శ్రీవారి సన్నిధిలో వేతన కష్టాలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి సన్నిధిలో వేతన కష్టాలు

Nov 21 2026 12:26 AM | Updated on Nov 21 2026 12:26 AM

శ్రీవారి సన్నిధిలో వేతన కష్టాలు

● పారిశుద్ధ్య కార్మికులకు అందని వేతనాలు

● కాంట్రాక్ట్‌ సంస్థ తీరుపై ఆగ్రహం

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న సన్నిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతన కష్టాలు తప్పడం లేదు. నెల గడిచి 20 రోజులైనా గత నెల జీతాలు అందకపోవడంతో వారికి కుటుంబ పోషణ భారంగా మారింది. చాలీచాలని వేతనాలు సైతం సకాలంలో అందకపోవడంతో నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. స్వామీ.. మా కష్టాలు తీర్చవా అంటూ శ్రీవారిని వేడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌ 1 నుంచి దేవస్థానంలోని పారిశుద్ధ్య, ఇతర సాంకేతిక పనులను (ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌, ఏసీ మెకానిక్‌, కార్పెంటర్‌, మేసన్‌) తిరుపతికి చెందిన పద్మావతి హాస్పిటాలిటీ అండ్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ సంస్థకు అప్పగించింది. ప్రస్తుతం సుమారు 165 మంది పారిశుద్ధ్య కార్మికులు, 16 మంది సూపర్‌వైజర్లు, నలుగురు ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు విధులు నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ మినహాయింపుల అనంతరం నెలకు సుమారు రూ.11 వేలు, సూపర్‌వైజర్లు, సాంకేతిక సిబ్బందికి రూ.17 వేల వరకు వేతనాలు అందుతున్నాయి.

ప్రతినెలా ఇదే తీరు

ప్రతి నెలా పదో తేదీలోపు వేతనాలు చెల్లించాల్సి ఉన్నా తరచూ జాప్యం జరుగుతోందని కార్మికులు వాపోతున్నారు. దేవస్థానం నుంచి కాంట్రాక్ట్‌ సంస్థకు బిల్లుల చెల్లింపుతో సంబంధం లేకుండా కార్మికులకు సకాలంలో వేతనాలు అందించాల్సిన బాధ్యత కాంట్రాక్టర్‌పై ఉంది. అయినా జీతాల చెల్లింపులో జాప్యంపై కార్మికులు మండిపడుతున్నారు. కాంట్రాక్టర్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బంధువన్న కారణంతో అధికారులు ప్రశ్నించేందుకు వెనుకాడుతున్నారనే ఆరోపణలు కూడా కార్మికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్‌ సంస్థ తరఫున కార్పెంటర్‌, తాపీమేసీ్త్ర అందుబాటులో ఉండాల్సి ఉన్నా.. వారు లేకుండానే పనులు సాగుతున్నాయన్న విమర్శలున్నాయి. ఇప్పటికై నా దేవస్థానం అధికారులు స్పందించి గత నెల వేతనాలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో జీతాల జాప్యం లేకుండా చూడాలని కార్మికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement