నరసాపురం : కొంతకాలంగా భగ్గుమన్న బంగారం ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1.80 లక్షల ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరగా, ఇటీవల గణనీయంగా దిగివచ్చింది. శుక్రవారం నరసాపురం మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,29,500, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,150గా నమోదైంది. 15 రోజుల క్రితం రూ.1.15 లక్షలు ఉన్న 8 గ్రాముల కాసు ధర ఇప్పుడు రూ.95,320కి పడిపోయింది. 1985 తర్వాత ఈ స్థాయి పతనం ఇదే తొలిసారని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. డాలర్ బలపడటం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 3,553 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ధరలు మరింత తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో, కొనుగోలు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ప్రజలు ఉన్నారు.
జిల్లాలో రూ.500 కోట్ల నష్టం
గత కొన్నేళ్లుగా బంగారం సురక్షిత పెట్టుబడిగా భావించి, కొందరు అప్పులు చేసి మరీ పసిడి కొన్నారు. ఇప్పుడు ధరలు పడిపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో సుమారు రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధరలు ఇంకా తగ్గుతాయేమోనని కొత్త కొనుగోలుదారులు వేచి చూస్తుండగా, పాత వారు ధరలు పెరిగితే అమ్ముదామనే ఆలోచనలో ఉన్నారు.
బ్యాంకులు, వ్యాపారుల్లో ఆందోళన
బంగారంపై రుణాలు మంజూరు చేసిన బ్యాంకులు, వ్యాపారుల్లో కలవరం మొదలైంది. గతంలో జాతీయ బ్యాంకులు గ్రాముకు రూ.9,000 వరకు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపారులు రూ.12,000 వరకు రుణాలు ఇచ్చాయి. ధరలు తగ్గడంతో రుణాల రికవరీపై సంస్థలు దృష్టి సారించి, ఖాతాదారులకు నోటీసులు పంపుతున్నాయి. తాకట్టు బంగారం విలువ తగ్గితే చివరికి వ్యాపారులే నష్టపోవాల్సి వస్తుందని నరసాపురం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రికార్డు స్థాయిలో పడిపోయిన పసిడి ధరలు
రూ.లక్ష దిగువకు కాసు ధర
ధరలు తగ్గినా పెరగని అమ్మకాలు
గందరగోళంలో కొనుగోలుదారులు
అయోమయంలో వ్యాపారులు


