ద్వారకాతిరుమల: శ్రీవారి పుష్కరణి (నృసింహ సాగరం)లో శనివారం రాత్రి జరుగనున్న చిన వెంకన్న తెప్పోత్సవానికి సర్వం సిద్ధమైంది. స్వామి విహరించనున్న తెప్పను హంస వాహనంగా అలంకరిస్తున్నారు. భక్తులకు రక్షణకు పుష్కరణి గట్లపై బారికేడ్లు నిర్మించారు. సాగరం మధ్యలోని మండపానికి, గట్లపైన, చెట్లకు విద్యుద్దీప అలంకారాలు చేశారు. రాత్రి 8 గంటలకు స్వామి తొళక్క వాహనంపై బయలుదేరి పుష్కరణి వద్దకు చేరుకుంటారని, అనంతరం తెప్పోత్సవం ప్రారంభమవుతుందని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు.
కుక్కునూరు: మండలంలోని ఉప్పెరు పంచా యతీ పరిధిలోని ఎర్రపాడు, రెడ్డిగూడెం, తోగూడెం గిరిజన గ్రామాల్లో జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయంపై ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురించిన ‘వణికిస్తున్న విషజ్వరాలు’ కథనానికి వైద్యశాఖ అధికారులు స్పందించారు. ఆయా గ్రామాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు చేశారు. అమరవరం పీహెచ్‌సీ వైద్యురాలు దివ్యను వివరణ కోరగా గ్రామాల్లో వైరల్ ఫీవర్లు ఉన్నట్టు వెల్లడించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గ్రంథాలయాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అన్నారు. స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని తొలగించి నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఈనెల 22న హేలాపురి బాలోత్సవం సంబరాలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. బాలోత్సవం భవనంలో శుక్రవారం సమావేశమయ్యారు. నాలుగు కల్చరల్, 10 అకాడమిక్ అంశాల్లో స్థానిక కేపీడీటీ స్కూల్‌లో నిర్వహణకు ఆహ్వాన సంఘం ఏర్పాట్లు చేసినట్టు అధ్యక్షుడు కూ చిపూడి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి దేవరకొండ వెంకటేశ్వరు తదితరులు తెలిపారు.
గణపవరం: గణపవరం జెడ్పీటీసీ సభ్యుడు ఇందుకూరి రామకృష్ణంరాజుని పశ్చిమగోదావరి జి ల్లా పరిషత్ చైర్మన్ పదవి వరించింది. అనూహ్యంగా తొలిసారి ఎన్నికల బరిలో దిగిన ఆయన జెడ్పీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. ఆయన తండ్రి ఇందుకూరి సుబ్బరాజు 1987లో గణపవరం మండల తొలి మండలాధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. సుబ్బరాజు కుమార్తె మండల పరిషత్ అధ్యక్షురాలిగా పనిచేశారు.
చింతలపూడి: చింతలపూడి, పరిసర ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు ఏలూరు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కేఎం అంబేడ్కర్ తెలిపారు. శుక్రవారం చింతలపూడి విద్యుత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకునే ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్ల పైకప్పులపై ప్రభుత్వమే ఉచితంగా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుందని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


