ప్రేమకు పసిపిల్లలే! | They are like little children when it comes to love | Sakshi
Sakshi News home page

ప్రేమకు పసిపిల్లలే!

Aug 17 2026 12:39 AM | Updated on Aug 17 2026 12:39 AM

They are like little children when it comes to love

తాత్త్వికథ

ఆమె పట్టణంలోనే పెద్ద పేరున్న వైద్యురాలు. వందలాది ఆపరేషన్లు విజయవంతంగా చేసి రోగుల మన్ననలు పోందిన డాక్టర్‌ ఆమె. అలాంటి డాక్టర్‌ ఓ రోజు రాత్రి పది గంటల సమయంలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తోంది. అప్పుడే ప్రాక్టీసు ముగించుకుని వచ్చిన ఆమె భర్త అది చూసి ఆశ్చర్యపోయాడు. ఆయనొక పేరున్న మానసిక వైద్యుడు. వారికి పెళ్లై మూడు పుష్కరాలు దాటినా ఆమె కళ్ళలో అతడెప్పుడూ తడి చూడలేదు. దాంతో అతడు మొదటిసారిగా చలించాడు. ఎందుకు ఏడుస్తున్నావని రెండుమూడు సార్లు అడిగాడు. ఆమె ఏడుపు మరింత పెద్దది చేసింది కానీ సరైన సమాధానమివ్వలేదు.

పక్కకి వెళ్ళి నర్సింగ్‌ హోమ్‌ నిర్వాహకుడికి ఫోన్‌ చేశాడు. ఈ రోజు రోగులతో ఇబ్బంది కానీ, పేచీ కానీ వచ్చిందేమోనని అడిగాడు. అలాంటిదేమీ లేదని అక్కడి నుంచి సమాధానమొచ్చింది. ఆమె ఏడుపునకు కారణం ఏమై ఉంటుందా అని గది అంతా కళ్ళతోనే వెదికాడు. ఆమె పక్కనే మొబైల్‌ ఉండటం గమనించాడు. మొబైల్‌ ని ఓపెన్‌ చేసి చూశాడు.

అర్థ గంట ముందే మధురైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న కొడుకుతో వీడియో కాల్‌ చేసి మాట్లాడి ఉండటం గమనించాడు. పని ఒత్తిడి వల్ల కొడుకు తల్లిని కోపంగా మాట్లాడి ఉంటాడని భావించి ఆమెను అదే విషయం అడిగాడు. ఏడుస్తూనే అలాంటిదేమీ లేదని చెప్పింది. పోనీ కోడలుతో పేచీ పడ్డావా అని ప్రశ్నించాడు. చేత్తో కన్నీటిని తుడుచుకుంటూనే తలని అడ్డంగా తిప్పింది.

చిన్నగా వెన్నెల్లో నడుద్దాం రమ్మని మిద్దె మీదకు పిలిచాడు. అక్కడ కొద్దిసేపు నడిచాక ఆమె మళ్ళీ భోరున ఏడుస్తూ ‘‘మనవరాలికి ఆరవ నెలలో వేయాల్సిన టీకాలు వేశారటండీ! లేత ఒళ్ళు... ఎర్రగా కందిపోయి ఉంటుంది. లోకం తెలియని పసిబిడ్డ. గుక్క తిప్పుకోకుండా ఏడ్చిందట. పాపం... ఎంత నొప్పి ఉంటే అంతగా ఏడ్చి ఉంటుంది’’ అని ముక్కు చీదుతూ చెప్పింది. మానసిక వైద్యుడైన భర్త చిన్నగా ఆమెను ఓదారుస్తూ ‘ఆ బిడ్డ కాదు పసిపిల్ల. నువ్వు పసిపిల్ల. అందుకే అలా ఏడుస్తున్నావు. టీకాలు బిడ్డ మంచి కోసమే కదా వేసేది. ఈరోజు నొప్పి అని వేయకుంటే భవిష్యత్తులో సమస్యలొస్తాయి కదా’ అని నచ్చజెప్పి ఆమెను పడకగదికి తీసుకొచ్చి పడుకోబెట్టాడు.

నిద్రపోతున్న ఆమెను చూస్తూ ‘విద్య, వైద్యం, డబ్బు, అధికారం, పేరు, ప్రతిష్ఠ, సంపద, వయసు... అన్నీ ప్రేమ ముందు బలాదూర్‌... అందుకే ఎంత వారలైనా మనవళ్ళపై ఉండే ప్రేమ ముందు వారు సాధారణమైన తాత, అమ్మమ్మలుగానే మారిపోతారు. అందరూ ఆ విషయంలో ప్రేమదాసులే’ అనుకున్నాడు సైక్రియాటిస్ట్‌.    
    
– ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement