ఆగిరిపల్లి: సూది గట్టుపై గ్రావెల్ తవ్వాలని చూస్తే సహించేది లేదని వడ్లమాను గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ నాయకులు హెచ్చరించారు. మండలంలోని వడ్లమానులోని సూది గట్టుపై 15 ఎకరాల్లో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఉన్నాయంటూ సర్వే నిర్వహించేందుకు వచ్చిన ప్రతినిధులను గ్రామస్తులు శనివారం అడ్డుకున్నారు. సర్వే విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని ప్రతినిధులను నిలదీశారు. ప్రభుత్వం గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందని, కొలతలు తీసుకోకుండా తమను అడ్డుకోవడానికి మీరెవరంటూ ప్రతినిధులు ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రతినిధులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సూది గట్టుపై గ్రావెల్ తవ్వకాలకు ఎవరైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. గతంలోనూ అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో సూది గట్టుపై గ్రావెల్ తవ్వకాలకు ప్రయత్నించగా, అప్పటి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సహకారంతో పోరాటం చేసి తవ్వకాలను అడ్డుకున్నామన్నారు. సూది గట్టుపై గ్రావెల్ తవ్వకాలు జరపకుండా హైకోర్టు స్టే విధించిందని, అలాంటప్పుడు మైనింగ్ కోసం ప్రభుత్వం అనుమతులు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. కొండపై తవ్వకాలు జరిగితే పశువులకు పశుగ్రాసం కొరత ఏర్పడి తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సూది గట్టుపై ఎలాంటి గ్రావెల్ తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీటీసీ సభ్యులు రాణి మేకల సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ నాయకులు కుప్పాల నాగరాజు, రాణి మేకల శోభన్‌బాబు, నాయకులు ఉన్నారు.


