ఇన్ బాక్స్
మనిషి చరిత్రలో ఇంత సౌకర్యవంతమైన కాలం మరొకటి లేదు. ఆకలి వేస్తే స్విగ్గీ ఉంది. మందులు కావాలంటే బ్లింకిట్ ఉంది. ప్రయాణానికి ఉబెర్ ఉంది. సందేహాలకు ఏఐ ఉంది. వినోదానికి అంతులేని రీల్స్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఒక చేతిలో ఇమిడి పోయింది. కానీ ఒక్క ప్రశ్న మాత్రం మిగిలిపోయింది – ఇంత కనెక్ట్ అయిన ప్రపంచంలో మనుషులు ఎందుకు మరింత ఒంటరిగా మారుతున్నారు?
ఒకప్పుడు దుకాణానికి వెళితే పొరుగు వారితో మాట్లాడేవాళ్లం. వీధి చివర టీ దుకాణం ఒక చిన్న సామాజిక వేదికగా ఉండేది. ప్రయా ణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడేవి. ఇప్పుడు ఆ అవసరాలన్నీ యాప్‌ల ద్వారా తీరిపోతున్నాయి. తక్కువగా నడుస్తున్నాం. తక్కువగా కలుస్తున్నాం. తక్కువగా మాట్లాడు తున్నాం. ఎక్కువగా స్క్రోల్ చేస్తున్నాం. ఇది సేవల ఆర్థిక వ్యవస్థ విజయం. కానీ సంబంధాల ఆర్థిక వ్యవస్థ వైఫల్యం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ–2025 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. 2014–19 మధ్య ఒంటరితనం కారణంగా సంవత్సరానికి 8.7 లక్షల మరణాలు సంభవించాయి. భారతీయులు సగటున రోజుకు ఐదు గంటలకు పైగా స్మార్ట్‌ఫోన్‌లో గడుపుతున్నారు. అందులో ఎక్కువ భాగం సోషల్ మీడియా, వీడియోలు, గేమింగ్‌కే. ప్రతి రీల్, ప్రతి లైక్, ప్రతి నోటిఫికేషన్... ప్రతి కొన్ని సెకన్లకు మెదడుకు ఒక చిన్న డోపమైన్ రివార్డ్. ఇది అలవాటు అవుతుంది. తర్వాత అవసరం అవుతుంది. చివరకు వ్యసనం అవుతుంది.
మాదకద్రవ్యాల సమస్య గురించి మాట్లాడినప్పుడు సాధారణంగా స్మగ్లింగ్, నేరాలు, అరెస్టుల గురించి చర్చిస్తాం. కానీ యువత డ్రగ్స్ వైపు ఎందుకు వెళ్తున్నారనే ప్రశ్నను విస్మరిస్తాం. డ్రగ్స్ సమస్యకు అసలు మూలం చాలాసార్లు డ్రగ్స్ కాదు – ఒంటరితనం, నిరాశ, అనుబంధాల కొరత. అందుకే డ్రగ్స్‌పై యుద్ధం గెలవాలంటే, ఒంటరితనంపై పోరాటం ప్రారంభించాల్సిందే. ఇందులో భాగంగా యువత కోసం 24 గంటల హెల్ప్ లైన్లు, సహచరమద్దతు వేదికలు అందుబాటులోకి రావాలి. ఒంటరితనానికి మందు మందుల దుకాణంలో దొరకదు. అది ఒక స్నేహితుడి ఫోన్ కాల్‌లో ఉంటుంది.
ఒక కుటుంబ సంభాషణలో ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడి ప్రోత్సాహంలో ఉంటుంది. మనం యంత్రాలను కలిపాం. డేటాను కలిపాం. ప్రపంచాన్ని కలిపాం. కానీ మనిషిని మనిషికి కలపడం మర్చిపోయాం. ఇప్పుడు చెయ్యాల్సింది అదే!
– వంగవోలు రవి, ఉపాధ్యాయుడు, ఒంగోలు(రేపు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం)


