గాంధీ కొండ... చూద్దామా! | Vijayawada's Gandhi Hill with historic place | Sakshi
Sakshi News home page

గాంధీ కొండ... చూద్దామా!

Jun 29 2025 8:46 AM | Updated on Jun 29 2025 8:46 AM

 Vijayawada's Gandhi Hill with historic place

∙చెన్నాప్రగడ శర్మ, విజయవాడ 
విజయవాడ పేరు చెప్పగానే గుర్తొచ్చేవి ముచ్చటగా మూడు కొండలు. ఒకటి దుర్గ కొండ, రెండోది గాంధీ కొండ, మూడోది గుణదల కొండ. మహాత్మాగాంధీ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం గాంధీ కొండ పేరిట స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్‌ పశ్చిమ ద్వారానికి కూతవేటు దూరంలో ఉంటుంది. ఒకప్పుడు పర్యాటకులతో కిటకిటలాడిన కొండ కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. మళ్లీ ఇప్పుడిప్పుడే పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది.

నాటి ఓర్‌ కొండే నేటి గాంధీ కొండ
విజయవాడ తారాపేటలో 500 అడుగుల ఎత్తున గాంధీ కొండ ఉంది. కెప్టెన్‌ చార్లెస్‌ ఓర్‌ అనే ఇంజినీరు 1852లో కృష్ణా నదిపై తొలి ఆనకట్ట నిర్మించినప్పుడు ఈ కొండపై నుంచే నిర్మాణ పనులను పర్యవేక్షించేవారు. అప్పట్లో దీన్ని ఓర్‌ కొండ అనేవారు. దీనిపై 1948లో బాపూజీ స్మారక స్థూపం ఏర్పాటు చేశారు. విజయవాడ వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఎంతో ఆసక్తిగా తిలకించేవారు. ఆ తర్వాత పలు జిల్లాలు, క్రమేణా ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకుల రాక ఊపందుకుంది. 1921లో స్వాతంత్య్ర పోరాట సమయంలో మహాత్మాగాంధీ బెజవాడ వచ్చి కొండ దిగువన నిర్వహించిన సభలో ప్రసంగించారు. 

అప్పటి నుంచి ఓర్‌ కొండ గాంధీ కొండగా పేరు పొందింది. గాంధీ స్మారక నిధి ఇక్కడ రూపొందించిన గాంధీ స్మారక చిహ్నానికి 1964 నవంబర్‌ 9న నాటి ప్రధాన మంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి  పునాదిరాయి వేశారు. దేశంలో ఒక కొండపై ఉన్న మొట్టమొదటి గాంధీ స్మారక చిహ్నమిది. 1967లో అప్పటి ఉప ప్రధాని మొరార్జీదేశాయ్‌ గాంధీ హిల్‌ సొసైటీని స్థాపించారు. దశాబ్దం తర్వాత ఈ సొసైటీని గాంధీహిల్‌ ఫౌండేషన్‌ పేరిట ట్రస్టుగా మార్చారు. గాంధీజీ శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా 1968 అక్టోబర్‌ 6న అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ 52 అడుగుల పొడవుగల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. 

చికుబుకు చికుబుకు రైలే...
కొండపై ప్రధానంగా ఆకట్టుకునేది పిల్లల టాయ్‌ రైలు. 1969లో ఇండియన్‌ రైల్వేస్‌ రైలుమార్గాన్ని వేసింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రైలును బహూకరించింది. ఇది కొండను చుట్టివస్తుంది. లోపల కూర్చొని విజయవాడ నగరాన్ని చూడవచ్చు. ఒకప్పుడు ఈ  రైలు ఎక్కేందుకు జనాలు పోటీపడేవారు. ఇప్పుడు రైల్వే ట్రాక్‌ పాడయింది. రైలు కూడా జీర్ణావస్థకు చేరడంతో ఏడాదిన్నరగా తిప్పడం లేదు. ప్రస్తుతం ఒకవైపు కొత్త ట్రాక్‌ పనులు, మరోవైపు విద్యుద్దీకరణ జరుగుతోంది.

నేల మీదికి నింగి...
అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి సౌండ్‌ అండ్‌ లైట్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. 1969లో సరిహద్దు గాంధీగా పేరొందిన ఖాన్‌  అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌  ప్రదర్శన ప్రారంభించారు. ఇందులో గాంధీజీ జీవితం, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలను ప్రదర్శిస్తారు. 1971లో ప్లానెటోరియంను ప్రారంభించారు. న్యూయార్క్‌కు చెందిన ఫోర్డు ఫౌండేషన్‌  దీనికి టెలిస్కోప్‌ బహూకరించింది. పిల్లలు, పెద్దలు ఎవరికైనా ప్రవేశ రుసుం  40 రూపాయలు. కనీసం పదిమందికి పైగా వస్తేనే ప్రదర్శన వేస్తారు. కొండపై గ్రంథాలయం ఒకటుంది. ఇందులో మహాత్మాగాంధీ జీవితానికి సంబంధించినవి, ఆయన స్వయంగా రాసిన పుస్తకాలు దాదాపు వెయ్యి ఉంటాయి. ఇంకా పలు ఛాయాచిత్రాలు చూడవచ్చు. పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా పార్కులున్నాయి. 

దశలవారీగా అభివృద్ధి...
రాష్ట్ర విభజన అనంతరం 2017లో కొత్తగా ఆంధ్రప్రదేశ్‌ గాంధీ స్మారక నిధి పేరుతో రిజిస్టర్‌ అయింది. కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. ప్రస్తుతం గాంధీ హిల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టనున్నారు. ముందుగా కొండను సుందరీకరించనున్నారు. ఘాట్‌ రోడ్డు ప్రారంభంలో ఆర్చ్‌ని అందంగా తీర్చిదిద్దుతారు. అక్కడి నుంచి స్థూపం వరకు అప్రోచ్‌ రోడ్డును అభివృద్ధి చేస్తారు. పచ్చదనాన్ని మరింత పెంచుతారు. పిల్లలు ఆడుకునే ఆట ప్రదేశాల్లో కొత్త పరికరాలను అమర్చుతారు. ఇవన్నీ అక్టోబరు రెండు నాటికి పూర్తయితే గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. గాంధీ కొండను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి  సమగ్ర ప్రణాళికతో ముందుకెళుతున్నామని గాంధీ స్మారక నిధి చైర్మన్‌ గాంధీ పి.సి. కాజా చెప్పారు.
ఫొటోలు: కిశోర్‌ నడిపూడి సాక్షి–విజయవాడ

పర్యాటకానికి అండ గాంధీ కొండ
విజయవాడ నగరంలో పర్యాటకంగా ప్రసిద్ధిగాంచిన ప్రదేశాల్లో గాంధీ కొండ ఒకటి. టాయ్‌ ట్రైన్‌ తిరిగినప్పుడు పిల్లలు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. ఇప్పుడది మరమ్మతులకు గురైంది. మరో ఏడాదిన్నరకుగాని పట్టాలెక్కదు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 8–30 గంటల వరకు కొండను సందర్శించవచ్చు. ఎంట్రన్‌్స టికెట్‌ 10 రూపాయలు. ప్రతి మంగళవారం సెలవు. రైల్వే స్టేషన్‌ పశ్చిమ ద్వారానికి అతి సమీపంలో ముఖ ద్వారం ఉంటుంది. కాలినడకన వెళ్లవచ్చు. పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి 1.9 కిలోమీటర్ల దూరంలో ఉంది. 
∙ఉప్పలూరి రవితేజ, మేనేజర్‌–గాంధీ హిల్‌

 

Advertisement
 
Advertisement
Advertisement