నవ భారతంలో నరేంద్ర శకం | Narendra modi Era in New India | Sakshi
Sakshi News home page

నవ భారతంలో నరేంద్ర శకం

Jun 10 2026 2:47 AM | Updated on Jun 10 2026 2:47 AM

Narendra modi Era in New India

నరేంద్ర మోదీ అనుకోకుండా రాబర్ట్‌ ఫ్రాస్ట్‌ సిద్ధాంతాన్ని నమ్మినట్టున్నారు: అందరూ వెళ్లే దారిని కాకుండా అతి తక్కువ మంది పయనించే మార్గాన్నిఎంచుకున్నారు. బహుశా అదే నేటి మార్పులకు దారితీసి ఉంటుంది.

జవహర్‌లాల్‌ నెహ్రూ, నరేంద్ర మోదీ ద్వారా భారత ప్రధానమంత్రిత్వం రెండు విభిన్న శకాలను ఆవిష్కరించింది. ప్రతి శకానికీ తనదైన పరిమితులు, అవకాశాలు, ఆశయాలున్నాయి. నెహ్రూ ఒక దుర్బల, సరికొత్త సార్వభౌమాధికార సముపార్జిత దేశానికి నాయకత్వం వహించారు. మోదీ వంతు వచ్చేసరికి ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కొంటూ, సువిశాల, డిజిటల్‌ నెట్‌వర్క్‌ అను సంధానిత, అత్యంత పోటీతత్వ ప్రజాస్వామ్యానికి నేతృత్వం వహించాల్సి వచ్చింది. 

దిగువ నుంచి ఎగువకు!
నెహ్రూ పాలనా విధానానికి ఎగువ నుంచి దిగువకు సంస్థల రూపకల్పన, ప్రభుత్వ నిర్దేశిత ఆర్థిక వ్యవస్థ కేంద్రస్థానంలో ఉన్నాయి. దేశ విభజన తర్వాత చెల్లాచెదురైన దేశాన్ని కూడదీసుకునే క్రమంలో ఇది సముచిత విధానమే అయినప్పటికీ, ఇది కేంద్రీకృత నియంత్రణకు దారితీసింది. తద్వారా పౌరులను దేశ ప్రగతిలో భాగ స్వాములుగా కాకుండా, లబ్ధిదారులుగా మాత్రమే పరిగణించింది.

మోదీ విధానం ఆ తర్కాన్ని ఆమూలాగ్రం మారుస్తూ– ఆత్మ గౌరవం, అవిశ్రాంత పనితీరు మేళవింపుతో పాలనను ప్రజా ఉద్య మంగా రూపుదిద్దింది. ‘సబ్‌ కా సాథ్, సబ్‌ కా వికాస్, సబ్‌ కా విశ్వాస్, సబ్‌ కా ప్రయాస్‌’ సూత్రాన్ని అనుసరించింది. ఆ మేరకు బ్యాంకు ఖాతాలు, ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డీబీటీ), గ్యాస్‌ కనెక్షన్లు,గృహ నిర్మాణం, మరుగుదొడ్లు, ‘ఎక్స్‌ప్రెస్‌వే’ల నిర్మాణం, సంక్షేమ పథకాల డిజిటలీకరణ వంటి ‘దిగువ నుంచి ఎగువకు’ పద్ధతిలో సత్ఫలితాల సాధనతోపాటు విశ్వాసాన్ని కూడా పెంచుకుంది.

ఈ రెండు శకాల నడుమ గల పరిమాణమే ఇక్కడ ప్రధాన వ్యత్యాసం. దేశ జనాభా దాదాపు 34 కోట్లుగా ఉండి, రాజకీయ పార్టీల మధ్య నామమాత్రపు పోటీ ఉన్న తరుణంలో నెహ్రూ పదవీ బాధ్యతలు చేపట్టారు. జనాభా 131 కోట్లు దాటి, వేలాది నమోదిత పార్టీల మనుగడతోపాటు సార్వత్రిక ఎన్నికల బ్యాలెట్‌ పత్రాల్లోవందలాది పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన రాజకీయ వ్యవస్థలో మోదీ ప్రధాని అయ్యారు. భారత తొలి సార్వత్రిక ఎన్నిక లలో ఓటర్ల సంఖ్య సుమారు 17 కోట్లు మాత్రమే కాగా, 2014 నాటికి 83 కోట్లు దాటి, 2024కల్లా మరింత పెరిగింది.

పునాది–విస్తరణ
నెహ్రూ నమూనా ప్రాథమిక పరిశ్రమలను, శాస్త్రవిజ్ఞాన సంస్థ లను ఆర్థికంగా పెంచిపోషించింది. అయితే, ‘హిందూ వృద్ధి రేటు’గా ప్రాచుర్యంలోకి వచ్చిన 3–4 శాతం స్థాయికే అది పరి మితమైంది. కానీ మోదీ నేతృత్వంలోని భారత దేశం కోవిడ్‌–19, ద్రవ్యోల్బణ ఉధృతి, సరఫరా వ్యవస్థల్లో ఒడిదుడుకులు, భౌగో ళిక–రాజకీయ సంఘర్షణల పీడిత దశాబ్దంలోనూ  6.5–7 శాతం సగటు వృద్ధితో ప్రపంచ ప్రగతికి చోదకశక్తిగా రూపొందింది. 2014–24 మధ్య జాతీయ రహదారులు 54,000 కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. దీంతో రవాణా వ్యవస్థ ఒక సమస్య స్థాయి నుంచి పోటీతత్వ సాధనంగా మారింది. మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్‌ మార్గాలైన యూపీఐ చెల్లింపులు, ఆధార్‌ ఆధారిత సేవా ప్రదానం వంటివి విధాన ప్రకటనకూ–పౌరులపై దాని ప్రభావానికీ మధ్య అంతరాన్ని తగ్గించాయి.

ఐఐటీలు, ఎయిమ్స్‌ వంటి సంస్థాగత మూల స్తంభాలతో నెహ్రూ ఒక బలమైన పునాది వేశారు. ఇవి దేశ విజ్ఞానార్థిక వ్యవస్థకు బీజావాపనం వేశాయి. మోదీ పాలన సామూహిక విస్తరణకు ప్రాధాన్యమిస్తూ ఐఐటీల సంఖ్యను 23కు, ఐఐఎంలను 21కి, ఎయి మ్స్‌లను 23కు పెంచింది.  ప్రతిష్ఠాపనతో విస్తరణను ముడిపెట్టే ఈ ద్వంద్వ విధానం, ఆకాంక్షలనే విధానోపకరణంగా పరిగణించే రాజ కీయ దృక్కోణానికి ప్రతీకగా నిలిచింది.

మోదీ హయాంలో మంత్రిమండలి కూర్పు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రాతినిధ్యాన్ని అసాధారణ స్థాయికి చేరుస్తూ సామాజికంగా ఆ వర్గాలను ముందుకు తెచ్చింది. మహిళా ప్రాతినిధ్యం 1950ల నాటి ఏకాంక స్థాయి నుంచి ‘నారీ శక్తి వందన్‌ అధినియమ్‌’ ద్వారా మూడింట ఒక వంతు రిజర్వేషన్‌కు శాసనబద్ధ మార్గాన్ని ఏర్పరచింది. అంటే, నామమాత్రపు సార్వజనీనత నుంచి నిర్మాణాత్మక హామీల దిశగా మార్పును ఇది సూచిస్తుంది.

నెహ్రూ అనుసరించిన అలీన విధానం సూత్రబద్ధమైనదే అయినా, రెండు ధ్రువాల ప్రపంచంలో తరచూ ఒంటరిగా ఉండి పోయింది. ఇది భౌతిక ప్రతిష్ఠకన్నా నైతిక నేతృత్వంపైనే ఎక్కువగా ఆధారపడింది. కాగా, మోదీ విధానం బహుళ అనుసంధాన లావా దేవీల స్వభావంతో కూడినది. అమెరికా, రష్యా, యూరప్, గల్ఫ్‌ సహా వర్ధమాన దేశాలతోనూ ఏకకాలంలో సంబంధాలు నెరపుతూ భారత విపణి, సాంకేతిక పరిజ్ఞాన డిమాండ్‌ సహా ప్రవాస భారతీయుల ప్రభావాన్ని కూడా ఇది బేరసారాల ఉపకరణంగా మారుస్తుంది.

తొలిసారి భారత్, పాకిస్తాన్‌ యుద్ధం నుంచి 1962లో చైనాతో యుద్ధం దాకా ‘శాంతియుతమైనది’గా గుర్తుచేసుకునే నెహ్రూ పాలన అనేక సంఘర్షణలకు సాక్షిగా నిలిచింది. మోడీ సిద్ధాంతాన్ని పరికిస్తే – అనిశ్చిత పొరుగు ప్రాంతాల్లో భారత్‌ తన పూర్తిస్థాయిసంప్రదాయ యుద్ధ నివారణ, నిరోధక శక్తిసామర్థ్యాలను వ్యూహా త్మక ప్రతిస్పందన, సునిశిత సరిహద్దు నిర్వహణలతో జోడించింది. ఇక్కడ ప్రమాదమే లేదని కాదు, దేశీయంగా ఆధునికీకరణ కొనసాగు తున్న తరుణంలో భద్రతా వాతావరణ స్థిరత్వాన్ని ఇది సూచిస్తుంది.

కాలానికి తగిన నాయకుడు
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో పీఎల్‌–480 పథకం కింద ‘ఓడ నుంచి విస్తరిలోకి’ అనే దిగుమతి పరాధీనత ఉండేది. ఇప్పు డది సమసిపోయి, దాదాపు 80 కోట్ల మంది పేదలకు ఉచిత ధాన్యం సరఫరా చేసే ‘పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన’ అమలు స్థాయికి భారత్‌ దూసుకెళ్లింది. మరోవైపు జాతీయంగా ఒక ప్రధాన వ్యవ సాయ ఉత్పత్తిదారుగానూ, అంతర్జాతీయంగా ఎగుమతిదారుగానూ ఎదుగుతోంది. 

పదవీ కాలాన్ని కొలబద్దగా పరిగణించినా, మోదీ హయాం ఓ కీలక మలుపు. ఇది ఇందిరాగాంధీ సుదీర్ఘ నిరంతరాయ పదవీ కాలాన్ని అధిగమించి, నెహ్రూ అనుసరించిన నిరంతర సేవా ప్రమా ణానికి చేరువవుతూ వచ్చింది. రాష్ట్ర, జాతీయ స్థాయి పదవులకు ఎన్నికైన ప్రభుత్వాధినేతగా దేశంలోనే అత్యంత సుదీర్ఘ సంచిత పదవీ కాలపు రికార్డును మోదీ పాలన ఇప్పటికే బద్దలు కొట్టింది. అయితే, ఈ ప్రాధాన్యం రోజుల సంఖ్యకు అతీతంగా దాని సంచిత ప్రభావంలో కనిపిస్తుంది.

వేర్వేరు కాలాల్లో విభిన్న నాయకత్వ అవసరం ఏర్పడింది. తదనుగుణంగా తొలినాళ్ల నాయకత్వం చట్రాన్ని రూపొందిస్తే, మలినాళ్ల నేతృత్వం దాని ఆధారంగా ఉపరితల నిర్మాణానికి ఉపక్రమించి రహదారులను విస్తరించి, దేశాన్ని డిజిటలీకరణతో అనుసంధానించి, ఆ ప్రగతి ప్రకాశాన్ని ప్రపంచం నలుమూలలా ప్రసరించేలా చేసింది. సార్వజనీనత, సేవా ప్రదానం, మౌలిక సదుపాయాల కల్పన, బేరసారాల సామర్థ్యం తదితర ప్రమాణాల ప్రాతిపదికన చూస్తే – మోదీ నిస్సందేహంగా అత్యంత ప్రభావశీల ప్రధానమంత్రిగా నిలుస్తారు. కోట్లాది భారతీయుల దృక్కోణంలో మోదీ ఈ దేశానికి అత్యంతావశ్యక సమర్థ నేతగా నిలిచారు. 

-వ్యాసకర్త వ్యాపారవేత్త, కాలమిస్ట్‌; ‘కౌన్సెలేజ్‌ ఇండియా’ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు–మేనేజింగ్‌ పార్ట్ట్‌నర్‌
-సుహేల్‌ సేథ్

Advertisement
 
Advertisement
Advertisement