ఫండే
కథాకళి
నేను తిరిగి వచ్చేసరికి ఆయన నా గది ముందు నాకోసం వేచిచూస్తూ కనపడ్డాడు. నేను తలుపు తాళం తీశాక నన్ను పలకరించాడు.
‘‘నీతో మాట్లాడాలి.’’
ఆయనవంక తేరిపార చూశాను. ఏభై పైనే ఉంటుంది. ఆరోగ్యవంతమైన శరీరం. ముప్పాతిక వంతు బట్టతల. ఐదు అడుగులు మించి లేడు. ఇన్ షర్ట్, టై.
‘‘నాతో ఏం పని సార్?’’ సందిగ్ధంగా అడిగాను.
‘‘నీ గురించి నాకు అంతా తెలుసు. నువ్వు బయటకి వచ్చి ఇవాళ్టికి ఐదో రోజు. మొదటి రెండు రోజులూ నువ్వు గదిలోంచి బయటకి రాలేదు. నీ మిత్రుడే ఫేక్టరీకి వెళ్ళాడు. జైల్లో మూడేళ్ళు ఆల్కహాల్‌కి దూరంగా ఉన్నావు. ఆ అలవాటు ఉన్నవాళ్ళకి దాన్ని తాగాలని ఉంటుంది. అందుకు డబ్బు కావాలి.’’ ఆయన చిరునవ్వుతో చెప్పేది ఆపాడు.
‘నా గురించి ఈయన ఇదంతా ఎలా తెలుసుకున్నాడు? నాతో ఏం అవసరం ఈయనకి’ అని ఆలోచించాను. తృప్తికరమైన జవాబు రాలేదు. గదిలోని ఏకైక కుర్చీని చూపించి, నేను గోడకి ఆనించి వేసిన పరుపు చుట్టమీద కూర్చున్నాను. ఆ బీదగదిని చూశాక ఆయన మొహంలో ఏవగింపు కనిపించింది.
‘‘నీకో ఏభై వేల రూపాయలు ఇవ్వాలని వచ్చాను.’’ విషయంలోకి వస్తూ ఆయన సూటిగా వచ్చాడు.
ఆయన వంక ప్రశ్నార్థకంగా చూశాను.
‘‘నువ్వో ఏభై వేల రూపాయలని బేంక్ కేషియర్ నుంచి తీసుకుని, జేబులో పెట్టుకుని నడిచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. నిన్నెవరూ అడ్డగించరు.’’
‘‘ఏ బేంక్?’’
‘‘ఇంపీరియల్ బేంక్.’’
‘‘దానివల్ల మీకేం లాభం?’’
‘‘అది నీకు అనవసరం. నెహ్రూ నగర్ బ్రాంచ్‌లోని ఆ బేంక్‌కి నువ్వు ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నరకి రా. లంచ్ సమయం కాబట్టి నువ్వు లోపలకి రాగానే తలుపుని అరగంటపాటు మూసేస్తారు. బేంక్ మేనేజర్ గదిలోకి వెళ్ళి రివాల్వర్ చూపించి బెదిరిస్తే ఆయన నగదున్న వాల్ట్‌ని తెరుస్తాడు. అందులో ఏభై వేలుంటాయి. దాంతో నువ్వు వెళ్ళిపోవచ్చు.’’
‘‘లేదా పట్టుబడచ్చు. నేను బేంక్ దొంగని కాను.’’ చెప్పాను.
‘‘జేబుదొంగవని తెలుసు. కాని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ నిన్నెవరూ అడ్డగించరు. జేబు కొట్టేస్తే పట్టుబడే రిస్క్ ఉంటుంది. జేబుదొంగతనం కన్నా ఇది రిస్క్ లేని చాలా తేలికైన పని.’’
‘‘నా వృత్తికి రివాల్వర్ అవసరం లేదు. అది లేదు.’’
ఆయన మౌనంగా జేబులోంచి ఓ రివాల్వర్ తీసి ఇచ్చాడు. అందుకుంటే తేలిగ్గా ఉంది. అచ్చం రివాల్వర్‌లా కనిపించే అది గట్టి నల్ల రబ్బర్‌తో చేసిన ఆటవస్తువని గ్రహించాను.
‘‘నేను ఎప్పుడైనా మీ జేబు కొట్టేశానా? అందువల్ల మీకు తీవ్ర నష్టం వచ్చి నన్ను ఇరికించాలని పథకం వేశారా?’’ అడిగాను.
ఆయన సన్నగా నవ్వి తల అడ్డంగా ఊపాడు.
‘‘లేదు, ఇది పగకి చెందిన పథకం కాదు. జైల్ వార్డెన్ నా ఫ్రెండ్. నీలాంటి వారి గురించి అడిగితే, ఐదు రోజుల క్రితం విడుదలైన నీ గురించి చెప్పాడు.’’
‘‘దీనివల్ల మీకు వచ్చే లాభం ఏమిటన్న ప్రశ్నకి నాకు జవాబు కావాలి. అంతదాకా నేను సరే అనలేను.’’
ఆయన చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.
‘‘అందులో పని చేసే కేషియర్ నా అల్లుడు. కొన్ని రోజులక్రితం ఆ వెధవ నిర్లక్ష్యంగా తీసుకున్న నోట్లు దొంగనోట్లు అని తెలిసింది. అంత పెద్ద మొత్తం నోట్లని అసలు వాటితో రీప్లేస్ చేసే అవకాశం మా కుటుంబంలో ఎవరికీ లేదు. దాంతో వాటిని దొంగిలిస్తే అది బయటపడదు. ఈ రోజు కేష్‌ని ట్రెషరీకి పంపాలి. పంపితే ఇది బయటపడి ఆ వెధవ జైలుకి వెళ్తాడు.’’
‘‘కాని ఆ దొంగనోట్ల వల్ల నాకేం ప్రయోజనం? నేను మరోసారి జైలుకి వెళ్తాను.’’
ఆయన సన్నగా నవ్వి చెప్పాడు.
‘‘అందుకే ఏభై వేలు నీవి అన్నాను. అవి మంచి నోట్లు. మిగిలినవి తీసేస్తాడు.’’
ఆయన చెప్పిందాని గురించి ఆలోచించాను. ఆయన ప్రవర్తన, మాటల తీరుని బట్టి నాకు ఎలాంటి అనుమానం కలగలేదు.
‘‘సరే.’’ ఒప్పుకున్నాను.
ఆయన నాతో కరచాలనం చేసి బయటకి వెళ్తూ చెప్పాడు.
‘‘గుర్తుంచుకో. సరిగ్గా ఒకటిన్నరకి. రెండున్నరకి డబ్బుని ట్రెషరీకి పంపుతారు. మా వాడి ఉద్యోగాన్ని నిలబెట్టినందుకు నేను సర్వదా కృతజ్ఞుడ్ని.’’ నా చేతులు పట్టుకుని చెప్తూంటే ఆయన గొంతు డగ్గుత్తికైంది.
‘‘నన్ను తోడుదొంగని చేస్తున్నారు.’’ నవ్వుతూ చెప్పాను.
∙∙
సరిగ్గా పన్నెండున్నరకి ఇంపీరియల్ బేంక్ రీజనల్ మేనేజర్‌కి ఫోన్ చేసి నేను చెప్పదలచుకున్నది చెప్పాను. మర్నాడు దినపత్రికలో ఆ వార్త మొదటి పేజీలో వచ్చింది.
‘ఇంటిదొంగ’
నిన్న మధ్యాహ్నం ఒకటిన్నరకి ఇంపీరియల్ బేంక్, నెహ్రూనగర్ బ్రాంచ్‌ని ఆడిటర్స్ ఆకస్మికంగా తనిఖీ చేస్తే, ఏభై మూడు లక్షలు మాయమయ్యాయని తెలిసింది. సిబ్బంది ఇళ్ళని, వారి బంధువుల ఇళ్ళని వెదికితే మేనేజర్ వియ్యంకుడి తమ్ముడి ఇంట్లో ఆ సొమ్ము దొరికింది. దాన్ని ట్రెషరీకి తరలించి ఆ దొంగని, మేనేజర్ని అరెస్ట్ చేశారు. ఆర్నెలల్లో రిటైరయ్యే ఆ మేనేజర్ తన తప్పుని ఒప్పుకున్నాడు.
ఆ వార్తతో ప్రచురించిన ఫొటోలోని తోడుదొంగ నా దగ్గరకి వచ్చినాయనదే!
- మల్లాది వెంకట కృష్ణమూర్తి
ఇదీ చదవండి: ఈ వారం కథ: నాచ్ కా ఘోడా.. నవరంగ్ కా బాజా!


