుతూ వాణిజ్యపరంగా స్నేహ సంబంధాలు కుదరదని చైనా పెట్టుబడులపై తీవ్ర ఆంక్షలు విధించింది. మాల్దీ వుల ప్రభుత్వపు భారత వ్యతిరేక ధోరణి నేపథ్యంలో భారత పర్యా టకులను లక్ష దీవులవైపు మళ్లిస్తూ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది.
విమర్శలకు వెరవని దృఢత్వం
అయితే భారత విదేశాంగ విధానం కొన్ని ప్రత్యేక సందర్భా లలో లొంగుబాటు ధోరణిని కనబరచిందన్న విమర్శ ఉంది. ముఖ్యంగా ట్రంప్ తెంపరితనం విషయంలో భారత్ మెతక వైఖరి అనుసరించిందని విశ్లేషకుల అభిప్రాయం. ట్రంప్ భారత్ ఆర్థిక వ్యవస్థను ఒక మృత ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించినా భారత్ స్పందించలేదనీ, ట్రంప్ ఆదేశాల మేరకు ఒక దశలో రష్యా నుండి చమురు కొనుగోళ్లు కూడా ఆపేసిందనీ మరొక విమర్శ. ఇజ్రాయెల్ ‘గాజా’పై బాంబుల వర్షం కురిపించి నేలమట్టం చేస్తున్నా భారత్ ఇజ్రాయె ల్‌ను సమర్థించి పాలస్తీనాకు వ్యతిరేకంగా వ్యవహరించిందనీ, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ విధానం పూర్తిగా రష్యాను సమర్థిస్తు న్నట్లుగా ఉందనీ కూడా రాజకీయ పరిశీలకుల వ్యాఖ్యానం. ఇదే దృష్టికోణంతో, భారత్ పొరుగుదేశాలు భారత్‌కు ప్రతికూలంగా మారిపోయాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకల విష యంలో మన దౌత్య నీతి విఫలమైందా అనే సందేహాలు తలెత్తాయి!
ట్రంప్ రెండవసారి అధ్యక్ష పదవిని చేపట్టడంతో భారత్– అమెరికా సంబంధాలు మరింత పటిష్టమవుతాయని అందరూ ఆశించారు. కానీ ఆపరేషన్ సిందూర్ తరువాత ట్రంప్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. అయినప్పటికీ అమెరికా వాణిజ్య సుంకాల యుద్ధంలో భారత్ దృఢంగా నిలబడింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో కూడా అమెరికా ఒత్తిడులను తట్టుకొని నిల బడింది. అదే సమయంలో భారత్–పాకిస్తాన్‌ల విషయంలో యూఎస్ మధ్యవర్తిత్వాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది కూడా!
హమాస్, హెజ్బొల్లా, హౌతీ వంటి ఉగ్రవాద సంస్థల ఉగ్ర చర్యలను భారత్ ఏ రకంగానూ సమర్థించలేదు. ఇరాన్ యుద్ధంలో ఇంకొక ముఖ్యమైన అంశం గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు. గల్ఫ్ దేశాలలో కోటి మందికి పైగా భారతీయులు ఉపాధి పొందు తున్నారు. యూఏఈ వంటి గల్ఫ్ దేశాలతో భారత్‌కు పటిష్టమైన వాణిజ్య సంబంధాలున్నాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచు కొని భారత్ కేవలం హార్మూజ్ జలసంధి నుండి భారత్‌కు చమురు, గ్యాస్ రవాణాకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చింది. అదే సమయంలో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఏ చర్యనూ తీసుకోలేదు. ఈ సందర్భంగా ఇరాన్ భారత్‌కు పూర్తిగా సహకరించటాన్ని గమనించాలి. ఉక్రెయిన్ యుద్ధంలో మనం కేవలం మన పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావటానికే ప్రాధాన్యతనిచ్చాం. ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుండి చౌక ఇంధనాన్ని కొనుగోలు చేశాం.
దౌత్యనీతికి నిదర్శనం
దక్షిణాసియాలో పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు కాస్త యినా క్షీణించాయన్నది వాస్తవం. సంబంధాలు బలహీనపడి నప్పుడు ఆయా దేశాలను నియంత్రించటానికి దౌత్యనీతిలో భాగంగా కీలకమైన వ్యవస్థలను ఏర్పాటు చేశామా లేదా అన్నదే ప్రశ్న. బంగ్లాదేశ్ విషయానికి వస్తే అక్కడ రాడికల్ ఇస్లామిక్ శక్తులు బలపడకుండా ఆపలేం. కానీ మత ఛాందస శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న షేక్ హసీనా ప్రభుత్వాన్ని బలపరిచాం. ఛాందస శక్తు లది పైచేయి అయినప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని నియంత్రించ టానికి మన దగ్గర తురుపు ముక్కలున్నాయా? ఈ కోణంలో చూస్తే ఆర్థిక వ్యవస్థకు కీలకమైన విద్యుచ్ఛక్తి విషయంలో భారత్‌పై బంగ్లా దేశ్ ఆధారపడాల్సిందే. భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ స్వతంత్రించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదు. ఈ విద్యుచ్ఛక్తి సంబం ధాన్ని గత దశాబ్దంలో ఏర్పరచటం మన దౌత్యనీతి విజయం.
అమెరికా సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో యూరోపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ వంటి దేశాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫ్రాన్స్, ఇజ్రా యెల్, రష్యా, దక్షిణ కొరియాలతో సైనిక, వ్యూహాత్మక ఒప్పందా లను చేసుకుంది. ఆర్థికంగా, సైనికపరంగా ప్రత్యామ్నాయాలున్నా యని యూఎస్‌కు భారత్ స్పష్టం చేస్తున్నది. దౌత్యనీతి అంటే ఇదే. ఓపిక, వివేకం, సహనాలతో మాత్రమే దౌత్యం నడుస్తుంది.
గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);
సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు


