అడగగానే ఇవ్వొద్దు.. ఆలోచించనిద్దాం! | Precautions To Be Taken For Long Term Mental Health Issues | Sakshi
Sakshi News home page

అడగగానే ఇవ్వొద్దు.. ఆలోచించనిద్దాం!

Jul 2 2026 11:13 AM | Updated on Jul 2 2026 12:41 PM

Precautions To Be Taken For Long Term Mental Health Issues

పుణేలో కోట అంచున నిలబడ్డ ప్రేమ ఒక్కతోపుతో హత్యగా మారింది. బెంగళూరులో నట్టనడి ఇంట్లో నిలుచున్న ప్రేమ నెత్తురు పారించింది. ఈ రెండు ఘటనలూ ‘ఇప్పుడే కావాలి’ అనే ఆవేశానివే. ‘ఇవ్వాళ ఆలోచించి రేపు మాట్లాడాలి’ అనే సంస్కారం పోయి ‘ఇప్పుడే తేల్చేయాలి’ అనే తెంపరితనం ఇది. దీని పేరు – ఇన్‌ స్టంట్‌ గ్రాటిఫికేషన్‌. అంటే ‘తక్షణ సంతృప్తి’ అనే మానసిక జ్వరం. బిర్యానీ నుంచి బంధాల వరకు, ప్రోటీన్‌  షేక్‌ నుంచి ప్రతీకారం వరకు– అంతా ‘క్విక్‌ డెలివరీ’ కావాల్సిందే. వేచి చూడలేని మనసు వేటు వేయడానికి వెనుకాడడం లేదు. ఓపిక నేర్పని ఫోన్‌ లు... ఓదార్పు మరచిన జెన్‌  జెడ్‌. మెదడులో ‘పాజ్‌’ బటన్‌  చెడిపోతే జీవితం ‘ఫాస్ట్‌ఫార్వర్డ్‌’లో నేరం వైపు పరుగెడుతుంది. ఇది ట్రెండ్‌ కాదు, టైం బాంబ్‌. ఆపకపోతే ప్రతి ఇల్లు ఒక క్రైమ్‌ సీన్‌  అవుతుంది. ‘ఇప్పుడే వద్దు, కాస్త ఆగి ఆలోచించండి’...  ఈ ఒక్క మాటే ఇవాళ మీ పిల్లలకు మీరు ఇవ్వాల్సిన ఆస్తి.

‘ఈరోజే... ఇప్పుడే’ ‘ధనా ధన్‌ ఫటా ఫట్‌’ ధోరణి అనేది సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ ప్రతిపాదించిన ఆనంద సూత్రం(ప్లెజర్‌ ప్రిన్సిపుల్‌). ఇదిప్రాథమిక అవసరాలను తక్షణమే తీర్చుకోవడానికి, బాధను తప్పించుకోవడానికి ప్రేరేపించే ఒక సహజ ప్రవృత్తి... ప్లెజర్‌ ప్రిన్సిపుల్‌. ఫ్రాయిడ్‌ ప్రతిపాదించిన ఈ సూత్రం మానవ మనస్తత్వంలోప్రాథమిక నియంత్రణ శక్తిగా పనిచేస్తుంది.

దీర్ఘకాలిక మానసిక సమస్య
‘ఇప్పటి ఈ ఇన్‌స్టంట్‌ గ్రాటిఫికేషన్‌ వల్ల దీర్ఘకాలికంగా కొన్ని మానసిక సమస్యలకు రావచ్చు. తాము కోరుకున్నది తక్షణమే నెరవేరాలని ఆశించేలా చేస్తుంది... ఇన్‌స్టంట్‌ గ్రాటిఫికేషన్‌. దీనివల్ల వేచి ఉండడం, ఓపికగా ఉండే గుణం తగ్గిపోతుంది. నిరంతర తృప్తి తొందరపాటును సృష్టిస్తుంది. తట్టుకునే శక్తిని తగ్గిస్తుంది. ఎదురుదెబ్బలు తట్టుకోలేమనే భావన కలిగిస్తుంది’ అని హెచ్చరిస్తున్నారు కోల్‌కతాలోని సీఎంఆర్‌ఐ ఆసుపత్రి సైకియాట్రిస్ట్‌ డా.అంబరీష్‌ ఘోష్‌.

ఇన్‌స్టంట్‌ గ్రాటిఫికేషన్‌ కారణంగా జెన్‌ జెడ్‌ వినియోగ విధానాలలో, వ్యక్తిత్వంలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏకాగ్రత తగ్గిపోవడంతో... టీ 20 మ్యాచ్‌లకుప్రాధాన్యత పెరిగింది, థియేటర్‌లకు వెళ్లడం కంటే ఓటీటీప్రాచుర్యం పొందింది.

తొందరపాటు వద్దు
మార్కెట్‌కు వెళ్లి బేరసారాలు చేసి, ఆ తర్వాత వంట చేయడాన్ని చాలామంది శ్రమగా భావిస్తున్నారు. దీంతో త్వరిత డెలివరీ యాప్‌లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇలా ఆధారపడడం అనేది తొందరపాటు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి దారి తీయవచ్చు. ఆటిస్టిక్‌ లక్షణాలతో అనేక సవాళ్లకు దారితీయవచ్చు’ అని హెచ్చరిస్తున్న ఘోష్‌...
ఇన్‌స్టంట్‌ గ్రాటిఫికేషన్‌ ప్రభావాన్ని తగ్గించడానికి... సహనం పెరిగేలా చేయడం, ఆలస్యంగా లభించే ప్రతిఫలాలను ప్రోత్సహించడం, సామాజిక విలువలను పెంపొందించడం తప్పనిసరి’ అని సలహా ఇస్తున్నారు.

క్విక్‌–ఫిక్స్‌ థింకింగ్‌
‘మనం చేసే పనులు, మనం శ్రద్ధ పెట్టే విషయాలకు స్పందనగా మన మెదళ్లు నిరంతరం మారుతుంటాయి. ఉదాహరణకు... మనం తొందరపడి అనారోగ్యకరమైన చిరుతిండి తిన్నా, ఆన్‌లైన్‌లో ఏదైనా కొన్నా, ఆ చర్యలకు సంబంధించి మన మెదడు మార్గాలు బలపడతాయి. ఇదే తరువాత బలమైన అలవాటుగా మారుతుంది. ఆ అలవాటుకు దూరం కావడం కష్టమవుతుంది.

తక్షణ సంతృప్తి(ఇన్‌స్టంట్‌ గ్రాటిఫికేషన్‌) వైపు దారి తీసే పనులు అనారోగ్యకరమైన, అనాలోచిత ప్రవర్తనకు దారి తీసేలా చేస్తాయి. కాలక్రమేణా...శరీరంపై తీవ్రమైన భారం మోపేలా చేస్తాయి. ఆసక్తిని రేకెత్తించే ఏ ఆన్‌లైన్‌ వస్తువైనా వెంటనే కొనెయ్యాలనుకోవడం క్రెడిట్‌ కార్డ్‌పై అదనపు భారాన్ని మోపుతుందనేది ఒక విషయం అయితే, మరొకటి... కుటుంబసభ్యులతో గడుపుతున్నప్పుడు కూడా సోషల్‌ మీడియా చూడాలనిపిస్తుంది. దీంతో కుటుంబసభ్యులతో పొడి పొడిగా మాట్లాడడం, యాంత్రికంగా సంభాషించే ధోరణి పెరుగుతుంది. తక్షణ సంతృప్తినిచ్చే వాటి కోసం అన్వేషణ సాగిస్తున్న కొద్దీ, ఆ ఫలితాన్ని అందుకోవడానికి చాలాకాలం ముందే మన మెదళ్లలో డోపమైన్‌ ఉప్పొగుతుంది’ అని చెబుతున్నాడు మానసిక విశ్లేషకుడు ఆస్టిన్‌ పెర్ల్‌మటర్‌. తక్షణ సంతృప్తి (ఇన్‌స్టంట్‌ గ్రాటిఫికేషన్‌)లోని ప్రతికూల కోణాలపై ‘ది రియల్‌ ఇష్యూ విత్‌ ఇన్‌స్టంట్‌ గ్రాటిఫికేషన్‌: హౌ క్విక్‌–ఫిక్స్‌ థింకింగ్‌ క్రియేట్స్‌ప్రాబ్లమ్స్‌’ పేరుతో విశ్లేషణాత్మక వ్యాసం రాశాడు ఆస్టిన్‌.

దూరంగా ఉన్నవారే... విజయానికి దగ్గరయ్యారు...
స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ చేసిన ఒక అధ్యయనం...
‘తక్షణ తృప్తికి దూరంగా ఉండే పిల్లలు ఎన్నో విజయాలు సాధించారు’ అని చెబుతోంది.
ఈ అధ్యయనంలో భాగంగా... ఒక పిల్లవాడికి తక్షణం అందే ఒక చిన్న బహుమతి, కొంత సమయం వేచి ఉంటే రెండు చిన్న బహుమతులు... అని రెండు ఆప్షన్‌లు ఇచ్చారు.
రెండో ఆప్షన్‌ వైపు మొగ్గు చూపిన పిల్లలు ఆ తరువాత కాలంలో చదువులలో మంచి విజయం సాధించారు. పెద్దయ్యాక ఎక్కువ ఆదాయం సంపాదించారు.

స్టాన్‌ఫోర్డ్‌ స్టడీ ఇలా చెప్పింది...
∙ఆకస్మిక కోరిక లేదా బలమైన కోరిక స్వీయ–నియంత్రణతో దగ్గరి సంబంధం ఉంటుంది ∙వేచి ఉండడానికి ఇష్టపడే వారిలో ప్రీ ఫ్రంటల్‌ కార్టెక్స్‌ కాస్త గట్టిగా ఉంటుంది ∙ప్రీ ఫ్రంటల్‌ కార్టెక్స్‌ అనేది మెదడులోని ఫ్రంటల్‌ లోబ్‌ ముందు భాగం. ఇది కార్యనిర్వహణ విధులకు మెదడుకు సంబంధించి నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది ∙చాలామంది తక్షణ సంతృప్తి కోసం ఎందుకు ఆరాటపడతారో చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది... ఆలస్యాన్ని భరించలేకపోవడం. ‘ఇప్పుడే దొరుకుతుంది. ఎందుకు వేచి చూడాలి’ అని అనుకోవడం. తక్షణ సంతృప్తిని కోరుకునే వారు మాదకద్రవ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. ఊబకాయంతో పాటు అనేక ఇతర సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. వారు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో కూడా ఇబ్బంది పడుతుంటారు. మానసిక లోపాలతో బాధపడతారు ∙తక్షణ సంతృప్తి అనేది ఒక వ్యాధా? బహుశా కావచ్చు. మన జీవితాలను క్రమబద్దీకరించుకోవాలి. మన కోరికలను నియంత్రించుకోవాలి. ‘ఇప్పుడే కావాలి’ అనే వ్యాధిని 
నిర్మూలించాలి.

డిలేడ్‌ గ్రాటిఫికేషన్‌... చాలా కష్టమా?
∙ఆధునిక సంస్కృతి తక్షణ ఫలితాలు, సౌకర్యాలను గతంలో కంటే చాలా సులభంగా అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ‘వేచి ఉండడం’ అనేది తగ్గిపోతుంది. వేచి ఉండడం కష్టం అనిపిస్తుంది. ∙భవిష్యత్‌పై దృష్టి, ప్రణాళిక లేని వారికి డిలేడ్‌ గ్రాటిఫికేషన్‌ (నిదానంగా సంతృప్తి పడడం) కష్టంగా అనిపిస్తుంది 
∙ఒత్తిడి, విసుగు, ఆందోళనలాంటివి డిలేడ్‌ 
గ్రాటిఫికేషన్‌ దూరమయ్యేలా చేస్తాయి.

డిలేడ్‌ గ్రాటిఫికేషన్‌కు దగ్గరవ్వాలంటే...
∙దీర్ఘకాలిక లక్ష్యాల గురించి ఎప్పటికప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి ∙మీ లక్ష్యాలను రాసుకోండి. ప్రతిరోజూ మీరు చూసే చోట అవి కనిపించాలి ∙లక్ష్యాలను చిన్న చిన్న పార్ట్స్‌గా విభజించుకోండి ∙ఫైనల్‌ రిజల్ట్‌ కంటే ఎప్పటికప్పుడు మీరు సాధిస్తున్న ఫలితాలపై దృష్టి పెట్టండి ∙లక్ష్యంలో ఒక చిన్న భాగానికి చేరువైనప్పుడు మీకు మీరే గిఫ్ట్‌ ఇచ్చుకోవాలి. ఉదాహరణకు... మీకు ఇష్టమైన స్వీటు ఆరోజు హాయిగా తినవచ్చు ∙ఎప్పుడైనా ఇన్‌స్టంట్‌ గ్రాటిఫికేషన్‌ వైపు మనసు లాగితే, దారి మళ్లించడానికి బయటకు వెళ్లి నడవడమో, ఫ్రెండ్‌కు ఫోన్‌ చేయడమో, ఇష్టమైన సినిమా చూడడమో... ఇలాంటి పనులు చేయాలి.

ఇన్‌స్టంట్‌ వర్సెస్‌ డిలేడ్‌ గ్రాటిఫికేషన్‌..
డబ్బు
ఇన్‌స్టంట్‌: పెద్దగా అవసరం లేకపోయినా సరే, కొత్త స్మార్ట్‌ ఫోన్‌ కొనడం.
డిలేడ్‌: ఫోన్‌ కొనాలనుకున్న డబ్బును పొదుపు చేసి అవసరమైనప్పుడే కొనడం.

ఎంటర్‌టైన్‌మెంట్‌
ఇన్‌స్టంట్‌: రాత్రంతా ఫోన్‌లో షోలను అక్కడొక సీన్‌ ఇక్కడొక సీన్‌ అన్నట్లుగా చూడడం.
డిలేడ్‌: ఈ రోజు కొన్ని భాగాలే చూస్తాను. రేపు మరికొన్ని... అని విభజించుకోవడం.

షాపింగ్‌
ఇన్‌స్టంట్‌: ఆన్‌లైన్‌లోనో, సూపర్‌ మార్కెట్‌లోనో కొత్త వస్తువును చూసినప్పుడు ‘అరే ఇది ఈరోజే కొనెయ్యాలి’ అనిపిస్తుంది.
డిలేడ్‌: ఒక వారం ఓపిక పట్టాలి. ‘ఆ వస్తువు నాకు నిజంగా అవసరమా?’ అని విశ్లేషించుకోవాలి.

కెరీర్‌
ఇన్‌స్టంట్‌: భవిష్యత్‌లో పురోగతి లేకపోయినా ఎక్కువ జీతానికి ఆశపడి ఉద్యోగంలో చేరడం.
డిలేడ్‌: తక్కువ జీతమైనా సరే, మంచి భవిష్యత్‌ ఉన్న ఉద్యోగాన్ని ఎంచుకోవడం.

రిలేషన్‌షిప్స్‌..
ఇన్‌స్టంట్‌: మీ సన్నిహితులతో ఎప్పుడో ఒకసారి వాగ్వాదం జరగవచ్చు. అలాంటి సందర్భంలో ఏదో ఒకటి ఎదుటి వ్యక్తిని కసిగా అనాలనిపిస్తుంది.
డిలేడ్‌: వాదనలో ప్రతి మాటను జాగ్రత్తగా, ఆచితూచి ఉపయోగించాలి. దీనివల్ల ఎంత పెద్ద వివాదమైనా సంబంధాలు తెగిపోవు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement